Saturday, November 15, 2025
HomeతెలంగాణLAND SCAM: బోగస్‌ నంబర్లతో రూ.450 కోట్ల ఆస్తికి ఎసరు.. ఎక్కడంటే..?

LAND SCAM: బోగస్‌ నంబర్లతో రూ.450 కోట్ల ఆస్తికి ఎసరు.. ఎక్కడంటే..?

Hyderabad GHMC land scam : కంటికి కనిపిస్తున్నది ఖాళీ స్థలం.. కానీ కాగితాలపై మాత్రం అక్కడ పది భారీ బంగ్లాలు వెలిశాయి! వాటికి ఇంటి నంబర్లు ఉన్నాయి, ఆస్తి పన్ను కూడా కడుతున్నారు! నమ్మశక్యంగా లేకపోయినా, జీహెచ్‌ఎంసీ అల్వాల్ సర్కిల్‌లో జరిగిన ఈ అద్భుతం వెనుక, ఓ ఉన్నతాధికారి కనుసన్నల్లో రూ.450 కోట్ల విలువైన ప్రభుత్వ, వివాదాస్పద భూమిని కొట్టేసేందుకు పన్నిన భారీ కుట్ర దాగి ఉంది. విజిలెన్స్ విచారణతో వెలుగులోకి వచ్చిన ఈ అక్రమాల పుట్టపై ప్రత్యేక కథనం.

- Advertisement -

అల్వాల్‌ గ్రామంలోని సర్వే నంబర్లు 573, 574లలో ఉన్న సుమారు 9 ఎకరాల భూమిపై కొందరు కన్నేశారు. ఈ భూమిలో కొంత భాగంపై కోర్టులో వివాదం నడుస్తోంది.

అధికారి అభయం: ఈ మొత్తం భూమి తనదేనంటూ జనార్దన్‌రెడ్డి అనే వ్యక్తి, అల్వాల్ సర్కిల్ మున్సిపల్ ఉప కమిషనర్ శ్రీనివాసరెడ్డిని సంప్రదించగా, ఆయన అభయమిచ్చారు.

ఒకే రోజులో ఆమోదం: ఈ ఏడాది ఫిబ్రవరిలో, ఆ ఖాళీ స్థలంలో 10 భారీ బంగ్లాలు (ఒక్కొక్కటి 4,000 చ.అ. విస్తీర్ణం) ఉన్నట్లు ‘స్వీయ మదింపు’ (Self-Assessment) కింద దరఖాస్తులు చేయించి, అదే రోజున ఉప కమిషనర్ అన్నింటినీ ఆమోదించేశారు.

అధికారే.. అన్నీ తానై : నిబంధనల ప్రకారం, స్వీయ మదింపు దరఖాస్తులను క్షేత్రస్థాయిలో బిల్‌ కలెక్టర్, ట్యాక్స్ ఇన్‌స్పెక్టర్ పరిశీలించి, ఫోటోలు జత చేసి పైస్థాయికి పంపాలి. కానీ, ఈ వ్యవహారంలో ఇవేవీ జరగలేదు. ఉప కమిషనర్ శ్రీనివాసరెడ్డే, తన కింది స్థాయి అధికారుల లాగిన్ ఐడీ, పాస్‌వర్డ్‌లను స్వయంగా ఉపయోగించుకుని, వారి సంతకాలు లేకుండానే అన్ని దరఖాస్తులనూ ఆమోదించినట్లు విజిలెన్స్ విచారణలో తేలింది. ఈ అక్రమానికి సహకరించినందుకు, అధికారికి కోట్లలో ముడుపులు ముట్టినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ వ్యవహారం వెనుక అధికార పార్టీకి చెందిన ఓ కీలక నేత ఒత్తిడి ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.

విద్యుత్ శాఖదీ అదే దారి : ఈ మోసంలో విద్యుత్ శాఖ అధికారుల పాత్ర కూడా ఉన్నట్లు తెలుస్తోంది. అక్కడ నిజంగానే ఇళ్లు ఉన్నట్లు నమ్మించి, కరెంట్ స్తంభాలు, లైన్లు ఏర్పాటు చేసి, మీటర్ల కోసం కూడా రంగం సిద్ధం చేశారు. అయితే, వివాదంలో ఉన్న మరో వ్యక్తి ఫిర్యాదు చేయడంతో, ఆ లైన్లను సిబ్బంది సొంత ఖర్చులతో తొలగించారు.

ఫిర్యాదుతో బట్టబయలు : ఈ భూ వివాదంలో కోర్టు కేసులో భాగస్వామిగా ఉన్న మోహన్‌రెడ్డి అనే వ్యక్తి, ఈ బోగస్ ఇంటి నంబర్లపై జీహెచ్‌ఎంసీకి, ఆ తర్వాత రాష్ట్ర విజిలెన్స్‌కు ఫిర్యాదు చేయడంతో, ఈ భారీ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. విచారణ నివేదిక అందడంతో, జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ స్పందించి, ఆ పది బోగస్ ఇంటి నంబర్లను రద్దు చేశారు.

అయితే, ఇంతటి భారీ కుంభకోణానికి పాల్పడిన ఉప కమిషనర్ శ్రీనివాసరెడ్డిపై ఇంతవరకు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం తీవ్ర విమర్శలకు తావిస్తోంది. విజిలెన్స్ నివేదికను పరిశీలించి, తదుపరి చర్యలు తీసుకుంటామని ఉన్నతాధికారులు చెబుతున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad