Robotic technology for urban flood management : చినుకు పడితే చిత్తడి.. గంట వాన కురిస్తే భాగ్యనగరం బందీ! ఏళ్ల తరబడి నగరవాసులను వేధిస్తున్న ఈ ముంపు సమస్యకు జీహెచ్‌ఎంసీ ఇప్పుడు సాంకేతిక అస్త్రాన్ని సంధించింది. మనుషులు చేయలేని పనిని యంత్రాలతో, అదీ రోబోలతో చేయిస్తూ సరికొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టింది. మురికి కూపంలోకి దూసుకెళ్లి, గంటలోనే లారీడు పూడికను తొలగించే ఈ రోబో సైనికుడు ఇప్పుడు నగరంలో హాట్ టాపిక్‌గా మారాడు. ఇంతకీ ఈ రోబో పనితీరు ఎలా ఉంటుంది? ఇది నిజంగానే హైదరాబాద్ వరద కష్టాలను తీర్చగలదా..?
భాగ్యనగర వీధుల్లోకి రోబో ప్రవేశం : నగరంలోని వరద ముంపు సమస్యకు ప్రధాన కారణం పూడికతో నిండిన నాలాలు, మ్యాన్‌హోళ్లు. ఈ సమస్యను సమూలంగా పరిష్కరించేందుకు జీహెచ్‌ఎంసీ, ముంబయికి చెందిన ఓ ప్రైవేట్ సంస్థ రూపొందించిన రోబోను రంగంలోకి దించింది. ఇటీవల మెహిదీపట్నం ప్రధాన రహదారిపై ఈ రోబోతో నిర్వహించిన ప్రయోగాత్మక పరీక్షలు విజయవంతమయ్యాయి. కేవలం గంట వ్యవధిలోనే ఒక లారీకి సరిపడా పూడికను ఇది తొలగించిందని, దీని సామర్థ్యం అమోఘమని అధికారులు చెబుతున్నారు.
పనితీరు అదుర్స్.. ప్రత్యేకతలు ఇవే : ఈ రోబో కేవలం మట్టిని తోడే యంత్రం మాత్రమే కాదు, అత్యాధునిక సాంకేతికత సమాహారం. దీని పనితీరు, ప్రత్యేకతలు ఇలా ఉన్నాయి:
శక్తివంతమైన డ్రిల్లింగ్: మ్యాన్‌హోళ్లలో పేరుకుపోయిన బండరాళ్లు, ప్లాస్టిక్ వ్యర్థాలు, గట్టిపడిన మట్టిని తనకున్న శక్తివంతమైన పరికరాలతో పగలగొడుతుంది.
హై-ప్రెజర్ వాటర్ జెట్: ముందుభాగంలో ఉండే నీటిని చిమ్మే పరికరంతో పూడిక మట్టిని చీల్చుకుంటూ ముందుకు వెళుతుంది.
బహుళ చక్రాల వ్యవస్థ: పూడిక, బురదలో సులువుగా కదిలేందుకు వీలుగా దీనికి తక్కువ, ఎక్కువ ఎత్తు ఉండే రెండు రకాల చక్రాలుంటాయి.
రహస్య కెమెరాలు: రోబో లోపలికి వెళ్తున్నప్పుడు, దానికి ఎదురయ్యే ప్రతి దృశ్యాన్ని, పూడిక తీవ్రతను రహస్య కెమెరాల ద్వారా రికార్డు చేస్తుంది. ఈ దృశ్యాలను బట్టి అధికారులు తదుపరి చర్యలు తీసుకుంటారు.
జపాన్ స్ఫూర్తి.. జీహెచ్‌ఎంసీ వ్యూహం : కేవలం రోబోలను ప్రవేశపెట్టడమే కాకుండా, వరద నివారణకు జీహెచ్‌ఎంసీ దీర్ఘకాలిక వ్యూహంతో ముందుకు వెళ్తోంది. జపాన్‌లో వరదల నుంచి నగరాలను కాపాడేందుకు నిర్మించిన భారీ భూగర్భ సొరంగాల స్ఫూర్తితో, హైదరాబాద్‌లోని 11 కీలక ప్రాంతాల్లో రూ.15.69 కోట్లతో భూగర్భ ట్యాంకులను నిర్మించింది.
“ఇటీవలి వర్షాల్లో ఈ భూగర్భ ట్యాంకుల విధానం విజయవంతమైంది,” అని జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆర్.వి. కర్ణన్ తెలిపారు. “రెండు నుంచి మూడు సెంటీమీటర్ల వర్షపాతానికి ఇవి 100% ఉపశమనం కల్పిస్తున్నాయి. అంతకుమించి కురిసినా, నగరవాసుల ఇబ్బందులను 40% వరకు తగ్గిస్తున్నాయి,” అని ఆయన వివరించారు. ఈ భూగర్భ ట్యాంకులకు ఇప్పుడు రోబో సాంకేతికత తోడవడంతో, రాబోయే రోజుల్లో హైదరాబాద్ ముంపు సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని అధికారులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.


