Heavy rains in Hyderabad : భాగ్యనగరాన్ని వరుణుడు వణికించాడు. బుధవారం మధ్యాహ్నం ఒక్కసారిగా విరుచుకుపడిన కుండపోత వర్షానికి, మహానగరం అతలాకుతలమైంది. గంటల వ్యవధిలోనే రోడ్లు నదులను తలపించాయి, లోతట్టు ప్రాంతాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. బంజారాహిల్స్‌లో వరద ఉధృతికి ఆటోలు, ద్విచక్ర వాహనాలు కొట్టుకుపోయిన దృశ్యాలు, పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతున్నాయి. అసలు నగరంలో ఏం జరిగింది..? మరో రెండు రోజులు భారీ వర్ష సూచన ఉన్న నేపథ్యంలో, మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి..?
గంటలోనే.. జల ప్రళయం : బుధవారం మధ్యాహ్నం 3 గంటల తర్వాత, నగరంలోని పలు ప్రాంతాల్లో ఒక్కసారిగా భారీ వర్షం మొదలైంది. ఎల్బీనగర్, వనస్థలిపురం నుంచి జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, అమీర్‌పేట వరకు నగరం నలుమూలలా కుండపోత వాన కురిసింది.
రికార్డు వర్షపాతం: శ్రీనగర్ కాలనీలో 9 సెం.మీ., ఖైరతాబాద్‌లో 8 సెం.మీ. వర్షపాతం నమోదైంది. పంజాగుట్ట, ఖైరతాబాద్, అమీర్‌పేట, రాజ్‌భవన్ రోడ్లలో మోకాళ్ల లోతు నీరు చేరడంతో, రాకపోకలు పూర్తిగా స్తంభించిపోయాయి. ఎస్‌ఆర్ నగర్, మైత్రివనం మార్గాల్లో కిలోమీటర్ల కొద్దీ ట్రాఫిక్ జామ్ అయింది.
కొట్టుకుపోయిన వాహనాలు.. కూలిన గోడలు : వర్ష బీభత్సానికి బంజారాహిల్స్ ప్రాంతం తీవ్రంగా ప్రభావితమైంది. రోడ్ నంబర్ 10లోని జారానగర్ కుంట పొంగిపొర్లడంతో, సమీపంలోని హకీంపేటలో భారీగా వరద నీరు చేరింది. ఈ వరద ఉధృతికి, రోడ్డుపై పార్క్ చేసిన ఓ ఆటో, అనేక ద్విచక్ర వాహనాలు గల్లంతయ్యాయి. ఓ వ్యాన్ కొట్టుకుపోతుండగా, డ్రైవర్ అతి కష్టం మీద బయటకు తీసుకువచ్చారు. ఇదే ప్రాంతంలో, వరద ధాటికి ఓ ఇంటి ప్రహరీ గోడ కుప్పకూలగా, ఓ విద్యుత్ స్తంభం కూడా నేలకొరిగింది.
మరో రెండు రోజులు.. భారీ వర్ష సూచన : ఈ వర్ష బీభత్సం ఇక్కడితో ఆగేలా లేదు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో, తెలంగాణలో రానున్న రెండు, మూడు రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. పలు జిల్లాలకు ‘ఎల్లో’ హెచ్చరికలు కూడా జారీ చేసింది.
లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అవసరమైతే తప్ప బయటకు రావొద్దని జీహెచ్‌ఎంసీ, హైడ్రా అధికారులు సూచిస్తున్నారు. సహాయక చర్యల కోసం విపత్తు నిర్వహణ బృందాలు రంగంలోకి దిగాయి.


