Saturday, November 15, 2025
HomeతెలంగాణPower Scam : కరెంట్ తీగకు అక్రమాల చిక్కు: ఇంజినీర్లతో కుమ్మక్కై.. బడా బిల్డర్ల బరితెగింపు!

Power Scam : కరెంట్ తీగకు అక్రమాల చిక్కు: ఇంజినీర్లతో కుమ్మక్కై.. బడా బిల్డర్ల బరితెగింపు!

Fake occupancy certificate scam : సామాన్యుడు చిన్న ఇల్లు కట్టుకోవాలంటే అనుమతుల కోసం కాళ్లరిగేలా తిరగాలి. కానీ, ఆకాశాన్ని తాకే ఆకాశహర్మ్యాలు నిర్మించే కొందరు బడా బిల్డర్లు మాత్రం నిబంధనలను యథేచ్ఛగా ఉల్లంఘిస్తున్నారు. ఏకంగా విద్యుత్తు శాఖలోని కొందరు ఇంజినీర్లతోనే చేతులు కలిపి, నకిలీ పత్రాలతో వందల కొద్దీ అక్రమ కరెంట్ కనెక్షన్లు పొందుతున్నారు. ఎస్పీడీసీఎల్ సీఎండీ ఆదేశాలతో జరుగుతున్న విజిలెన్స్ విచారణలో ఒక్కొక్కటిగా వెలుగుచూస్తున్న ఈ వాస్తవాలు దిగ్భ్రాంతి కలిగిస్తున్నాయి. అసలు ఈ అక్రమాల పుట్ట ఎలా పగులుతోంది? కొనుగోలుదారులను ఎలా మోసం చేస్తున్నారు?

- Advertisement -

ఏమిటీ నిబంధన? ఎలా జరుగుతోంది మోసం : నిబంధనల ప్రకారం, 10 మీటర్ల (దాదాపు మూడు అంతస్తులు) కంటే ఎక్కువ ఎత్తున్న ఏ భవనానికైనా శాశ్వత విద్యుత్తు కనెక్షన్ పొందాలంటే మున్సిపల్ అధికారులు జారీ చేసే ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ (ఓసీ) తప్పనిసరి. ఓసీ లేకుండా కనెక్షన్లు ఇవ్వరాదని సాక్షాత్తూ హైకోర్టు సైతం ఆదేశించింది. నిర్మాణం పూర్తయ్యే వరకు కేటగిరి-8 కింద తాత్కాలిక కనెక్షన్ మాత్రమే ఇస్తారు.

కానీ, కొందరు బడా బిల్డర్లు ఈ నిబంధనను అతిక్రమించడానికి అడ్డదారులు తొక్కుతున్నారు.
నకిలీ ఓసీల సృష్టి: జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏ జారీ చేసినట్లుగా నకిలీ, ఫోర్జరీ ఆక్యుపెన్సీ సర్టిఫికెట్లను సృష్టిస్తున్నారు.

అధికారులతో కుమ్మక్కు: విద్యుత్తు శాఖలోని కొందరు అవినీతి ఇంజినీర్లు, సిబ్బందితో చేతులు కలిపి, ఆ నకిలీ పత్రాల ఆధారంగా శాశ్వత గృహ కనెక్షన్లు పొందుతున్నారు.

కొనుగోలుదారులకు ఉచ్చు: ఈ అక్రమ కనెక్షన్లతో ఫ్లాట్లను అమ్మేస్తున్నారు. తీరా విచారణలో అసలు విషయం బయటపడ్డాక, ఆ కనెక్షన్లను మళ్లీ ఖరీదైన తాత్కాలిక కనెక్షన్లుగా మార్చడంతో, ఏ పాపం తెలియని కొనుగోలుదారులు తీవ్రంగా నష్టపోతున్నారు.

విచారణలో వెలుగుచూసిన కొన్ని బాగోతాలు:
కేసు-1 (నల్లగండ్ల): శేరిలింగంపల్లిలో ‘ఆర్‌డీబీ హైదరాబాద్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్’ అనే సంస్థ 19 అంతస్తుల భవనంలో 625 ఫ్లాట్లు నిర్మించింది. ఓసీ సమర్పించకుండానే, ఏకంగా 285 ఫ్లాట్లకు అధికారులు శాశ్వత కనెక్షన్లు జారీ చేసేశారు. ఇప్పుడు విచారణ మొదలవడంతో, ఆ ఫ్లాట్లలోకి ఇప్పటికే చేరిన వారికి నోటీసులు జారీ చేసి, వారి కనెక్షన్లను తిరిగి తాత్కాలిక కనెక్షన్లుగా మార్చే ప్రక్రియ చేపట్టారు.

కేసు-2 (ఓల్డ్ బోయిన్‌పల్లి): అంజద్‌బేగ్ అనే వ్యక్తి జీ+4కి అనుమతి తీసుకుని, అదనంగా మరో అంతస్తు (జీ+5) నిర్మించారు. 22 కరెంట్ కనెక్షన్ల కోసం ఫోర్జరీ ఓసీ సమర్పించినట్లు విజిలెన్స్ విచారణలో తేలింది. దీనికి బాధ్యులైన ఏడీఈ రోషన్, ఏఈ అఖిల్‌పై చర్యలు తీసుకోవాలని విజిలెన్స్ సిఫారసు చేసింది.

కేసు-3 (నార్సింగి): ‘ధాన్వి ఇన్‌ఫ్రా’ అనే సంస్థ 65 ఫ్లాట్లకు ఓసీ లేకుండానే కనెక్షన్లు పొందింది. విచారణ మొదలయ్యాక, మూడు నెలల తర్వాత ఆన్‌లైన్‌లో ఓసీ సమర్పించారు. తీరా దాన్ని పరిశీలించగా, అది కూడా నకిలీదని బట్టబయలైంది.

ఈ తరహా మోసాలపై టీజీఎస్పీడీసీఎల్ సీఎండీ కఠినంగా వ్యవహరిస్తున్నారు. ఆయన ఆదేశాల మేరకు విద్యుత్తు చౌర్య నిరోధక విభాగం (డీపీఈ), విజిలెన్స్ అధికారులు లోతుగా విచారణ చేపడుతున్నారు. ఈ దర్యాప్తులో మరిన్ని అక్రమాలు బట్ట బయలు జరిగే  అవకాశం ఉందని తెలుస్తోంది.


సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad