Themed junction development in Hyderabad : నిత్యం వాహనాల రణగొణ ధ్వనులు, కిక్కిరిసిన ట్రాఫిక్‌తో కాంక్రీట్ జంగిల్‌ను తలపించే హైదరాబాద్ మహానగరం ఇప్పుడు సరికొత్త కళాత్మక హంగులను అద్దుకుంటోంది. అడుగుపెట్టిన ప్రతి కూడలిలో ఓ సరికొత్త కథను ఆవిష్కరిస్తూ, నగరవాసులనే కాక పర్యాటకులను సైతం చూపు తిప్పుకోనివ్వకుండా కట్టిపడేస్తోంది. బృహత్ హైదరాబాద్ మహానగర పాలక సంస్థ (జీహెచ్‌ఎంసీ) చేపట్టిన ఈ నగర సుందరీకరణ యజ్ఞం, భాగ్యనగరానికి సరికొత్త పట్టాభిషేకం చేస్తోంది. ఇంతకీ ఈ కూడళ్ల వెనుక ఉన్న థీమ్ ఏంటి? ఏయే కూడళ్లు ఏయే సందేశాలను ఇస్తున్నాయి? ఆ వివరాలేంటో చూద్దాం.
రూ.149 కోట్లతో సరికొత్త రూపు : విశ్వనగరంగా ఎదుగుతున్న హైదరాబాద్ ప్రతిష్టను ఇనుమడింపజేసే లక్ష్యంతో జీహెచ్‌ఎంసీ “నగర సుందరీకరణ” ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా, నగరంలోని అత్యంత రద్దీగా ఉండే 12 ప్రధాన ట్రాఫిక్ కూడళ్లను సుందరంగా తీర్చిదిద్దాలని నిర్ణయించింది. ఇందుకోసం సుమారు రూ.149 కోట్లను కేటాయించి, ఒక్కో కూడలి అభివృద్ధికి దాదాపు రూ.3 కోట్లు వెచ్చిస్తున్నట్లు అధికారులు తెలిపారు. కేవలం మొక్కలు నాటడంతో సరిపెట్టకుండా, ప్రతి కూడలికి ఒక ప్రత్యేకమైన థీమ్‌ను ఎంచుకుని, ఆ ప్రాంత విశిష్టతను, సాంస్కృతిక వారసత్వాన్ని, సామాజిక సందేశాన్ని ప్రతిబింబించేలా కళారూపాలను ఏర్పాటు చేస్తున్నారు.
ఒక్కో కూడలి.. ఒక్కో సందేశం : ఈ ప్రాజెక్టులో భాగంగా రూపుదిద్దుకున్న కొన్ని కూడళ్లు ఇప్పటికే నగరవాసులను విశేషంగా ఆకర్షిస్తున్నాయి.
సికింద్రాబాద్ సంగీత స్ఫూర్తి: సికింద్రాబాద్ కూడలిలో ఏర్పాటు చేసిన వీణ వాయిద్యాల అలంకరణ, మన సంప్రదాయ సంగీత వారసత్వానికి ప్రతీకగా నిలుస్తోంది. ఆ దారిలో వెళ్లేవారికి సంగీత స్ఫూర్తిని పంచుతోంది.
నారాయణగూడలో విశ్వనగర భావన: నారాయణగూడ చౌరస్తాలో మనిషి చేతుల్లో ఉన్న గ్లోబ్ ప్రతిమ, హైదరాబాద్ విశ్వనగర స్ఫూర్తిని చాటడంతో పాటు, పర్యావరణ పరిరక్షణ మనందరి బాధ్యత అని గుర్తుచేస్తుంది.
అబిడ్స్ వారసత్వ వైభవం: చారిత్రక అబిడ్స్ పోస్టాఫీసు సమీపంలో, ఆ వారసత్వానికి ప్రతీకగా పోస్టాఫీసు అలంకరణను ఏర్పాటు చేశారు. ఇది ఆ ప్రాంతం యొక్క చారిత్రక ప్రాధాన్యతను కళ్లకు కడుతుంది.
జీవ వైవిధ్యానికి పెద్దపీట: నగరంలోని పలు కూడళ్లలో ఏర్పాటు చేసిన సీతాకోకచిలుకలు, డాల్ఫిన్‌లు, బాతుల వంటి జంతువుల విగ్రహాలు, నగరంలో జీవ వైవిధ్యం యొక్క ప్రాముఖ్యతను తెలియజేస్తున్నాయి.
పైవంతెనల కింద కళావిహారం : కేవలం కూడళ్లే కాకుండా, పైవంతెనల (ఫ్లైఓవర్లు) కింద ఉన్న ఖాళీ ప్రదేశాలను, ఫుట్‌పాత్‌ల పక్కన ఉన్న గోడలను కూడా జీహెచ్‌ఎంసీ అందంగా తీర్చిదిద్దుతోంది. తెలంగాణ అస్తిత్వాన్ని, నగర చరిత్రను తెలిపే అద్భుతమైన చిత్రాలను గీయించడం, పూల మొక్కలతో ఆహ్లాదకరమైన వాతావరణాన్ని సృష్టించడం వంటి చర్యలు చేపడుతోంది. ముఖ్యంగా, రాత్రి వేళల్లో మిరుమిట్లు గొలిపే రంగురంగుల విద్యుద్దీపాల అలంకరణ ఈ కూడళ్లకు సరికొత్త వన్నె తెస్తూ, నగరవాసులకు ఒక ప్రత్యేకమైన అనుభూతిని పంచుతోంది.


