Friday, January 16, 2026
HomeతెలంగాణBlood racket : మనిషి రక్త బ్యాగుల్లో.. మేకల రక్తం! కాచిగూడ ల్యాబ్‌లో బయటపడ్డ ఘోరం!

Blood racket : మనిషి రక్త బ్యాగుల్లో.. మేకల రక్తం! కాచిగూడ ల్యాబ్‌లో బయటపడ్డ ఘోరం!

Hyderabad blood racket bust : మనిషి రక్త బ్యాగుల్లో మేకల రక్తం.. వినడానికే ఒళ్లు జలదరిస్తున్న ఈ ఘోరం మన హైదరాబాద్ నగర నడిబొడ్డున వెలుగుచూసింది. కాచిగూడలోని ఓ ల్యాబ్‌లో జరుగుతున్న ఈ అక్రమ దందా, ప్రజారోగ్యంతో చెలగాటమాడుతున్న తీరుకు నిలువుటద్దం పడుతోంది. వైద్య ప్రయోగాల ముసుగులో జరుగుతున్న ఈ దారుణంపై డ్రగ్ కంట్రోల్, పోలీసు అధికారులు జరిపిన సంయుక్త దాడుల్లో కళ్లు బైర్లు కమ్మే నిజాలు బయటపడ్డాయి.

- Advertisement -

మాంసం దుకాణం నుంచి ల్యాబ్ వరకు : ఈ అక్రమ దందా గుట్టు రట్టవ్వడం ఓ మాంసం దుకాణం నుంచి మొదలైంది. మేడ్చల్ జిల్లా, కీసర మండలం, నాగారంలోని సోనూ మాంసం దుకాణంలో, గొర్రెలు, మేకల నుంచి అక్రమంగా రక్తాన్ని సేకరిస్తున్న ఇద్దరిని అధికారులు పట్టుకున్నారు. వారిని విచారించగా, తాము సేకరించిన రక్తాన్ని కాచిగూడలోని సీఎంకే (CSK) ల్యాబ్‌కు అమ్ముతున్నట్లు వెల్లడించారు. ఈ సమాచారంతో, డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ అధికారులు, ఈస్ట్ జోన్ పోలీసులు సంయుక్తంగా కాచిగూడలోని ఆ ల్యాబ్‌పై మెరుపు దాడి చేశారు.

ల్యాబ్‌లో షాకింగ్ దృశ్యాలు.. వీడని మిస్టరీ : ల్యాబ్‌లో తనిఖీలు చేపట్టిన అధికారులకు దిగ్భ్రాంతికరమైన దృశ్యాలు ఎదురయ్యాయి. ఫ్రిజ్‌లలో, మానవ రక్తం కోసం వాడే ప్రత్యేక బ్యాగులలో నిల్వ ఉంచిన సుమారు 1000 లీటర్ల జంతు రక్తాన్ని గుర్తించి, స్వాధీనం చేసుకున్నారు. ల్యాబ్‌లో రక్తాన్ని ఒక బ్యాగ్ నుంచి మరో బ్యాగ్‌కు స్టెరైల్ వాతావరణంలో మార్చేందుకు ఉపయోగించే ‘లామినార్ ఎయిర్ ఫ్లో యూనిట్’, ‘ఆటోక్లేవ్’ వంటి అత్యాధునిక యంత్రాలు ఉండటం, ఇక్కడ ఏదో పెద్ద కుట్రే జరుగుతోందన్న అనుమానాలకు బలం చేకూర్చింది.

అధికారుల అనుమానాలు : ఇంత పెద్ద మొత్తంలో జంతు రక్తాన్ని, అదీ మానవ రక్త బ్యాగులలో ఎందుకు సేకరిస్తున్నారనేది మిస్టరీగా మారింది. అధికారులు పలు కోణాల్లో అనుమానిస్తున్నారు.
సౌందర్య ఉత్పత్తుల కోసం: జుట్టు, చర్మ చికిత్సలకు ఉపయోగించే సీరం తయారీకి.
టీకాల తయారీకి : బ్యాక్టీరియా పెంపకానికి వాడే కల్చర్ మీడియా తయారీకి.
హరియాణాకు తరలింపు : ఈ రక్తాన్ని హరియాణాకు చెందిన ఓ కంపెనీకి పంపిస్తున్నట్లు ప్రాథమికంగా అనుమానిస్తున్నారు.

ప్రధాన నిందితుడు పరారీ.. దర్యాప్తు ముమ్మరం : ఈ మొత్తం దందాకు సూత్రధారిగా భావిస్తున్న ల్యాబ్ నిర్వాహకుడు నికేశ్ పరారీలో ఉన్నాడు. అతని కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. నికేశ్ దొరికితేనే ఈ రాకెట్ వెనుక ఉన్న పూర్తి వివరాలు బయటకు వస్తాయని కాచిగూడ ఏసీపీ హరీశ్‌కుమార్ తెలిపారు. మరోవైపు, మాంసం దుకాణం యజమాని సోనూ, నకిలీ వెటర్నరీ డాక్టర్ సంజీవ్‌లపై కూడా పోలీసులు పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News