Hyderabad meat shops close in october 2nd: ఈ ఏడాది అక్టోబర్ 2న దసరా పండుగ జరగనుంది. అయితే గాంధీ జయంతి కూడా అదే రోజు రావడంతో తెలంగాణలో ప్రజలకు గందరగోళం నెలకొంది. ఈ నేపథ్యంలో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్‌ఎంసీ) కీలక నిర్ణయం తీసుకుంది. గాంధీ జయంతిని పురస్కరించుకుని అక్టోబర్ 2న హైదరాబాద్‌లో మాంసం దుకాణాలు, కబేళాలు మూసివేయాలని ఆదేశించింది.
ఆదేశాలు జారీ: ఈ మేరకు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ చట్టం-1955లోని సెక్షన్ 533(B) ప్రకారం సెప్టెంబర్ 24న జరిగిన సమావేశంలో జీహెచ్‌ఎంసీ స్టాండింగ్ కమిటీ ఈ నిర్ణయానికి ఆమోదం తెలిపింది. దీంతో సోమవారం ఈ ఆదేశాలు జారీ చేసింది. గాంధీ జయంతి పవిత్రతను కాపాడేందుకు జీహెచ్‌ఎంసీ తీసుకున్న ఈ నిర్ణయాన్ని పర్యవేక్షించాల్సిందిగా అధికారులను ఆదేశించింది. దీంతో అక్టోబర్ 2న జంతు వధశాలలు, రిటైల్ మాంసం, బీఫ్ షాపులు మూసివేయబడతాయి. దీనితో దసరా పండుగను ఘనంగా జరుపుకోవాలనుకునే మాంసం ప్రియులకు నిరాశ తప్పలేదు. అయితే ఈ ఆదేశాలను అధికారులు కఠినంగా అమలు చేస్తారని జీహెచ్‌ఎంసీ స్పష్టం చేసింది.


