Weather Forecast: వర్షాకాలం ముగిసినా.. నైరుతీ రుతుపవనాలు వెళ్లిపోయినా.. తెలుగు రాష్ట్రాల్లో ఇంకా వానలు పడుతూనే ఉన్నాయి. నవంబర్ నెల ప్రారంభమైనప్పటికీ ఎక్కడో ఒకచోట వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. అయితే నేడు భిన్న వాతావరణం ఉంటుందని హైదరాబాద్ వాతావరణ శాఖ పేర్కొంది. రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో ఉదయం వాతావరణం పొడిగా.. కాస్త ఎండగా ఉంటుందని తెలిపింది. మధ్యాహ్నం తర్వాత ఆకాశం మేఘావృమై రాత్రి వరకు పలు జిల్లాల్లో తీవ్రమైన ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. ఈ నేపథ్యంలో వికారాబాద్, సంగారెడ్డి, రంగారెడ్డి, మహబూబ్‌నగర్, వనపర్తి, నాగర్‌కర్నూల్, నారాయణపేట, గద్వాల్, నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి – భువనగిరి జిల్లాల ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఆయా ప్రాంతాల్లో పిడుగులు పడే అవకాశం ఉన్నందున.. ప్రజలు సురక్షిత ప్రాంతాలలో ఉండాలని సూచించారు. చెట్ల కింద ఎట్టిపరిస్థితిలో ఉండరాదని తెలిపారు. ఇక.. రాష్ట్రంలోని మిగిలిన జిల్లాలలో అక్కడక్కడ తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పారు.
తెలుగు రాష్ట్రాలపై అంతగా లేని ప్రభావం: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం.. మయన్మార్ తీరాన్ని తాకిందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. దీంతో దాని ప్రభావం తెలుగు రాష్ట్రాల్లో అంతగా ఉండే అవకాశం లేదని అన్నారు. అయినప్పటికి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు. మరోవైపు బంగాళాఖాతంలో 3 ద్రోణులు ఏర్పడినట్టుగా తెలిపారు. వాటిలో ఏదైనా ఎక్కువ యాక్టివ్ మోడ్‌లోకి వస్తే.. అవి ఆవర్తనంగా మారి అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని తెలిపారు. దానిపై త్వరలో ఓ క్లారిటీ వస్తుందని అన్నారు.
Also Read:https://teluguprabha.net/andhra-pradesh-news/heavy-rainfall-expected-in-ap-in-coming-days/
హైదరాబాద్ వాతావరణం: నగరంలో భారీగా వర్షాలు కురిసే అవకాశం లేనప్పటికీ.. మధ్యాహ్నం నుంచి రాత్రి సమయంలో మోస్తరు వర్షం పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఉదయం నుంచి సాయంత్రం వరకు కాస్త ఎండగా ఉండనుందని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. అయితే కొన్ని ప్రాంతాల్లో మాత్రం వర్షాలు కురిసే అవకాశం ఉందని అన్నారు. వర్షాలు ఉన్న ప్రాంతాలలో ప్రజలు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని, లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.


