Saturday, November 15, 2025
HomeతెలంగాణHyderabad Metro: మెట్రోకు వడ్డీ పోటు.. సర్కారుకు అప్పుల వేట!

Hyderabad Metro: మెట్రోకు వడ్డీ పోటు.. సర్కారుకు అప్పుల వేట!

Hyderabad Metro debt restructuring : హైదరాబాద్ నగరానికి జీవనాడిగా మారిన మెట్రో రైలు.. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి పెను భారంగా మారబోతోందా? ప్రైవేటు సంస్థ నుంచి ప్రభుత్వ చేతుల్లోకి మారిన మెట్రో మొదటి దశకు ఏటా వెయ్యి కోట్ల రూపాయల వడ్డీ చెల్లించాల్సి రావడం గమనార్హం. ఇంత పెద్ద మొత్తాన్ని ప్రభుత్వం ఎలా భరించనుంది? ఈ వడ్డీ భారాన్ని తగ్గించుకునేందుకు సర్కారు వేస్తున్న ఎత్తుగడలేంటి? అసలు ఈ పరిస్థితి ఎందుకొచ్చింది?

- Advertisement -

హైదరాబాద్ మెట్రో మొదటి దశ నిర్వహణ బాధ్యతలను ఎల్&టీ నుంచి రాష్ట్ర ప్రభుత్వం స్వాధీనం చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే, ఈ బదలాయింపు కేవలం నిర్వహణకే పరిమితం కాలేదు. దానితో పాటు ఎల్&టీ చేసిన రూ.13,000 కోట్ల భారీ అప్పును కూడా ప్రభుత్వం తన నెత్తిన వేసుకుంది. ప్రస్తుతం ఈ రుణాలపై చెల్లిస్తున్న అధిక వడ్డీలు ప్రభుత్వానికి గుదిబండగా మారాయి. ఈ ఆర్థిక భారాన్ని సగానికి తగ్గించుకోవాలనే లక్ష్యంతో, తక్కువ వడ్డీకే రుణాలు ఇచ్చే అంతర్జాతీయ సంస్థల కోసం సర్కారు అన్వేషణ మొదలుపెట్టింది.

ఏటా రూ.1000 కోట్ల వడ్డీ భారం : ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్యం (PPP) పద్ధతిలో నిర్మించిన హైదరాబాద్ మెట్రో కోసం ఎల్&టీ సంస్థ వివిధ బ్యాంకుల నుంచి రూ.13,000 కోట్లకు పైగా రుణం సమీకరించింది. ఈ రుణాలపై 2024-25 ఆర్థిక సంవత్సరంలోనే రూ.940 కోట్లను వడ్డీ రూపంలో చెల్లించారు. సగటున ఏటా రూ.1000 కోట్లను కేవలం వడ్డీలకే చెల్లించడమంటే అది ప్రభుత్వంపై తీవ్ర ఆర్థిక భారం మోపడమే. ఈ నేపథ్యంలో, రుణాల పునర్‌వ్యవస్థీకరణ కోసం ప్రభుత్వం బోస్టన్‌ కన్సల్టింగ్‌ గ్రూప్‌ (BCG) వంటి అనుభవజ్ఞులైన ఏజెన్సీలతో కసరత్తు చేస్తోంది.

తక్కువ వడ్డీ రుణాల కోసం గాలింపు: సాధారణంగా ఏడీబీ (ఆసియా అభివృద్ధి బ్యాంకు), జైకా (జపాన్ అంతర్జాతీయ సహకార సంస్థ) వంటి అంతర్జాతీయ సంస్థలు కొత్త మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు రెండు, మూడు శాతం అతి తక్కువ వడ్డీకే రుణాలు మంజూరు చేస్తుంటాయి. అయితే, ఇప్పటికే పూర్తయిన ప్రాజెక్టు రుణాలను బదలాయించుకునేందుకు ఈ సంస్థలు అంగీకరిస్తాయా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అయినప్పటికీ, గతంలో ఇలాంటి సందర్భాలు ఉన్నాయని, ప్రయత్నిస్తే సఫలం కావచ్చని అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

రెండో దశ కోసమే ఈ త్యాగం: మెట్రో రెండో దశ విస్తరణను రాబోయే మూడేళ్లలో పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్న ప్రభుత్వం, కేంద్రానికి సమగ్ర ప్రాజెక్టు నివేదిక (DPR) పంపింది. అయితే, మొదటి దశ ఎల్&టీ చేతిలో ఉన్నందున, ఆ సంస్థతో విస్తరణపై అవగాహనకు రావాలని కేంద్రం పలు అభ్యంతరాలు వ్యక్తం చేసింది. మొదటి, రెండో దశల మధ్య రైళ్ల నిర్వహణ, ఖర్చులు, ఆదాయం పంపకాలపై ఉన్న ఆందోళనల కారణంగా ఎల్&టీ రెండో దశలో భాగస్వామి అయ్యేందుకు అంగీకరించలేదు. ఈ ప్రతిష్టంభన రెండో దశకు అడ్డంకిగా మారకూడదనే ఉద్దేశంతో, ప్రభుత్వం మొదటి దశను పూర్తిగా స్వాధీనం చేసుకోవాలని సాహసోపేత నిర్ణయం తీసుకుంది.

కుదిరిన ఒప్పందం: చర్చల అనంతరం, ఎల్&టీకి చెందిన ఈక్విటీ పెట్టుబడి కింద వన్‌టైం సెటిల్‌మెంట్‌గా రూ.2,000 కోట్లు చెల్లించడానికి, రూ.13,000 కోట్ల అప్పును పూర్తిగా స్వీకరించడానికి ప్రభుత్వం అంగీకరించింది. ఈ ఒప్పందం ద్వారా మెట్రో రెండో దశకు మార్గం సుగమమైంది, కానీ మొదటి దశ వడ్డీ భారం ఇప్పుడు ప్రభుత్వంపై పడింది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad