Hyderabad metro rules for disabled passengers : నగర ప్రయాణానికి నవశకమైన హైదరాబాద్ మెట్రోలో మానవత్వం మసకబారింది. లక్షలాది మందిని గమ్యస్థానాలకు చేరుస్తున్న ఆధునిక రవాణా వ్యవస్థలో ఓ దివ్యాంగుడికి తీవ్ర అవమానం ఎదురైంది. తన కాళ్లుగా భావించే బ్యాటరీ వీల్‌ఛైర్‌తో ప్రయాణానికి సిబ్బంది అడ్డుచెప్పడంతో, ఏకంగా నాలుగు గంటల పాటు స్టేషన్‌లోనే నిరీక్షించాల్సిన దయనీయ పరిస్థితి తలెత్తింది. అసలు మెట్రోలోకి బ్యాటరీ వీల్‌ఛైర్‌ను అనుమతించరా..? దివ్యాంగుల ప్రయాణంపై నిబంధనలు ఏం చెబుతున్నాయి..? సిబ్బంది ప్రవర్తన వెనుక అవగాహన లోపమా లేక అధికార దర్పమా..?
బాధితుడి ఆవేదన.. నాలుగు గంటల నరకం : స్పైనల్ మస్కులర్ అట్రోఫీ అనే సమస్యతో బాధపడుతున్న మిట్టపల్లి శివకుమార్ (48.89% వైకల్యం) తన ప్రయాణ అవసరాలకు పూర్తిగా బ్యాటరీ వీల్‌ఛైర్‌పైనే ఆధారపడతారు. ఈ నెల 3న ఉదయం మూసారాంబాగ్ నుంచి ఖైరతాబాద్‌కు మెట్రోలో ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రయాణించారు. కానీ, తిరిగి మధ్యాహ్నం ఖైరతాబాద్ స్టేషన్ నుంచి మూసారాంబాగ్ వెళ్లేందుకు ప్రయత్నించగా, అక్కడి సిబ్బంది ఆయనను అడ్డుకున్నారు. “బ్యాటరీ వీల్‌ఛైర్‌కు అనుమతి లేదు” అని తేల్చిచెప్పారు. తాను ఉదయం ఇదే మెట్రోలో వచ్చానని చెప్పినా వినిపించుకోకుండా, పోలీసుల ఎదుట కూడా అవమానకరంగా మాట్లాడారని శివకుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. సుమారు 4 గంటల పాటు స్టేషన్‌లోనే నిరీక్షించేలా చేసి, తీవ్ర మానసిక క్షోభకు గురిచేశారని, తనకు మెట్రో సిబ్బంది క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ మెట్రో రైలు ఎండీకి ఆయన ఫిర్యాదు చేశారు.
నిబంధనల చిట్టా ఏం చెబుతోంది : ఈ ఘటనతో మెట్రో రైలు నిబంధనలపై తీవ్ర గందరగోళం నెలకొంది. హైదరాబాద్ మెట్రో రైలు అధికారికంగా విడుదల చేసిన నిషేధిత వస్తువుల జాబితా చాలా పెద్దది. అందులో కత్తులు, తుపాకులు, పేలుడు పదార్థాలు, మండే స్వభావం ఉన్న ద్రవాలు వంటివి ఉన్నాయి. ఆ జాబితాలో ‘తడి బ్యాటరీలు (Wet Batteries)’ నిషేధిత వస్తువులుగా పేర్కొన్నారు. అయితే, ఆధునిక వీల్‌ఛైర్లలో వాడేవి ఎక్కువగా డ్రై-సెల్ లేదా జెల్ బ్యాటరీలు. నిషేధిత జాబితాలో ఎక్కడా ‘బ్యాటరీ వీల్‌ఛైర్’ అనే పదాన్ని స్పష్టంగా పేర్కొనలేదు. ఈ సాంకేతిక అంశంపై అవగాహన లేకపోవడం వల్లే సిబ్బంది శివకుమార్‌ను అడ్డుకున్నారా? అనే సందేహం వ్యక్తమవుతోంది.
మెట్రోలో అనుమతి లేనివి, ఉన్నవి ఇవే..
నిషేధిత వస్తువులు:
పదునైన వస్తువులు: కత్తులు, బాకులు.
ఆయుధాలు: తుపాకులు, మందుగుండు సామగ్రి.
పనిముట్లు: గొడ్డలి, సుత్తి, రంపం, స్క్రూడ్రైవర్లు.
పేలుడు పదార్థాలు: డైనమైట్, బాణసంచా, గ్రెనేడ్లు.
మండే పదార్థాలు: పెట్రోలియం, స్పిరిట్స్, సీల్ లేని మద్యం బాటిళ్లు, తడి బ్యాటరీలు.
రసాయనాలు: ఆమ్లాలు, విష పదార్థాలు, రేడియోధార్మిక పదార్థాలు.
ఇతరాలు: పెంపుడు జంతువులు, పక్షులు.
అనుమతించేవి: విధి నిర్వహణలో ఉన్న భద్రతా సిబ్బంది తమ ఆయుధాలను తీసుకెళ్లవచ్చు.
ఒక లైటర్ లేదా అగ్గిపెట్టె.
సిక్కులు కృపాన్‌ను ధరించవచ్చు.
సీల్ చేసిన రెండు మద్యం సీసాలు.
మహిళలు స్వీయ రక్షణ కోసం పెప్పర్ స్ప్రే తీసుకెళ్లవచ్చు.
ఈ ఘటన దివ్యాంగుల హక్కులపై, ప్రజా రవాణా వ్యవస్థలో వారికి కల్పించాల్సిన సౌకర్యాలపై మరోసారి చర్చను రేకెత్తించింది. నిబంధనలపై సిబ్బందికి స్పష్టమైన అవగాహన కల్పించడంతో పాటు, ప్రయాణికులతో, ముఖ్యంగా దివ్యాంగులతో మానవత్వంతో ప్రవర్తించేలా శిక్షణ ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉందని సామాజిక కార్యకర్తలు అభిప్రాయపడుతున్నారు.


