Saturday, November 15, 2025
HomeTop StoriesMETRO TAKEOVER: హైదరాబాద్ మెట్రో 'టేకోవర్'.. ముంబై అనుభవంతో సర్కారు ఆచితూచి!

METRO TAKEOVER: హైదరాబాద్ మెట్రో ‘టేకోవర్’.. ముంబై అనుభవంతో సర్కారు ఆచితూచి!

Hyderabad Metro takeover challenges : హైదరాబాద్ మెట్రో రైలును పూర్తిగా తమ ఆధీనంలోకి (టేకోవర్) తీసుకోవాలన్న రాష్ట్ర ప్రభుత్వ సంకల్పానికి, అనేక ఆర్థిక, సాంకేతిక సవాళ్లు స్వాగతం పలుకుతున్నాయి. ఈ ప్రక్రియ అంత సులభం కాదని, ముంబై మెట్రో టేకోవర్ అనుభవాలు హెచ్చరిస్తున్నాయి. ఈ నేపథ్యంలో, తెలంగాణ అధికారులు ముంబై అనుభవాలను అధ్యయనం చేస్తూ, ఈ చిక్కుముడిని ఎలా విప్పాలా అని తీవ్రంగా కసరత్తు చేస్తున్నారు. అసలు ముంబైలో ఏం జరిగింది..? హైదరాబాద్ మెట్రో టేకోవర్‌లో ఉన్న ఆ అడ్డంకులేంటి..?

- Advertisement -

హైదరాబాద్ మెట్రో మొదటి దశ నిర్వహణ బాధ్యతలను, ప్రైవేట్ భాగస్వామి ఎల్&టీ నుంచి స్వాధీనం చేసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈ ప్రక్రియను సజావుగా ముందుకు తీసుకెళ్లేందుకు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (CS) అధ్యక్షతన ఓ ఉన్నత స్థాయి కమిటీని కూడా నియమించారు. ఈ కమిటీ, ముంబై మెట్రో టేకోవర్ ప్రక్రియలో పాలుపంచుకున్న ఏజెన్సీలను సంప్రదించి, అక్కడి అనుభవాలను ఆరా తీసింది.

ముంబైలో ఎదురైన సవాళ్లు : ముంబైలో అనిల్ అంబానీకి చెందిన ఆర్-ఇన్‌ఫ్రా సంస్థ నుంచి, ప్రభుత్వ వాటాదారు MMRDA మెట్రోను టేకోవర్ చేయాలని భావించినా, అది కార్యరూపం దాల్చలేదు. దీనికి ప్రధాన కారణాలను అక్కడి ఏజెన్సీ బృందం తెలంగాణ అధికారులకు తెలిపారు.

అధిక రుణభారం: మెట్రో విస్తరణ కోసం MMRDA తీసుకోవాల్సిన రుణాలు రూ.లక్ష కోట్లకు దాటి ఉన్నాయి. రుణాలు అప్పటికే రూ.27 వేల కోట్ల తీసుకోవడం జరిగింది.
లోటు బడ్జెట్: రాష్ట్ర బడ్జెట్ లోటులో ఉండటంతో, రూ.4,000 కోట్ల వాటాను కొనుగోలు చేయడానికి ప్రభుత్వం వెనకడుగు వేసింది.

హైదరాబాద్ ముందున్న గండాలు : ముంబై తరహాలోనే, హైదరాబాద్ మెట్రో టేకోవర్‌కు కూడా అనేక సవాళ్లు ఎదురుకానున్నాయి.

రూ.13,000 కోట్ల రుణభారం: ఎల్&టీ సంస్థ, మెట్రో నిర్మాణం కోసం వివిధ బ్యాంకుల నుంచి తీసుకున్న రూ.13,000 కోట్ల రుణాల బాధ్యతను ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం స్వీకరించాల్సి ఉంటుంది.

ఎఫ్‌ఆర్‌బీఎం పరిమితులు: ఈ భారీ రుణాలు రాష్ట్ర ప్రభుత్వ ఖాతాలోకి వస్తే, అవి ఎఫ్‌ఆర్‌బీఎం (FRBM) పరిమితులపై ప్రభావం చూపుతాయి. ఇది భవిష్యత్తులో ఇతర అభివృద్ధి పనులకు రుణాలు పుట్టకుండా అడ్డుకునే ప్రమాదం ఉంది.

అధిక వడ్డీలు: ఎల్&టీ తీసుకున్న రుణాలపై వడ్డీ రేట్లు అధికంగా ఉన్నాయి. ఈ భారాన్ని తగ్గించుకునేందుకు, ప్రభుత్వం తక్కువ వడ్డీకి రుణాలు ఇచ్చే అంతర్జాతీయ సంస్థల కోసం అన్వేషిస్తోంది.

ఈ ఆర్థిక సవాళ్లతో పాటు, మెట్రో రెండో దశ విస్తరణకు అవసరమైన మరో రూ.20,000 కోట్లకు పైగా నిధులను కూడా రుణాల ద్వారానే సమీకరించాల్సి ఉంటుంది. ఈ సాంకేతిక, ఆర్థిక అవరోధాలన్నింటినీ అధిగమించి, మెట్రో టేకోవర్ ప్రక్రియను ఎలా విజయవంతం చేయాలన్న దానిపై సీఎస్ నేతృత్వంలోని కమిటీ తీవ్రంగా కసరత్తు చేస్తోంది.


సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad