హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు షాకింగ్ న్యూస్. మెట్రో టికెట్(Metro Tickets) ధరలను పెంచేందుకు అధికారులు సిద్ధమయ్యారు. ఈనెల 8వ తేదీన సీఎం రేవంత్ రెడ్డితో మెట్రో అధికారులు భేటీ కానున్నారు. ఈ భేటీలో చర్చల అనంతరం పెరిగిన ధరలను అమల్లోకి తీసుకురానున్నారు. రెండేళ్ల క్రితం కేంద్ర ప్రభుత్వం నియమించిన ఛార్జీల నిర్ణయ కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా ఛార్జీలను పెంచనున్నారు. కరోనా సమయంలో ఏడాదిపాటు మెట్రో ప్రయాణికుల సంఖ్య తగ్గడంతో మెట్రోపై ఆర్థికభారం పడింది. దీంతో ఆ భారాన్ని భర్తీ చేసేందుకు కొంతకాలంగా మెట్రో ఛార్జీలను పెంచేందుకు అనుమతి ఇవ్వాలని ప్రభుత్వాన్ని మెట్రో యాజమాన్యం విజ్ఞప్తి చేస్తోంది.
హైదరాబాద్ మెట్రోలో ప్రస్తుతం రోజుకు 1200 సర్వీసులు నడుస్తుండగా.. 4.80లక్షల మంది ప్రయాణిస్తున్నారు. శని, ఆదివారాల్లో, సెలవు రోజుల్లో 5.10లక్షల మంది రాకపోకలు సాగిస్తున్నారు. మెట్రో రైల్వే (ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్) యాక్ట్ 2002 ప్రకారం టికెట్ రేట్లను సవరించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు సమాచారం. దీంతో ప్రస్తుతం ఛార్జీల కంటే 25 నుంచి 30శాతం పెంచేందుకు కసరత్తు జరుగుతోంది. ఈ పెంపుతో ప్రతీ ఏడాది రూ.150 నుంచి 170 కోట్ల వరకు వార్షిక ఆదాయం రాబట్టుకోవాలని మెట్రో యాజమాన్యం భావిస్తోంది. కనిష్టంగా రూ.10 నుంచి రూ.15.. గరిష్టంగా రూ.60 నుంచి రూ.75 పెరిగే అవకాశం ఉంది.