New railway terminals in Hyderabad : భాగ్యనగరం రైలు ప్రయాణానికి ఇక కొత్త ఊపిరి అందనుంది. సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడ స్టేషన్లలో కిక్కిరిసిపోతున్న రద్దీకి చెక్ పెడుతూ, నగరం చుట్టూ మూడు దిక్కులా మూడు భారీ రైల్వే టెర్మినళ్లను నిర్మించేందుకు దక్షిణ మధ్య రైల్వే బృహత్ ప్రణాళికను సిద్ధం చేసింది. ఇప్పటికే అందుబాటులోకి వచ్చిన చర్లపల్లి టెర్మినల్‌కు అదనంగా రానున్న ఈ కొత్త టెర్మినళ్లతో, ప్రయాణికుల కష్టాలు తీరనున్నాయి. అసలు ఈ టెర్మినళ్లను ఎక్కడ నిర్మించబోతున్నారు? వీటి ఆవశ్యకత ఏమిటి?
ప్రధాన స్టేషన్లపై ఒత్తిడి.. ప్రయాణికులకు తిప్పలు : ప్రస్తుతం హైదరాబాద్ నగరానికి సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడలే ప్రధాన రైల్వే ముఖద్వారాలు. దేశం నలుమూలల నుంచి వచ్చే వందలాది రైళ్లతో ఈ స్టేషన్లు నిత్యం కిటకిటలాడుతున్నాయి. శివారు ప్రాంతాల నుంచి ఈ స్టేషన్లకు చేరుకోవడానికే గంటల సమయం పడుతోంది. ఉదయం, సాయంత్రం వేళల్లో ప్లాట్‌ఫారాలు దొరక్క రైళ్లు ఔటర్లలోనే నిలిచిపోతున్నాయి. ఈ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపేందుకే, ఢిల్లీ, కోల్‌కతా వంటి మహానగరాల తరహాలో, శివారు ప్రాంతాల్లోనే కొత్త టెర్మినళ్లను నిర్మించాలని రైల్వే శాఖ నిర్ణయించింది.
ఓఆర్ఆర్, ట్రిపుల్ ఆర్ మధ్య వ్యూహాత్మక నిర్మాణం : భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని, ఈ కొత్త టెర్మినళ్లను ఔటర్ రింగ్ రోడ్ (ORR), రీజినల్ రింగ్ రోడ్ (RRR) మధ్యలో నిర్మించాలని ప్రణాళికలు రూపొందించారు. ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో జరిగిన సమావేశంలో దక్షిణ మధ్య రైల్వే అధికారులు ఈ ప్రతిపాదనలను రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు.
చర్లపల్లి (వరంగల్ మార్గం): ఇప్పటికే రూ.413 కోట్లతో విమానాశ్రయం తరహాలో అత్యాధునిక సౌకర్యాలతో నిర్మించిన ఈ టెర్మినల్ అందుబాటులోకి వచ్చింది.
నాగులపల్లి (వికారాబాద్-ముంబయి మార్గం): రామచంద్రాపురం మండలంలోని ఈ టెర్మినల్ నిర్మాణంపై ఎప్పటినుంచో డిమాండ్ ఉంది.
జూకల్-శంషాబాద్ (మహబూబ్‌నగర్-బెంగళూరు మార్గం): దక్షిణ ప్రాంతానికి వెళ్లే రైళ్ల కోసం ఈ టెర్మినల్‌ను ప్రతిపాదించారు.
డబిల్‌పుర్-మేడ్చల్ (నిజామాబాద్-నాందేడ్ మార్గం): ఉత్తర తెలంగాణ, మహారాష్ట్ర వైపు వెళ్లే రైళ్ల కోసం దీనిపై దృష్టి సారించారు.
భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా : రానున్న రెండు దశాబ్దాల్లో హైదరాబాద్ మహానగర జనాభా, రైలు ప్రయాణాల డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకునే రైల్వే శాఖ ఈ ప్రణాళికలకు రూపకల్పన చేసింది. జీహెచ్‌ఎంసీ పరిధిలో 2025లో 1.13 కోట్లుగా ఉన్న జనాభా, 2047 నాటికి 3.30 కోట్లకు పెరుగుతుందని రైల్వే శాఖ అంచనా వేసింది. ఈ పెరిగే జనాభాకు అనుగుణంగా రవాణా సౌకర్యాలను మెరుగుపరచడమే ఈ టెర్మినళ్ల ప్రధాన లక్ష్యం.
ఈ మూడు కొత్త టెర్మినళ్లు అందుబాటులోకి వస్తే, దూర ప్రాంతాల నుంచి వచ్చే రైళ్లను శివారుల్లోనే నిలిపివేయవచ్చు. దీనివల్ల నగరంలోని ప్రధాన స్టేషన్లపై ఒత్తిడి తగ్గడమే కాకుండా, ప్రయాణికులు తమకు సమీపంలోని టెర్మినల్‌లో దిగి, సులభంగా గమ్యస్థానాలకు చేరుకునే అవకాశం కలుగుతుంది. ఇది హైదరాబాద్ నగర ముఖచిత్రాన్నే మార్చేసే కీలక ముందడుగు.


