Hyderabad pedestrian safety skyways : రోడ్డు దాటాలంటే గుండెల్లో దడ.. ఎటువైపు నుంచి ఏ వాహనం దూసుకొస్తుందోనని ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పరుగు.. ఇది హైదరాబాద్ మహానగరంలో నిత్యం లక్షలాది మంది పాదాచారులు ఎదుర్కొంటున్న నరకం. వేగంగా దూసుకొచ్చే వాహనాల ధాటికి ఏటా వందల కుటుంబాల్లో చీకట్లు అలుముకుంటున్నాయి. ఈ ప్రమాదాలకు శాశ్వత పరిష్కారం దిశగా ప్రభుత్వం పటిష్ఠమైన అడుగులు వేస్తోంది. పాదాచారుల భద్రతకు పెద్దపీట వేస్తూ, నగరంలో ఆకాశమార్గాల నిర్మాణానికి కార్యాచరణను వేగవంతం చేసింది. ఇంతకీ ఏమిటా బృహత్ ప్రణాళిక..? ఎక్కడెక్కడ రూపుదిద్దుకోనున్నాయి ఈ పాదచారుల రక్షా కవచాలు..?
అధ్యయనం నుంచి అమలు వరకు పక్కా ప్రణాళిక : రోజురోజుకు విస్తరిస్తున్న హైదరాబాద్ మహానగరంలో ట్రాఫిక్ రద్దీతో పాటు పాదాచారుల మరణాలు కూడా పెరుగుతుండటం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. గతేడాది గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 1,032 పాదచారుల ప్రమాదాలు జరగ్గా, వాటిలో 400 మంది మృత్యువాత పడటం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. నగరంలో జరిగే మొత్తం రోడ్డు ప్రమాదాల్లో 42 శాతం బాధితులు పాదాచారులే కావడం గమనార్హం. ఈ నేపథ్యంలో, శాశ్వత పరిష్కారం కోసం హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ (హెచ్‌ఎండీఏ) నడుం బిగించింది. ట్రిపుల్ ఐటీ హైదరాబాద్ సహకారంతో నగరంలో పాదాచారుల భద్రతపై శాస్త్రీయ అధ్యయనం చేపట్టింది.
ఈ అధ్యయనంలో భాగంగా, అత్యంత రద్దీగా, ప్రమాదకరంగా ఉన్న 21 జంక్షన్లను తొలి దశలో గుర్తించారు. ఈ ప్రాంతాల్లో పాదాచారులు సురక్షితంగా రోడ్డు దాటేందుకు వీలుగా అధునాతన ఆకాశమార్గాలు (స్కైవేలు), ఫుట్‌ఓవర్ వంతెనల నిర్మాణమే శరణ్యమని ట్రిపుల్ ఐటీ నిపుణులు తేల్చిచెప్పారు. ఈ నివేదిక ఆధారంగా హెచ్‌ఎండీఏ దశలవారీగా నిర్మాణ పనులను చేపట్టనుంది.
ముఖ్య కూడళ్లలో నిర్మాణాల జోరు
ఉప్పల్‌లో విజయవంతం: నగరంలోనే అత్యంత రద్దీ కూడళ్లలో ఒకటైన ఉప్పల్ జంక్షన్‌లో మెట్రో స్టేషన్‌ను అనుసంధానిస్తూ ఇప్పటికే నిర్మించిన ఆకాశమార్గం సత్ఫలితాలనిస్తోంది. దీనివల్ల పాదాచారులు ఎలాంటి భయం లేకుండా రోడ్డు దాటగలుగుతున్నారు.
మెహిదీపట్నంలో ముమ్మరంగా పనులు: మరో కీలకమైన ప్రాంతమైన మెహిదీపట్నంలోనూ స్కైవే నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి.
జేఎన్‌టీయూ, సికింద్రాబాద్‌పై ప్రత్యేక దృష్టి: నిత్యం లక్షన్నరకు పైగా వాహనాలతో రద్దీగా ఉండే జేఎన్‌టీయూ కూడలితో పాటు, సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ వద్ద కూడా ఆకాశమార్గాల నిర్మాణానికి సర్వేల కోసం కన్సల్టెన్సీలను నియమించారు. జేఎన్‌టీయూ వద్ద బస్ స్టేషన్, మెట్రో స్టేషన్, లూలూ మాల్, ప్రగతినగర్ రోడ్డును కలుపుతూ భారీ స్కైవేను నిర్మించేందుకు హెచ్‌ఎండీఏ ప్రణాళిక సిద్ధం చేసింది.
భవిష్యత్ కార్యాచరణ: రాబోయే రోజుల్లో ఐటీ కారిడార్‌లోని 10 నుంచి 15 ప్రాంతాలు, మియాపూర్, ఎల్బీనగర్, ఐకియా వంటి వాణిజ్య కూడళ్లలోనూ ఆకాశమార్గాల అవసరాన్ని నిపుణులు గుర్తించారు.
అధునాతన సౌకర్యాలతో నిర్మాణం : కేవలం వంతెనలు నిర్మించి వదిలేయకుండా, పాదాచారులకు, ముఖ్యంగా వృద్ధులు, దివ్యాంగులకు అనుకూలంగా ఉండేలా వీటిని తీర్చిదిద్దుతున్నారు. దాదాపు అన్ని ఆకాశమార్గాల్లో లిఫ్టులు, ఎస్కలేటర్లను ఏర్పాటు చేయనున్నారు. నిధుల సమస్యను అధిగమించేందుకు కొన్నిచోట్ల ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్యం (పీపీపీ) పద్ధతిలో నిర్మాణాలు చేపట్టనున్నారు. అంతేకాకుండా, ఐటీ పార్కులు, షాపింగ్ మాల్స్, మెట్రో స్టేషన్ల నుంచి నేరుగా ఈ స్కైవేలలోకి ప్రవేశించేలా అనుసంధాన ఏర్పాట్లు కూడా చేయనున్నారు. ఈ బృహత్తర ప్రణాళిక పూర్తయితే, భాగ్యనగర వీధుల్లో పాదాచారుల ప్రయాణం సురక్షితం, సుఖమయం కానుంది.


