Hyderabad Police Action For Harrasing Women In Ganesh Uthsav: నేటి సమాజంలో రాను రాను ఆడవారికి రక్షణ కరువవుతోంది. దేశవ్యాప్తంగా నిత్యం పదుల సంఖ్యలో ఆడవారిపై అత్యాచారాలు జరుగుతున్నాయి. మరికొందరు మహిళలను మానసిక వేధింపులకు గురి చేస్తూ వేధిస్తున్నారు. రద్దీ ప్రదేశాల్లో పోలీసుల నిఘా కొరవడటంతో కామాంధులు మరింతగా రెచ్చిపోతున్నారు. గుడి, బడి తేడా లేకుండా మహిళలు, చిన్నారులపై అసభ్యంగా ప్రవర్తిస్తున్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఈసారి గణేష్ ఉత్సవాల్లో ప్రత్యేకించి మహిళల భద్రత పై స్పెషల్ ఫోకస్ పెట్టారు హైదరాబాద్ పోలీసులు. గణేష్ ఉత్సవాల్లో మహిళలతో అనుచితంగా ప్రవర్తించిన వ్యక్తులపై హైద్రాబాద్ షీ టీమ్స్ నజర్ పెట్టింది. నిమజ్జన ప్రాంతాలు, గణేష్ మండపాల వద్ద మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన 1612 మంది ఆకతాయలను షీ టీమ్ పోలీసులు పట్టుకున్నారు. పోలీసులకు చిక్కిన వారిలో 1,544 మంది మేజర్లు, 68 మంది మైనర్లు ఉన్నారు. నేరస్థులపై సంబంధిత చట్టాలు, నిబంధనల కింద కేసు నమోదు చేశారు పోలీసులు. పట్టుబడిన వారిలో 68 మంది 18 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు గల మైనర్లు ఉండటంతో వారికి తల్లిదండ్రుల సమక్షంలో కౌన్సెలింగ్ ఇచ్చారు. మైనర్ల పట్ల తల్లిదండ్రులు జాగ్రత్త వహించాలని, వారి కదలికలను ఎప్పటికప్పుడు తెలుసుకోవాలని పోలీసులు సూచించారు.
భారీ భద్రత మధ్య నిమర్జన వేడక..
హైదరాబాద్‌లో జరిగే గణేష్ నిమర్జన వేడుకల కోసం ఈ సారి పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. గణేష్ మండపాలు, నిమర్జన స్థలాల వద్ద షీ టీమ్స్ ప్రత్యేక నిఘా పెట్టారు. హైదరాబాద్‌లో నిమజ్జనం కోసం దాదాపుగా 35 వేల మంది బలగాలతో పోలుసులు భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. శోభాయాత్ర జరుగుతున్న ప్రదేశాలలో ప్రత్యేకంగా 739 సీసీ కెమెరాలు అమర్చారు. హైదరాబాదులోని ట్యాంక్ బండ్ అలాగే పరిసర ప్రాంతాలలో పది డ్రోన్ కెమెరాలతో నిఘా పెట్టారు. డీజీపీ ఆఫీస్ లోని కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్, బషీర్‌బాగ్ సీపీ ఆఫీస్‌లోని కంట్రోల్ రూమ్ నుంచి శోభాయాత్రను ట్రాక్ చేశారు.
నిమర్జన వేడుకల్లో ఆకతాయిలపై స్పెషల్ ఫోకస్..
కాగా, గణేష్ నిమర్జన వేడుకల్లో మహిళలను వేధించినందుకు గానూ మొత్తం 1612 కేసులు నమోదు చేయగా.. వారిలో 70 కేసులను పెట్టీ కేసులుగా నమోదు చేసి.. ఆకతాయిలను ఇప్పటికే నాంపల్లి కోర్టు ముందు హాజరుపరిచారు. కోర్టు 10 కేసుల్లో రూ. 50 జరిమానా, 59 కేసుల్లో రూ. 1,050 జరిమానా, ఒక కేసులో 2 రోజుల సాధారణ జైలు శిక్ష విధించింది. మిగిలిన 98 పెట్టీ కేసులను కోర్టు ముందు హాజరుపరిచనున్నారు. అదనంగా, 1,444 మంది వ్యక్తులకు కఠినమైన హెచ్చరికలు జారీ చేసి వదిలేశారు.
ఆకతాయిల్లో ఏ వయస్సు వాళ్లు ఎంత మంది?
మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తూ పట్టుబడిన మొత్తం 1612 మందిలో 290 మంది 18-20 సంవత్సరాల వయస్సు గలవారు. ఇక, 646 మంది 21-30 సంవత్సరాల మధ్య, 397 మంది 31-40 సంవత్సరాల మధ్య, 166 మంది 41-50 సంవత్సరాల మధ్య, 45 మంది 50 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు గలవారని పోలీసులు తెలిపారు.


