Hyderabad police corruption scandal : సమాజానికి రక్షణగా నిలవాల్సిన ఖాకీ.. కొందరి చేతుల్లో అక్రమాలకు అండగా మారితే? బాధితులకు భరోసానివ్వాల్సిన చేతులే.. ముద్దాయిలతో చేతులు కలిపితే? రక్షకభటులే భక్షకులుగా మారిన ఈ తీరు.. పోలీసు వ్యవస్థపైనే పెనునీడలు కమ్ముతోంది. కష్టపడి సాధించుకున్న ఉద్యోగాన్ని, దాని విలువను కొందరు పోలీసులు కాసుల కక్కుర్తితో కాలరాస్తున్నారు. కేవలం నెల రోజుల వ్యవధిలో నలుగురు పోలీసు అధికారులపై వేటు పడటం దేనికి సంకేతం? అసలు ఖాకీ దుస్తుల మాటున వీరు చేస్తున్న అకృత్యాలేంటి? డబ్బు కోసం ఎంతగా దిగజారిపోయారు?
ఒంటిపై ఖాకీ యూనిఫాం వేసుకోవాలనేది లక్షలాది మంది యువత కల. ఆ కలను సాకారం చేసుకునేందుకు రాయింబవళ్లు శ్రమించి, ఎన్నో పరీక్షలను ఎదుర్కొని విధి నిర్వహణలోకి అడుగుపెడతారు. కానీ, ఆ పవిత్రమైన యూనిఫాంను అడ్డుపెట్టుకుని, కొందరు అధికారులు అక్రమ సంపాదనకు అలవాటు పడి మొత్తం శాఖకే మచ్చ తెస్తున్నారు. జల్సాలు, బెట్టింగ్‌లు, ఆస్తుల సంపాదన లక్ష్యంగా విలువలనే వదిలేస్తున్నారు.
పక్కదారి పట్టిన పర్యవేక్షణ.. పెట్రేగిన వైనం : డబ్బుపై పెరిగిన ఆశ, ఉన్నతాధికారుల పర్యవేక్షణ లోపం కొందరిని తప్పుడు మార్గంలో నడిపిస్తోంది. కేసుల్లో ముద్దాయిలను తప్పించడం, బాధితులను బెదిరించి రాజీ చేయడం, రికవరీ సొమ్మును పంచుకోవడం వంటి తీవ్రమైన ఆరోపణలు వీరిపై వెల్లువెత్తుతున్నాయి.
బెట్టింగ్ కోసం బరితెగింపు: బెట్టింగ్ వ్యసనానికి బానిసైన అంబర్‌పేట్ ఎస్సై భానుప్రకాశ్‌రెడ్డి, ఆ నష్టాలను పూడ్చుకోవడానికి ఏకంగా కేసులో రికవరీ చేసిన బంగారాన్ని, చివరికి తన సర్వీస్ రివాల్వర్‌ను సైతం తాకట్టు పెట్టేంతగా దిగజారాడు. టాస్క్‌ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నించినా పొంతనలేని సమాధానాలు చెప్పి, చివరకు కటకటాల పాలయ్యాడు.
నేరస్థుడికి అండ: ఆర్థిక నేరాలకు పాల్పడిన ఉప్పలపాటి సతీష్ అనే నేరస్థుడు తప్పించుకునేందుకు సహకరించిన టాస్క్‌ఫోర్స్ ఎస్సై శ్రీకాంత్‌పై సస్పెన్షన్ వేటు పడింది. రక్షించాల్సిన పోలీసే నేరస్థుడితో చేతులు కలపడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది.
వివిధ జోన్లలో విచ్చలవిడితనం : ఈ అవినీతి జాడ్యం కేవలం ఒకరిద్దరికే పరిమితం కాలేదు. నగరంలోని పలు పోలీస్ స్టేషన్లలో ఈ చీడ పాకినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.
దక్షిణ మండలం: ఓ మహిళ మృతి కేసులో, స్థానిక ఇన్‌స్పెక్టర్ బాధితులను భయపెట్టి నిందితులతో రాజీ కుదిర్చిన తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
తూర్పు మండలం: ఇక్కడి కొన్ని స్టేషన్లలో ఎస్‌హెచ్‌ఓల ఉదాసీనతతో కింది స్థాయి సిబ్బంది విచ్చలవిడిగా ప్రవర్తిస్తున్నారని, రికవరీ చేసిన సొమ్మును పంచుకుంటున్నారని ఆరోపణలున్నాయి.
ఉత్తర మండలం: ఓ స్టేషన్‌లో ఎస్సై, బాధితుల ఫిర్యాదును పట్టించుకోకుండా నిందితులకే కొమ్ముకాశాడు. విచిత్రం ఏమిటంటే, ఈ ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారి గ్రూప్-2 ఉద్యోగానికి కూడా ఎంపికయ్యాడు. బాధితుడు నేరుగా సీపీని ఆశ్రయించడంతో ఉన్నతాధికారులు కేసును తిరిగి దర్యాప్తు చేయాలని ఆదేశించారు.
కఠిన చర్యలకు ఉపక్రమిస్తున్న ఉన్నతాధికారులు : సహచరులపై వేటు పడుతున్నా కొందరి తీరు మారకపోవడంతో, పోలీస్ ఉన్నతాధికారులు ఈ అంశాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నారు. నెల వ్యవధిలో ఒక ఇన్‌స్పెక్టర్, ముగ్గురు ఎస్సైలపై సస్పెన్షన్ వేటు, ఒక ఏసీపీని హెడ్‌క్వార్టర్‌కు ఎటాచ్ చేయడం వంటి చర్యలు చేపట్టారు. పలువురు ఇన్‌స్పెక్టర్లు, ఏసీపీలు, ఇతర సిబ్బందిపై వచ్చిన ఆరోపణలపై అంతర్గత విచారణకు ఆదేశించారు. చేపల్లో కొన్ని కుళ్లినవి మొత్తం చెరువును పాడుచేసినట్లు, కొందరు అధికారుల వల్ల మొత్తం పోలీసు వ్యవస్థపై ప్రజలకు నమ్మకం సన్నగిల్లే ప్రమాదం ఉంది. ఈ అవినీతి తిమింగలాలను కట్టడి చేసి, ఖాకీ ప్రతిష్టను నిలబెట్టాల్సిన బాధ్యత ఇప్పుడు ఉన్నతాధికారులపై ఉంది.

