Friday, December 12, 2025
HomeతెలంగాణHyderabad Police: మూడో కన్నుకు 'ఐస్' అండ: ఇక నిరంతర నిఘా.. నేరగాళ్లకు వణుకు!

Hyderabad Police: మూడో కన్నుకు ‘ఐస్’ అండ: ఇక నిరంతర నిఘా.. నేరగాళ్లకు వణుకు!

Hyderabad police CCTV maintenance system : నగరంలో నేరం జరిగింది! పోలీసులు వెంటనే అప్రమత్తమయ్యారు. ఆధారాల కోసం సమీపంలోని సీసీ కెమెరాను పరిశీలించారు. కానీ, అయ్యో.. కీలక సమయంలో ఆ నిఘా నేత్రం పనిచేయడం లేదు! ఎన్నో కేసుల్లో పోలీసులకు ఎదురయ్యే అతిపెద్ద తలనొప్పి ఇది. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం ఉంటే? చెడిపోయిన కెమెరాలు గంటల వ్యవధిలోనే పనిచేయడం ప్రారంభిస్తే? నేరగాళ్లు తప్పించుకునే మార్గమే లేకపోతే? అసాధ్యంలా అనిపించే ఈ ఆలోచనను సుసాధ్యం చేస్తూ హైదరాబాద్ పోలీసులు విప్లవాత్మక వ్యవస్థకు శ్రీకారం చుట్టారు. అసలు ఏమిటీ “ఏఎన్​ఎస్​జీపీ”? నేర దర్యాప్తును మార్చేయబోతున్న ఆ ‘ఐస్’ బృందాల ప్రత్యేకత ఏమిటి? ఈ కొత్త వ్యవస్థ ఎలా పనిచేస్తుంది?

- Advertisement -

నగరంలో శాంతిభద్రతల పరిరక్షణకు, నేరాల నియంత్రణకు మూడో నేత్రంలా పనిచేస్తున్న సీసీ కెమెరాల వ్యవస్థకు సాంకేతిక సమస్యలు సవాలుగా మారుతున్నాయి. కెమెరాలు చెడిపోయినప్పుడు, వాటి మరమ్మతుల్లో జరుగుతున్న జాప్యం కేసుల దర్యాప్తును నీరుగార్చుతోంది. ఈ క్లిష్టమైన సమస్యకు చెక్ పెట్టేందుకు, పోలీసింగ్‌ను మరింత బలోపేతం చేసేందుకు నగర పోలీస్ కమిషనర్ సజ్జనార్​ నేతృత్వంలో ఓ పటిష్ఠమైన, శాశ్వత వ్యవస్థ రూపుదిద్దుకుంది.

ఏఎన్​ఎస్​జీపీ’.. పటిష్ఠ వ్యవస్థకు పునాది : రాజధానిలో నిఘా నేత్రాలు నిరంతరం తెరిచే ఉండేలా చూసేందుకు “అడ్వాన్స్​డ్ సిటీ సర్వైలెన్స్ గ్రిడ్​ మేనేజ్​మెంట్ ప్రొటోకాల్” (ANSGP) పేరుతో ఈ శాశ్వత వ్యవస్థకు అంకురార్పణ చేశారు. దీని ప్రధాన లక్ష్యం ఒక్కటే – సీసీ కెమెరాల మరమ్మతులకు రోజుల తరబడి ఎదురుచూసే పాత పద్ధతులకు స్వస్తి పలికి, సమస్య తలెత్తిన వెంటనే పరిష్కరించి, నిఘా వ్యవస్థలో ఎలాంటి అంతరాయం లేకుండా చూడటం.

బహుముఖ వ్యూహంతో ‘ఐస్’ (EYES) కార్యాచరణ : ఈ బృహత్తర వ్యవస్థలో ‘ఎంపవరింగ్ యువర్ ఎవ్రీ డే సేఫ్టీ’ (EYES – ఐస్) అనే విభాగం అత్యంత కీలక పాత్ర పోషించనుంది. హైదరాబాద్ కమిషనరేట్​ పరిధిలో పోలీసుల ఆధ్వర్యంలో ఉన్న 16 వేలకు పైగా కెమెరాల నిర్వహణ ఇకపై ఈ బృందాలదే బాధ్యత.

క్షేత్రస్థాయిలో ‘ఐస్’ బృందాలు: గతంలో ఒక కెమెరా చెడిపోతే, దానిని అమర్చిన ప్రైవేట్ సంస్థ సిబ్బంది వచ్చి బాగుచేసే వరకు వేచి చూడాల్సి వచ్చేది. ఈ జాప్యాన్ని అధిగమించేందుకు, ప్రత్యేకంగా సాంకేతిక శిక్షణ పొందిన 14 మంది నిపుణులతో ‘ఐస్’ బృందాలను ఏర్పాటు చేశారు. ఆధునిక వాహనాలు, మరమ్మతు కిట్లతో సన్నద్ధమైన ఈ బృందాలు, ఫిర్యాదు అందిన వెంటనే క్షేత్రస్థాయికి వెళ్లి కెమెరాలను బాగుచేస్తాయి.

టెక్నాలజీ డ్యూ విజిలెన్స్ బృందం: నాసిరకం కెమెరాలకు చెక్ పెట్టేందుకు ఈ బృందం పనిచేస్తుంది. కెమెరాల కొనుగోలు, ఏర్పాటు, నిర్వహణలో పాటించాల్సిన నాణ్యతా ప్రమాణాలను నిర్దేశిస్తుంది. ఇన్నోవేషన్ ​హ​బ్​, ప్రముఖ టెక్​ సంస్థలతో కలిసి అధునాతన పరిష్కారాలను అన్వేషిస్తుంది.

స్టోర్ టీమ్ & రిపేర్ సెంటర్: మరమ్మతులకు అవసరమైన విడిభాగాలను (స్పేర్ పార్ట్స్) ఈ స్టోర్ టీమ్ నిల్వ ఉంచుతుంది. చిన్న సమస్యలను ‘ఐస్’ బృందాలు పరిష్కరిస్తే, పెద్ద మరమ్మతులను రిపేర్ సెంటర్‌కు తరలించి, సర్వీస్ సెంటర్లతో సమన్వయం చేసుకుని బాగుచేస్తారు.

డేటా అనలిటిక్స్ బ్రాంచ్: ఏ కెమెరా ఎలా పనిచేస్తోందో రోజూ విశ్లేషించడం ఈ బృందం విధి. అంతేకాకుండా, రికార్డైన దృశ్యాలను విశ్లేషించి, నేర నియంత్రణకు, నేరాల సరళిని అంచనా వేయడానికి అవసరమైన కీలక సూచనలను ఉన్నతాధికారులకు అందిస్తుంది.

డయల్ 100′ తరహాలో కాల్ సెంటర్ : ఈ మొత్తం వ్యవస్థను పర్యవేక్షించేందుకు ప్రత్యేకంగా ‘కెమెరా సపోర్ట్ కాల్ సెంటర్’‌ను ఏర్పాటు చేశారు. క్షేత్రస్థాయిలో పెట్రోలింగ్ నిర్వహిస్తున్న బ్లూకోల్డ్స్, పెట్రోకార్ సిబ్బంది ఎక్కడైనా కెమెరా పనిచేయకపోవడాన్ని గమనిస్తే, వెంటనే ఈ కాల్ సెంటర్‌కు సమాచారం ఇస్తారు. ‘డయల్ 100’ తరహాలో పనిచేసే ఈ కేంద్రం, ఫిర్యాదును స్వీకరించి, ‘ఐస్’ బృందానికి అప్పగించి, సమస్య పరిష్కారమయ్యేంత వరకు పర్యవేక్షిస్తుంది. అంతేకాకుండా, ఎవరైనా దాతలు సీసీ కెమెరాలను విరాళంగా ఇవ్వాలనుకున్నా ఈ కాల్ సెంటర్‌ను సంప్రదించవచ్చు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News