అల్లు అర్జున్‌కు(Allu Arjun) హైదరాబాద్ పోలీసులు(Hyderabad Police) భారీ షాక్ ఇవ్వడానికి సిద్ధమైనట్లు తెలుస్తోంది. సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో బన్నీ జైలుకు వెళ్లిన సంగతి తెలిసిందే. అయితే తెలంగాణ హైకోర్టు(TG Highcourt) 4 వారాల పాటు మధ్యంతర బెయిల్ ఇవ్వడంతో ఆయన ఒక్క రోజులోనే జైలు నుంచి బయటకు వచ్చేశారు. దీంతో పోలీసులు బన్నీ బెయిల్ రద్దుకు ప్రయత్నాలు ప్రారంభించినట్లు సమాచారం. ఇందుకోసం ఉన్నతాధికారులు సుప్రీంకోర్టులో పిటిషన్ వేయనున్నట్లు పోలీస్ వర్గాల్లో వినిపిస్తోంది.
కాగా తొక్కిసలాట ఘటనలో అల్లు అర్జున్ తప్పేం లేదని, పోలీసులే భద్రత కల్పించడంలో విఫలమయ్యారంటూ ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో అసలు ప్రీమియర్ షో చూసేందుకు అల్లు అర్జున్‌కు పోలీసులు అనుమతి ఇవ్వలేదంటూ ఓ రిపోర్ట్ బయటకు వచ్చింది. ఇప్పుడు ఇదే రిపోర్టుతో పోలీసులు సుప్రీం కోర్టును ఆశ్రయించనున్నారట. అలాగే ఈ ఘటనలో గాయపడిన బాలుడు శ్రీతేజ పరిస్థితి విషమంగా ఉండటంతో ఈ విషయాన్ని కూడా బెయిల్ రద్దు పిటిషన్‌లో ప్రస్తావించనున్నారట. దీనిపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. ఒకవేళ ఇది నిజమై బెయిల్ రద్దు అయితే మాత్రం అల్లు అర్జున్ మళ్లీ జైలు జీవితం గడపాల్సి ఉంటుంది. దీంతో బన్నీ ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు.