West Zone DCP Statement: చెత్తే కదా అని ఎక్కడపడితే అక్కడ రోడ్లపై పడేసారో.. కఠినమైన చర్యలు తప్పవని హైదరాబాద్ పోలీసులు హెచ్చరించారు. స్వచ్ఛమైన పరిసరాలను నెలకొల్పడం మన అందరి బాధ్యతని వెస్ట్ జోన్ డీసీపీ విజయ్‌కుమార్ అన్నారు. ప్రజలు శ్రద్ధ వహించకపోతే కఠిన చర్యలు తీసుకోవడమే మార్గమని అని పేర్కొన్నారు.
కఠిన చర్యలే ఏకైక మార్గం: రోడ్డుపై చెత్త కనిపించడంతో హైదరాబాద్ వెస్ట్ జోన్ డీసీపీ విజయ్‌కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలు రోడ్డుపై ఇష్టానుసారంగా చెత్త వేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. స్థానిక పోలీసులు పరిసరాల పరిశుభ్రతపై ప్రజలకు అవగాహన కల్పించాలను సూచించారు. అయినప్పటికీ నిర్లక్ష్యంతో ఎవరైనా రోడ్లపై చెత్త వేస్తే వారిపై కేసులు నమోదు చేయాలని ఆదేశించారు. ప్రజలు శ్రద్ధ వహించకపోతే కఠిన చర్యలు తీసుకోవడమే ఏకైక మార్గమని అన్నారు. పరిశుభ్రత విషయంలో పోలీసులు, ప్రజలు అంతా కట్టుబడి ఉండాలని అన్నారు.
లా అండ్ ఆర్డర్ సమస్యలు తలెత్తే అవకాశం: మటన్, చికెన్ షాపుల యజమానులతో పాటుగా హోటల్ యజమానులు రోడ్డుపై చెత్త వేయడం వల్ల స్థానికులకు తీవ్ర ఇబ్బందులు కలుగుతుందని వెస్ట్ జోన్ డీసీపీ విజయ్‌కుమార్ తన ఆవేదన వ్యక్తం చేశారు. వీధి కుక్కలు, పిల్లులు చికెన్ షాపుల యజమానులు రోడ్లపై వేసే చెత్తలోని ఎముకలు, మాంసపు ముక్కలు తీసుకుని ఆలయాల వద్ద పడేస్తే లా అండ్ ఆర్డర్ సమస్యలు తలెత్తే అవకాశం ఉందని తెలిపారు. ముఖ్యంగా స్కూల్, కాలేజీ, ఆసుపత్రుల దగ్గర చెత్త పేరుకుపోవడం వలన పాదచారులకు ఇబ్బందిగా ఉంటుందని అన్నారు.
Also Read:https://teluguprabha.net/telangana-news/telangana-weather-today-and-tomorrow-check-here/
సీసీ కెమేరాల ద్వారా గుర్తిస్తాం: పోలీసులను, జీహెచ్ఎంసీ అధికారులతో సమన్వయం చేసి రోడ్లపైన ఉన్న చెత్తను తీయిస్తున్నామని వెస్ట్ జోన్ డీసీపీ అన్నారు. ఎన్నిసార్లు చెప్పినా వినకుండా చెత్తను ఈ విధంగా పబ్లిక్ ప్లేసులలో వేసేవారిని సీసీ కెమేరాల ద్వారా గుర్తిస్తామని తెలిపారు. వాళ్లపైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని అన్ని పోలీస్ స్టేషన్లకు సూచనలు జారీ చేశామని అన్నారు.
ఈ ప్రాంతాల్లో మరీ అధికం: బోరుబండ, ఫిల్మ్‌నగర్, బంజారాహిల్స్ ప్రాంతాల్లో ఈ పరిస్థితి మరింత ఎక్కువగా కనిపిస్తుందని వెస్ట్ జోన్ డీసీపీ విజయ్‌కుమార్ తెలిపారు. ఈ ప్రాంతంలోని పోలీసు సిబ్బంది అందరూ జీహెచ్ఎంసీ అధికారులతో సమన్వయం అవ్వాలని సూచించారు. దీనితో పాటు చెత్త వేస్తున్న షాపు వారిని ఆధారాలతో గుర్తించాలని అధికారులను ఆదేశించారు. వారిని సిటీపోలీస్ యాక్ట్ కింద, బీఎన్ఎస్లోని పలు సెక్షన్ల కింద కఠిన చర్యలు తీసుకుంటామని వెస్ట్ జోన్ డీసీపీ పి.విజయ్‌కుమార్ హెచ్చరించారు.


