HYD POLICE STATEMENT ON GARBAGE: చెత్తపై స్పెషల్ డ్రైవ్ నేపథ్యంలో హైదరాబాద్ నగర పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు. రోడ్డుపై చెత్త వేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని నగరవాసులను హెచ్చరించారు. రోడ్డుపై చెత్త వేసే వారిపై ప్రత్యేక నిఘా పెట్టి పట్టుకుంటామని తెలిపారు. వారిపై సెక్షన్ 70 (బి), 66 సీపీ యాక్ట్ కింద కేసులు నమోదు చేస్తామని, 8 రోజుల పాటు జైలు శిక్ష సైతం అనుభవించాల్సి వస్తుందని హెచ్చరించారు. జీహెచ్ఎంసీ అధికారుల సమన్వయంతో ఈ స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నామని తెలిపారు. రోడ్లపై చెత్త వేస్తున్న హాట్‌స్పాట్‌లను గుర్తించి సీసీ కెమెరాలను ఏర్పాటు చేశామన్నారు. ఇప్పటికే ఆయా సెక్షన్ల ప్రకారం బోరబండ పరిధిలో రోడ్లపై చెత్త వేసిన వారిని అదుపులోకి తీసుకున్నారు. వారి మీద ఛార్జి షీటు దాఖలు చేసి న్యాయమూర్తి ముందు హాజరుపరచగా రూ. 1000 ఫైన్ వేశారు.
చెత్తే కదా అని తేలిగ్గా తీసుకోకండి..
రోడ్ల మీద చెత్త పేరుకొని పోవడం వల్ల జీహెచ్‌ఎంసీ, పోలీసు శాఖకు అనేక ఫిర్యాదులు అందుతున్నాయి. మటన్, చికెన్ షాపులు, హోటల్ యజమానులు, కొందరు పౌరులు రోడ్డు పక్కన, ఫుట్‌పాత్‌లపై, రోడ్డు మూలల్లో చెత్త వేయడం వల్ల స్థానికులకు తీవ్ర ఇబ్బందులు కలుగుతోంది. ముఖ్యంగా స్కూల్, కాలేజీ, ఆసుపత్రుల దగ్గర చెత్త పేరుకుపోవడం అనారోగ్య సమస్యలతో పాటు వాహనదారులు, పాదచారులకు ఇబ్బందులు కలిగిస్తోంది. పండుగ సమయాల్లో వీధి కుక్కలు, కోతులు, పిల్లులు ఈ గార్బేజ్ నుంచి ఎముకలు, మాంసపు ముక్కలు తీసుకుని ఆలయాల ముందు, గణేష్ మండపాలు, దుర్గా మాత మండపాల దగ్గర పడేస్తే కమ్యూనల్ టెన్షన్, లా అండ్ ఆర్డర్ సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. అంతేకాదు, చెత్త వల్ల వచ్చే దుర్వాసన సమస్యగా మారుతోందని నగరవాసులు వాపోతున్నారు. అందుకే, చెత్త వేసే వారిపై కఠినంగా ఉండాలని బీఎన్ఎస్ సెక్షన్ 292 తో పాటు సెక్షన్ 66,70(బి)సీపీ యాక్ట్ కింద అభియోగాలు పోలీసులు కేసు నమోదు చేస్తున్నారు. కాగా, హైదరాబాద్ పోలీసు కమిషనరేట్ వెస్ట్ జోన్ పరిధిలో డీసీపీ విజయ్ కుమార్ చేపట్టిన ఈ స్పెషల్ డ్రైవ్ అన్ని వర్గాల నుంచి ప్రశంసలు అందుకుంటోంది.
కోర్టులో హాజరు పరుస్తున్నాం..
“చెత్తపై స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నాం. బోరబండ పోలీస్ స్టేషన్ రోడ్లపై చెత్త వేస్తున్న ఐదుగురిని అదుపులోకి తీసుకున్నాం. వారిని కోర్టులో హాజరుపర్చి వారి మీద చార్జిషీటును న్యాయమూర్తి ముందు పెట్టాం. సీసీ కెమెరాల ఫుటేజ్ ద్వారా ఆధారాలను కోర్టు ముందు ఉంచాం. పరిశీలించిన న్యాయమూర్తి రూ.1000 ఫైన్ వేశారు. రోడ్లపై చెత్త వేస్తే చట్టంలో ఉన్న సెక్షన్‌ల ప్రకారం 8 రోజుల జైలు శిక్ష పడే అవకాశముంది.” బోరబండ ఇన్‌స్పెక్టర్ సురేందర్ గౌడ్ స్పష్టం చేశారు.


