Stem cell drug for liver regeneration : కోట్ల రూపాయలు ఖర్చు, దాత దొరకాలనే దైన్యం, శస్త్రచికిత్స తర్వాత ఎదురయ్యే సవాళ్లు.. తీవ్రంగా దెబ్బతిన్న కాలేయానికి ఇప్పటివరకు ఇదే చికిత్స. కానీ, ఇకపై ఆ పరిస్థితి మారనుంది. వైద్య చరిత్రలోనే ఒక నూతన అధ్యాయానికి మన హైదరాబాద్ పరిశోధకులు శ్రీకారం చుట్టారు. పాడైపోయిందని పక్కనపెట్టిన కాలేయానికే మళ్లీ జీవం పోసే ఒక అద్భుతమైన మందును ఆవిష్కరించారు. ప్రపంచంలోనే తొలిసారిగా మూలకణాలు, ఎక్సోజోమ్‌ల కలయికతో చేసిన ఈ ప్రయోగం వైద్య ప్రపంచంలో ప్రకంపనలు సృష్టిస్తోంది. అసలు ఏంటీ అద్భుత ఆవిష్కరణ? జంతువులపై 100 శాతం ఫలితాలనిచ్చిన ఈ చికిత్స వెనుక ఉన్న శాస్త్రీయ రహస్యం ఏమిటి? కోట్ల ఖర్చుతో కూడిన కాలేయ మార్పిడికి ఇది నిజంగానే ప్రత్యామ్నాయం కానుందా?
కాలేయ వ్యాధులతో బాధపడుతున్న కోట్లాది మందిలో కొత్త ఆశలు రేకెత్తిస్తూ, హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలోని ఆస్పైర్ బయోనెస్ట్, తులసి థెరప్యూటిక్స్ అంకురసంస్థ, నిమ్స్ ఆసుపత్రి వైద్య నిపుణులు సంయుక్తంగా ఈ అద్భుత విజయాన్ని సాధించారు. తీవ్ర అనారోగ్యంతో దెబ్బతిన్న కాలేయాన్ని సైతం పునరుజ్జీవింపజేసే ‘తులసి-28 ఎక్స్’ అనే మందును కనుగొన్నారు. ఈ పరిశోధనల సారాంశాన్ని ప్రఖ్యాత అంతర్జాతీయ జర్నల్ ‘రీ-జనరేటివ్ మెడిసిన్’ ప్రచురించి, ఆవిష్కరణకు అంతర్జాతీయ గుర్తింపును అందించింది.
ప్రయోగం జరిగిందిలా.. ఫలితాలు అద్భుతం : పరిశోధకులు తమ ఆవిష్కరణ సామర్థ్యాన్ని పరీక్షించేందుకు ఒక పకడ్బందీ ప్రయోగాన్ని చేపట్టారు.
సమస్య సృష్టి: ముందుగా కొన్ని జంతువులలో కృత్రిమంగా తీవ్రమైన కాలేయ సమస్యను సృష్టించారు.
రెండు బృందాలుగా విభజన: ఆ తర్వాత వాటిని రెండు గుంపులుగా విభజించారు. ఒక బృందానికి ప్రస్తుతం అందుబాటులో ఉన్న సాధారణ మందులతో చికిత్స అందించారు. రెండో బృందానికి తాము కొత్తగా కనుగొన్న మూలకణాలు, ఎక్సోజోమ్‌లతో కూడిన ‘తులసి-28 ఎక్స్’ మందును ఇచ్చారు.
నివ్వెరపరిచే ఫలితాలు: ఫలితాలు పరిశోధకులకే ఆశ్చర్యం కలిగించాయి. సాధారణ మందులు ఇచ్చిన గుంపులో కేవలం 14 శాతం జంతువులు మాత్రమే కోలుకోగా, 43 శాతం మృత్యువాత పడ్డాయి. మిగిలినవి అనారోగ్యంతోనే మగ్గిపోయాయి.
‘తులసి-28 ఎక్స్’ ఇచ్చిన గుంపులో: ఒక్క జంతువు కూడా మరణించలేదు. 100 శాతం జంతువులు పూర్తిగా కోలుకున్నాయి. వాటిలో దెబ్బతిన్న కాలేయం క్రమంగా పునరుజ్జీవం పొంది, సాధారణ స్థితికి చేరుకుంది. ఈ ప్రయోగాలను అమెరికాలోని ఇండియానా యూనివర్సిటీ ప్రొఫెసర్ డా. నాగ చలసాని, చండీగఢ్‌లోని పీజీఐఎమ్ఈఆర్‌కు చెందిన డా. అజయ్ దుసేజా వంటి అంతర్జాతీయ ఖ్యాతి పొందిన నిపుణులు పర్యవేక్షించడం ఈ పరిశోధన ప్రామాణికతకు నిదర్శనం.
కోట్ల ఖర్చుకు చెక్.. లక్షల్లోనే చికిత్స : “అమెరికా వంటి దేశాల్లో కాలేయ పునరుజ్జీవ చికిత్సకు సుమారు రూ.10-12 కోట్లు ఖర్చవుతుంది. మా పరిశోధన ఫలించి, ఈ మందు అందుబాటులోకి వస్తే, కేవలం రూ.5-10 లక్షలతోనే చికిత్స పూర్తిచేయవచ్చు. అతి తక్కువ ఖర్చుతో బాధితులకు సాంత్వన కలిగించాలన్నదే మా లక్ష్యం” అని తులసి థెరప్యూటిక్స్ వ్యవస్థాపకులు డాక్టర్ సాయిరామ్ అట్లూరి ధీమా వ్యక్తం చేశారు. నిమ్స్ డైరెక్టర్ డాక్టర్ బీరప్ప అందించిన సహకారం, రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ అందించిన ప్రోత్సాహం తమకు కొండంత అండగా నిలిచిందని ఆయన పేర్కొన్నారు.
కాలేయం.. ఎందుకింత ప్రమాదంలో పడుతోంది : ప్రపంచవ్యాప్తంగా కాలేయ వ్యాధులతో మరణిస్తున్న వారిలో 20% మంది భారతీయులే ఉండటం ఆందోళన కలిగించే విషయం. అమెరికన్ లివర్ ఫౌండేషన్ అధ్యయనం ప్రకారం, మన జీవనశైలిలోని కొన్ని ప్రధాన కారణాలు కాలేయాన్ని దెబ్బతీస్తున్నాయి.
ధూమపానం, మద్యం: సిగరెట్ పొగలోని విషపదార్థాలు, అతిగా మద్యం సేవించడం కాలేయ కణాలను నేరుగా దెబ్బతీస్తాయి.
ప్రాసెస్ చేసిన ఆహారాలు: ప్యాక్ చేసిన స్నాక్స్, అధిక చక్కెర, ఉప్పు, కొవ్వు ఉన్న పదార్థాలు కాలేయంపై తీవ్ర భారాన్ని మోపుతాయి. ముఖ్యంగా అధిక చక్కెర ‘నాన్-ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్’కు కారణమవుతోంది. ప్రస్తుతం జంతువులపై విజయవంతమైన ఈ ప్రయోగాలను త్వరలో మనుషులపై క్లినికల్ ట్రయల్స్ నిర్వహించి, రాబోయే రెండేళ్లలో ఈ మందును సామాన్యులకు అందుబాటులోకి తీసుకురావాలని పరిశోధకులు కృషి చేస్తున్నారు. ఈ ఆవిష్కరణ విజయవంతమైతే, అది కాలేయ వ్యాధిగ్రస్తులకు పునర్జన్మ ప్రసాదించినట్లే అవుతుంది.

