Hyderabad twin reservoirs flood alert : భాగ్యనగరానికి జలసిరిని అందించే జంట జలాశయాలు ఉస్మాన్‌సాగర్ (గండిపేట), హిమాయత్‌సాగర్ నిండుకుండల్లా మారాయి. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు వరద నీరు పోటెత్తడంతో జలాశయాల గేట్లను అధికారులు ఎత్తివేశారు. దీంతో మూసీ నదికి వరద ప్రవాహం ఒక్కసారిగా పెరిగింది. ఈ నేపథ్యంలో జలమండలి, జీహెచ్‌ఎంసీ అధికారులు తీవ్ర హెచ్చరికలు జారీ చేస్తూ లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేశారు.
జంట జలాశయాల తాజా పరిస్థితి ఇదీ : గత కొన్ని రోజులుగా వికారాబాద్, చేవెళ్ల తదితర ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న కుండపోత వర్షాల కారణంగా జంట జలాశయాలకు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. సాయంత్రం 5 గంటలకు జలమండలి విడుదల చేసిన గణాంకాల ప్రకారం జలాశయాల పరిస్థితి ఆందోళనకరంగా మారింది.
ఉస్మాన్‌సాగర్ (గండిపేట):
పూర్తిస్థాయి నీటిమట్టం (FRL): 1790 అడుగులు (3.90 టీఎంసీలు)
ప్రస్తుత నీటిమట్టం: 1789.35 అడుగులు (3.752 టీఎంసీలు)
వస్తున్న వరద (ఇన్‌ఫ్లో): 3200 క్యూసెక్కులు
బయటకు విడుదల (అవుట్‌ఫ్లో): 226 క్యూసెక్కులు
ప్రస్తుతం రెండు గేట్లను ఒక అడుగు మేర ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు.
హిమాయత్‌సాగర్:
పూర్తిస్థాయి నీటిమట్టం (FRL): 1763.50 అడుగులు (2.970 టీఎంసీలు)
ప్రస్తుత నీటిమట్టం: 1762.80 అడుగులు (2.753 టీఎంసీలు)
వస్తున్న వరద (ఇన్‌ఫ్లో): 1100 క్యూసెక్కులు
బయటకు విడుదల (అవుట్‌ఫ్లో): 339 క్యూసెక్కులు
ప్రస్తుతం ఒక గేటును ఒక అడుగు మేర ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు.
మూసీలోకి మరింతగా వరద : గండిపేట జలాశయానికి ఇన్‌ఫ్లో భారీగా వస్తుండటంతో అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈరోజు (ఆగస్టు 27) సాయంత్రం 6 గంటల నుంచి ఉస్మాన్‌సాగర్ నుంచి మూసీలోకి విడుదల చేసే నీటిని 1000 క్యూసెక్కులకు పెంచుతున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఇది మూసీ నదిలో వరద ప్రవాహాన్ని మరింత పెంచే అవకాశం ఉంది.
ఈ ప్రాంతాలకు ప్రమాదం : జంట జలాశయాల నుంచి భారీగా నీటిని విడుదల చేస్తుండటంతో మూసీ నదిలో వరద ప్రవాహం ప్రమాదకర స్థాయికి చేరే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో నది పరివాహక ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేస్తూ జీహెచ్‌ఎంసీ, రెవెన్యూ, పోలీస్ యంత్రాంగాలు హెచ్చరికలు జారీ చేశాయి.
ప్రమాదం పొంచి ఉన్న ప్రాంతాలు: బాపూఘాట్, పురానాపూల్, చాదర్‌ఘాట్, మూసారాంబాగ్, నదికి సమీపంలో ఉన్న బస్తీలు, కాలనీలు.
అధికారుల సూచనలు: ప్రజలు అత్యంత జాగ్రత్తగా ఉండాలని, అవసరమైతే సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని హెచ్చరికలు. విపత్తు నిర్వహణ బృందాలను (DRF) సిద్ధంగా ఉంచారు. నదిలో నీటి ప్రవాహాన్ని చూసేందుకు ఎవరూ వెళ్లవద్దని, సెల్ఫీల కోసం ప్రయత్నించవద్దని విజ్ఞప్తి. పశువులను, వాహనాలను నదికి దూరంగా ఉంచాలని సూచన.
ఏదైనా అత్యవసర పరిస్థితి తలెత్తితే వెంటనే జీహెచ్‌ఎంసీ కంట్రోల్ రూమ్‌కు సమాచారం అందించాలని విజ్ఞప్తి.
Reservoirs flood alert : నిండిన గండిపేట.. మూసీకి పోటెత్తిన వరద.. పరివాహక ప్రాంతాలకు తీవ్ర హెచ్చరిక!
సంబంధిత వార్తలు | RELATED ARTICLES


