Illegal restaurant service charges : కుటుంబంతో కలిసి హాయిగా హోటల్‌కు వెళ్లారు.. నోరూరించే వంటకాలను ఆస్వాదించారు.. చివర్లో బిల్లు చేతికొచ్చింది. అందులో మీరు తిన్న పదార్థాల ధరతో పాటు, కింద చిన్న అక్షరాలతో ‘సర్వీస్ ఛార్జ్’ అని కనిపించిందా? ఆ పక్కనే జీఎస్టీ కూడా ఉందా? అయితే మీరు మోసపోతున్నట్లే! హైదరాబాద్‌లోని అనేక హోటళ్లు, రెస్టారెంట్లు నిబంధనలకు నీళ్లొదిలి, సేవల రుసుము పేరుతో వినియోగదారుల జేబులకు చిల్లు పెడుతున్నాయి. అసలు ఈ సర్వీస్ ఛార్జ్ వసూలు చేయడం చట్టబద్ధమేనా? దానిపై మళ్లీ జీఎస్టీ వేయడం సరైనదేనా? ఈ దోపిడీపై న్యాయస్థానాలు ఏమంటున్నాయి?
అదనపు బాదుడు.. అసలు లెక్క ఇది : హైదరాబాద్ అంటేనే విభిన్న రుచులకు చిరునామా. నగరంలో అధికారిక లెక్కల ప్రకారం దాదాపు 75,000 రెస్టారెంట్లు, మరో 20,000 పైగా కెఫేలు, హోటళ్లు ఉన్నాయి. ఇంత భారీ వ్యాపారం జరుగుతున్నా, కొన్ని యాజమాన్యాలు అడ్డదారుల్లో అదనపు సంపాదనకు తెరలేపాయి. కేంద్ర వినియోగదారుల రక్షణ ప్రాధికార సంస్థ (CCPA) మార్గదర్శకాల ప్రకారం, హోటళ్లు, రెస్టారెంట్లు సర్వీస్ ఛార్జీని తప్పనిసరిగా వసూలు చేయకూడదు. అది పూర్తిగా వినియోగదారుడి ఐచ్ఛికం (voluntary). కానీ, చాలా చోట్ల దీనిని తప్పనిసరి చేసి, బిల్లులో 5 నుంచి 20 శాతం వరకు బాదేస్తున్నారు.
ఇక్కడితో ఈ మోసం ఆగడం లేదు. అసలు బిల్లుకు సర్వీస్ ఛార్జీని కలిపి, వచ్చిన మొత్తంపై మళ్లీ జీఎస్టీ విధిస్తున్నారు. దీనివల్ల వినియోగదారుడు అటు సర్వీస్ ఛార్జ్‌తో పాటు, దానిపై అదనంగా జీఎస్టీ భారాన్ని కూడా మోయాల్సి వస్తోంది.
కోర్టుల ఆగ్రహం.. యాజమాన్యాల బేఖాతరు : ఈ వ్యవహారంపై ఇటీవల ఢిల్లీ హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. “వాటర్ బాటిళ్లు, ఇతర శీతల పానీయాలపై ఎమ్మార్పీ (గరిష్ఠ చిల్లర ధర) కన్నా ఎక్కువ వసూలు చేస్తున్నారు. ఆహ్లాదకరమైన వాతావరణం కల్పిస్తున్నామని చెబుతున్నారు. అలాంటప్పుడు మళ్లీ సేవల పేరుతో సర్వీస్ ఛార్జీ మోత ఎందుకు?” అని న్యాయస్థానం సూటిగా ప్రశ్నించింది. అయినా, అనేక యాజమాన్యాలు ఈ ఆదేశాలను బేఖాతరు చేస్తూ తమ దోపిడీని యథేచ్ఛగా కొనసాగిస్తున్నాయి.
విస్తరిస్తున్న వ్యాపారం.. పెరగనున్న మోసం : నేషనల్ రెస్టారెంట్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా నివేదిక ప్రకారం, 2024 నాటికి ఈ రంగంలో వ్యాపారం సుమారు రూ.5 లక్షల కోట్లకు చేరుకుంది. హైదరాబాద్‌లో రానున్న ఆరేళ్లలో మరో 25 వరకు స్టార్ హోటళ్లు, రిసార్టులు రాబోతున్నాయి. ఐటీ కారిడార్, శంషాబాద్ విమానాశ్రయ మార్గం, జీనోమ్ వ్యాలీ వంటి ప్రాంతాల్లో అంతర్జాతీయ సంస్థలు సైతం తమ శాఖలను విస్తరిస్తున్నాయి. ఆతిథ్య రంగం ఇలా విస్తరిస్తున్న కొద్దీ, పర్యవేక్షణ కొరవడితే ఇలాంటి అనైతిక వ్యాపార పద్ధతులు మరింత పెరిగే ప్రమాదం ఉందని వినియోగదారుల సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.
వినియోగదారుడిగా మీ హక్కులు: సర్వీస్ ఛార్జ్ చెల్లించడం తప్పనిసరి కాదు. అది మీ ఇష్టంపై ఆధారపడి ఉంటుంది. బిల్లులో సర్వీస్ ఛార్జ్‌ను యాజమాన్యం బలవంతంగా చేర్చితే, దానిని తొలగించమని మీరు కోరవచ్చు. యాజమాన్యం నిరాకరిస్తే, మీరు వినియోగదారుల ఫోరంలో ఫిర్యాదు చేసే హక్కు మీకుంది. బిల్లు తీసుకునే ముందు ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలించడం మీ బాధ్యత.


