Saturday, November 15, 2025
HomeతెలంగాణAero-Engine Hub: భాగ్యనగరంలో ఇంజిన్ల గర్జన.. ప్రపంచ విమానాలకు మన విడిభాగాల దన్ను!

Aero-Engine Hub: భాగ్యనగరంలో ఇంజిన్ల గర్జన.. ప్రపంచ విమానాలకు మన విడిభాగాల దన్ను!

Aerospace manufacturing hub” : ఐటీకి అడ్డా… ఫార్మాకు కోట… ఇప్పుడు భాగ్యనగరం ఆకాశానికే ఎత్తిన పతాక! ప్రపంచ దిగ్గజ విమానాలకు ఇక మన గడ్డపైనే ప్రాణం పోయనున్నారు. ఫ్రాన్స్‌కు చెందిన సాఫ్రాన్, మన టాటా సంస్థలు కలిసి హైదరాబాద్‌లో ప్రారంభించిన ఓ అత్యాధునిక కేంద్రం, ప్రపంచ ఏరోస్పేస్ చిత్రపటంలో మన స్థానాన్ని సుస్థిరం చేస్తోంది. 

- Advertisement -

దిగ్గజాల భాగస్వామ్యం.. భాగ్యనగరంలో నిర్మాణం : ఐటీ, ఫార్మా రంగాలతో పాటు ఏరోస్పేస్ రంగానికి హైదరాబాద్ కేరాఫ్ అడ్రస్‌గా మారుతోంది. ఈ క్రమంలో మరో కీలక ముందడుగు పడింది. వాణిజ్య, యుద్ధ విమానాల ఇంజిన్లు తయారు చేసే అంతర్జాతీయ దిగ్గజం సాఫ్రాన్ ఎయిర్‌క్రాఫ్ట్ ఇంజిన్స్, మన దేశీయ సంస్థ టాటా అడ్వాన్స్‌డ్ సిస్టమ్స్ భాగస్వామ్యంతో హైదరాబాద్ ఆదిభట్లలోని ‘టాటా సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ ఏరో ఇంజిన్స్’లో అత్యాధునిక తయారీ కేంద్రాన్ని ప్రారంభించింది. రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి డి.శ్రీధర్ బాబు ఈ కేంద్రాన్ని లాంఛనంగా ప్రారంభించారు.

లీప్’ ఇంజిన్ల ప్రత్యేకత ఇదే : ఈ కొత్త కేంద్రంలో ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా వినియోగంలో ఉన్న ‘సీఎఫ్‌ఎం లీప్’ (CFM LEAP) ఇంజిన్లలో వినియోగించే కీలకమైన కదిలే విడిభాగాలను (moving parts) ఉత్పత్తి చేయనున్నారు. ఈ ఇంజిన్లకు ప్రపంచవ్యాప్తంగా మంచి డిమాండ్ ఉంది.
ఇంధనం ఆదా: ఈ ఇంజిన్ల వాడకం వల్ల విమాన ఇంధనం ఏకంగా 15% ఆదా అవుతుందని సాఫ్రాన్ సంస్థ వెల్లడించింది.

తక్కువ శబ్దం: సాధారణ ఇంజిన్లతో పోలిస్తే ఇవి చాలా తక్కువ శబ్దం చేస్తాయి, పర్యావరణానికి మేలు చేకూరుస్తాయి. ఈ కీలకమైన విడిభాగాల ఉత్పత్తికి అవసరమైన మెషీనింగ్, స్పెషల్ ప్రాసెస్‌లన్నీ ఇక్కడే చేపట్టనుండటం విశేషం.

భారత్‌కు ఎందుకింత కీలకం : ఈ తయారీ కేంద్రం ఏర్పాటు మన దేశ ఏరోస్పేస్ రంగానికి, ‘మేక్ ఇన్ ఇండియా’ కార్యక్రమానికి పెద్దపీట వేస్తోంది.
మూడో అతిపెద్ద విపణి: ‘లీప్’ ఇంజిన్లకు ప్రపంచంలోనే భారతదేశం మూడో అతిపెద్ద మార్కెట్‌గా ఉంది.
విస్తృత వినియోగం: దేశంలోని పౌర విమానాల్లో 75% వరకు సీఎఫ్‌ఎం టర్బోఫ్యాన్ టెక్నాలజీనే వినియోగిస్తున్నారు.
భారీ ఆర్డర్లు: ఇప్పటివరకు దేశీయ విమానయాన సంస్థలు 2,000కు పైగా ‘లీప్’ ఇంజిన్లను ఆర్డర్ చేశాయి. ఇకపై ఈ ఇంజిన్లకు అవసరమైన విడిభాగాలు మన దేశం నుంచే అందనున్నాయి.

“అత్యుత్తమమైన లీప్ ఇంజిన్ కార్యక్రమంలో భాగం కావడం ద్వారా, అంతర్జాతీయ ఏరోస్పేస్ సరఫరా వ్యవస్థలో మన దేశ సత్తా చాటినట్లు అవుతుంది.”
– సుకరన్ సింగ్, సీఈఓ, ఎండీ, టాటా అడ్వాన్స్‌డ్ సిస్టమ్స్

ఇప్పటికే టాటా సంస్థ హైదరాబాద్‌లోని ప్లాంట్ల నుంచి తేజస్ యుద్ధవిమానం, ప్రచండ్ హెలికాప్టర్లకు విడిభాగాలు సరఫరా చేస్తోంది. ఇప్పుడు ఈ కొత్త కేంద్రంతో బోయింగ్, ఎయిర్‌బస్ వంటి దిగ్గజాలకు సరఫరా చేసే జాబితాలో హైదరాబాద్ తన స్థానాన్ని మరింత పదిలం చేసుకుంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad