Warangal highway flooding causes : సుదూర ప్రయాణాలను సులభతరం చేసేవి జాతీయ రహదారులు. కానీ, అదే జాతీయ రహదారి వానొస్తే చెరువులా మారితే? వాహనాలు వరదలో చిక్కుకుపోయి, ప్రయాణికులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకోవాల్సిన దుస్థితి వస్తే? సరిగ్గా ఇదే పరిస్థితి హైదరాబాద్ – వరంగల్ జాతీయ రహదారిపై జనగామ జిల్లా రఘునాథపల్లి వద్ద ఎదురవుతోంది. బుధవారం కురిసిన భారీ వర్షానికి ఈ రహదారి రెండు చోట్ల పూర్తిగా నీట మునిగి, గంటల తరబడి రాకపోకలు నిలిచిపోయాయి. గతంలో ఎన్నడూ లేని ఈ సమస్యకు కారణం ప్రకృతి ప్రకోపమా లేక మానవ తప్పిదమా? ఈ జలదిగ్బంధం వెనుక ఉన్న అసలు కారణాలేంటి?
రఘునాథపల్లి వద్ద అసలేం జరిగింది : బుధవారం రాత్రి కురిసిన కుండపోత వర్షానికి రఘునాథపల్లి వద్ద జాతీయ రహదారి ప్రధాన మార్గంతో పాటు, సర్వీసు రోడ్లు కూడా పూర్తిగా జలమయమయ్యాయి. వరద ఉద్ధృతికి ఓ ఆర్టీసీ డీలక్స్ బస్సు వరద నీటిలో చిక్కుకుని మొరాయించింది. డ్రైవర్ అప్రమత్తతో ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. హైదరాబాద్ నుంచి వస్తున్న ఓ కారు అదుపుతప్పి డివైడర్‌ను, గేట్లను ఢీకొట్టింది. పరిస్థితి తీవ్రత దృష్ట్యా అధికారులు రోడ్డును మూసివేయాల్సి వచ్చింది. గతంలో ఎప్పుడూ లేని విధంగా ఈ ప్రాంతం ముంపునకు గురవ్వడం వెనుక అధికారుల నిర్లక్ష్యం, అక్రమ కట్టడాలే ప్రధాన కారణమని స్థానికులు, రైతులు ముక్తకంఠంతో ఆరోపిస్తున్నారు.
ఎందుకీ దుస్థితి? మూలాల్లోకి వెళ్తే : స్థానికులు చెబుతున్న ప్రకారం, ఈ ముంపు సమస్యకు అనేక కారణాలున్నాయి.
ధ్వంసమైన చెక్ డ్యాం: పూర్వం, ఖిలాషాపురం అలుగు నీరు, ఇతర వరద నీరు ‘వెల్ది చెక్ డ్యాం’ మీదుగా సమీపంలోని చెరువులు, కుంటల్లోకి వెళ్లేది. కొంతకాలం క్రితం ఆ చెక్ డ్యాం ధ్వంసమైనా, అధికారులు మరమ్మతులు చేయలేదు. దీంతో వరద నీరు చెరువుల్లోకి వెళ్లే మార్గం మూసుకుపోయింది.
అక్రమ నిర్మాణాలు: జాతీయ రహదారి పక్కన వెలసిన హోటళ్లు, పెట్రోల్ బంకులు, రియల్ ఎస్టేట్ వెంచర్లు వరద నీటి సహజ ప్రవాహానికి అడ్డుకట్టలు వేశాయి.
అశాస్త్రీయ నిర్మాణం: జాతీయ రహదారి నిర్మాణ సమయంలో అధికారులు, కాంట్రాక్టర్లు వరద ప్రవాహాన్ని సరిగ్గా అంచనా వేయలేదని, అందుకు తగ్గట్టుగా ఎత్తైన వంతెనలు, సరైన అండర్ డ్రైనేజీ వ్యవస్థను నిర్మించలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. గ్రామం వద్ద నిర్మించిన బ్రిడ్జి కూడా లోపభూయిష్టంగా ఉందని వారు వాపోతున్నారు.
ఈ కారణాలన్నింటి ఫలితంగా, వరద నీరు చెరువుల్లోకి వెళ్లే దారిలేక, పంట పొలాల మీదుగా, గ్రామ వీధుల గుండా ప్రవహించి, చివరకు జాతీయ రహదారిని ముంచెత్తుతోంది. దీంతో రైతులు పంట నష్టపోతుండగా, గ్రామస్థుల ఇళ్లలోకి నీరు చేరి తీవ్ర అవస్థలు పడుతున్నారు.
అధికారులు ఇప్పటికైనా మేల్కొని, ధ్వంసమైన చెక్ డ్యాంకు మరమ్మతులు చేపట్టడంతో పాటు, వరద నీటి ప్రవాహానికి అడ్డుగా ఉన్న అక్రమ కట్టడాలను తొలగించి, శాశ్వత పరిష్కారం చూపాలని స్థానికులు కోరుతున్నారు.


