నాలుగు దశాబ్దాలుగా తాను నివసిస్తున్న ఇల్లు బఫర్ జోన్ పరిధిలో లేదని హైడ్రా కమిషనర్ రంగనాథ్ (HYDRAA Commissioner Ranganath) ఆదివారం విడుదల చేసిన ఓ ప్రకటనలో స్పష్టం చేశారు. వాస్తవాలు ఒక రకంగా ఉంటే తప్పుడు సమాచారంతో కొందరు ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు చేస్తున్న ప్రయత్నాన్ని తాను ఖండిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. తాను నివాసముంటున్న ఇల్లు నాలుగు దశాబ్దాల క్రితం తమ నాన్న నిర్మించారని, చెరువు గట్టుకు తన ఇల్లు కిలోమీటర్ దూరంలో ఉంటుందని ఆయన వెల్లడించారు. తాను నివాసముంటున్న ఆ ఇల్లు బఫర్ జోన్ లో ఉందని, కొన్ని సామాజిక మాధ్యమాలతో పాటు కొన్ని పత్రికల్లో వచ్చిన వార్తల్లో వాస్తవం లేదన్నారు.
ఒకప్పటి పెద్ద చెరువునే రెండున్నర దశాబ్దాల క్రితం కృష్ణకాంత్ పార్కుగా మార్చిన విషయం అందరికీ తెలిసిందేనని హైడ్రా కమిషనర్ (HYDRAA Commissioner) పేర్కొన్నారు. అయినప్పటికీ చెరువు కట్టకు దిగువున 10 మీటర్లు దాటితే కిందన వున్న నివాసాలు ఇరిగేషన్ నిబంధనల మేరకు బఫర్ జోన్ పరిధిలోకి రావని ఆయన వివరించారు. అయినప్పటికీ కట్టకు తన నివాసం దాదాపు కిలో మీటర్ దూరంలో ఉన్నట్లు ఆయన తెలిపారు. వాస్తవానికి ఆ ఇంటిని తమ నాన్న ఎ.పీ.వీ.సుబ్బయ్య 1980వ సంవత్సరంలో నిర్మించారని, సుమారు 44 ఏళ్ల క్రితం నిర్మించిన అదే ఇంట్లో నివాసముంటున్నట్లు తెలిపారు. ప్రస్తుత కృష్ణకాంత్ పార్కుగా వున్న స్థలంలో సుమారు 25 సంవత్సరాల క్రితం ఒక చెరువు ఉండేదని, చెరువున్నప్పటి నిబంధనల ప్రకారం తాముంటున్న నివాసం కట్టకు ఒక కిలోమీటరు దూరంలో ఉండగా, బఫర్ జోన్ పరిధిలోకి ఎలా వస్తుందని ఆయన ప్రశ్నించారు.
Also Read : పోటీ పరీక్షలు రాసే అభ్యర్థులకు ‘టీ-సాట్’ బంపర్ ఆఫర్
సంస్కృతి, సంప్రదాయాలలో భాగంగా చెరువు కట్ట మీద, కట్టను ఆనుకుని కట్ట మైసమ్మ ఆలయాలు నిర్మిస్తారనే విషయం అందరికీ తెలిసిందేనని రంగనాథ్ పేర్కొన్నారు. తాను నివాసముంటున్న ఇంటికి ఒక కిలోమీటరు దూరంలో కట్ట మైసమ్మ గుడి ఉన్నట్లు ఆయన స్పష్టం చేశారు. ఎక్కడైనా చెరువు కట్ట ఎత్తుపై ఆధారపడి దిగువ భాగంలో 5 నుంచి 10 మీటర్ల వరకున్న స్థలాన్ని బఫర్ జోన్ గా ఇరిగేషన్ శాఖ పరిగణిస్తుందని రంగనాథ్ తెలిపారు. 25 ఏళ్ల క్రితం పెద్దచెరువు ప్రస్తుతం కృష్ణకాంత్ పార్కుగా మారిన స్థలం, మా నివాసానికి ఒక కిలోమీటర్ల దూరంలో ఉందన్న విషయాన్ని గమనించాలని కోరారు. మేము నివాసం వుంటున్న ఇళ్లు బఫర్ జోన్లో లేదని, వాస్తవం అనేది అందరూ గ్రహించాలని రంగనాథ్ కోరారు.