HYDRAD demolishes Illegal Constructions: హైదరాబాద్ సమీపంలోని కొండాపూర్‌లో హైడ్రా కూల్చివేతలు చేపట్టింది. ఆర్టీఏ కార్యాలయానికి సమీపంలో గల భిక్షపతి నగర్‌లో ఉన్న అక్రమకట్టడాలను కూల్చివేసింది. దాదాపు 36 ఎకరాల ప్రభుత్వ స్థలంలో అక్రమ నిర్మాణాలను హైడ్రా సిబ్బంది తొలగించింది. దీంతో స్థానికులు తీవ్ర ఆందోళనకు దిగారు. భారీ కేర్లను అడ్డుకునే ప్రయత్నం చేశారు. కానీ పోలీసులు భారీ బందోబస్తు నడుమ కూల్చివేతలు చేపట్టారు. కూల్చివేతల వద్దకు స్థానికులను అనుమతించట్లేదు. వారిని రెండు కిలోమీటర్ల దూరంలోనే బారికేడ్లను ఏర్పాటు చేసి అడ్డుకున్నారు.
కఠిన చర్యలు తప్పవు: ఈ భూమిని కొంతమంది కబ్జా చేసినట్లు హైడ్రా అధికారులు తెలిపారు. ఈ విషయమై హైకోర్టు తీర్పు మేరకు హైడ్రా ఆక్రమణల తొలగింపును చేపట్టిందని అన్నారు. భూ కబ్జా కోసం అక్రమ నిర్మాణాలు చేపట్టిన వారిపై చర్యలు తీసుకుంటామని అన్నారు. తాత్కాలిక షెడ్లను ఏర్పాటు చేసి వ్యాపారం చేసుకుంటున్న వారిని ఖాళీ చేయించేందుకే హైడ్రా కూల్చివేతలు చేపట్టిందని తెలిపారు.
రూ.3,600 కోట్ల విలువైన భూమి: కూల్చివేతల అనంతరం హైడ్రా చుట్టూ కంచె వేసి ప్రభుత్వ భూమిగా పేర్కొంటూ బోర్డులు ఏర్పాటు చేసింది. సర్వే నంబర్ 59లోని ఈ భూముల విలువ రూ.3,600 కోట్లు ఉంటుందని హైడ్రా అధికారులు పేర్కొన్నారు. మరోవైపు స్థానికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. 60 ఏళ్లుగా తమ ఆధీనంలోనే భూమి ఉన్నట్లు స్థానిక రైతులు పేర్కొన్నారు.
స్థానికుల ఆందోళన: కూల్చివేతలకు వ్యతిరేకంగా స్థానికులు నిరసన చేపట్టారు. తాము డబ్బులు పెట్టి కొనుక్కున్నామని వాపోతున్నారు. ఈ అక్రమాలను అడ్డుకోలేని ప్రభుత్వ యంత్రాంగంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.


