Saturday, November 15, 2025
Homeతెలంగాణ'iBomma' Threat Fact Check: పోలీసులకు 'ఐబొమ్మ' బెదిరింపులు.. క్లారిటీ ఇచ్చిన తెలంగాణ ప్రభుత్వం

‘iBomma’ Threat Fact Check: పోలీసులకు ‘ఐబొమ్మ’ బెదిరింపులు.. క్లారిటీ ఇచ్చిన తెలంగాణ ప్రభుత్వం

‘iBomma’ Threat News: సినీ ఇండస్ట్రీని కుదిపెస్తున్న పైరసీ భూతంపై హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. ఇటీవల సినిమా పైరసీ రాకెట్ ముఠా గుట్టురట్టు చేసింది. ఈ రాకెట్‌కు చెందిన ఐదుగురు సభ్యులను అరెస్టు చేసి, వారి వద్ద నుంచి కీలక ఆధారాలైన డెబిట్‌కార్డులు, హార్డ్‌డిస్క్‌లు, సెల్‌ఫోన్‌లను స్వాధీనం చేసుకుంది. ఇది జరిగిన కొన్ని గంటల్లోనే ఒక సంచలన వార్త సోషల్ మీడియాలో వైరల్ అయింది.

- Advertisement -

ప్రముఖ సినిమా పైరసీ వెబ్‌సైట్ ‘ఐబొమ్మ’ (iBomma) పేరుతో తెలంగాణ పోలీసులకు హెచ్చరికలు జారీ చేశారంటూ ఓ పోస్ట్ బయటకు వచ్చింది.. గోప్యమైన ఫోన్ నంబర్లు లీక్ చేస్తామని బెదిరించిందని కొన్ని మీడియా కథనాలు, సోషల్ మీడియా పోస్టులు ప్రచారం చేశాయి. అయితే, ఈ బెదిరింపుల వార్తలను తెలంగాణ ప్రభుత్వం తాజాగా ఖండించింది. ఈ ప్రచారం అవాస్తవం అని తెలంగాణ ప్రభుత్వ ఫ్యాక్ట్‌చెక్‌ (Fact Check) టీమ్ స్పష్టం చేసింది.

2023 నాటి స్క్రీన్‌షాట్లు..
తెలంగాణ ప్రభుత్వ ఫ్యాక్ట్‌చెక్‌ పేజీ తమ అధికారిక ‘ఎక్స్’ (గతంలో ట్విట్టర్) ఖాతాలో ఈ అంశంపై ఒక పోస్టు పెట్టి, పూర్తి వివరాలను వెల్లడించింది. కొన్ని మీడియా కథనాలు, సోషల్ మీడియా పోస్టుల ప్రకారం, సినిమా పైరసీ సైట్ iBomma తెలంగాణ పోలీసులకు హెచ్చరిక జారీ చేసి, గోప్యమైన ఫోన్ నంబర్లను లీక్ చేస్తామని బెదిరించిందని చెబుతున్నారు. అయితే, ప్రస్తుతం ప్రసారం అవుతున్న స్క్రీన్‌షాట్‌లు 2023 నాటివి. అవి కూడా పోలీసులకు కాకుండా తెలుగు సినిమా పరిశ్రమకు సంబంధించినవే.” అని స్పష్టంగా పేర్కొన్నారు.

దీనిని బట్టి, ఇప్పుడు జరుగుతున్న ప్రచారానికి, తాజాగా జరిగిన సైబర్ క్రైమ్ అరెస్టులకు ఎటువంటి సంబంధం లేదని తేలిపోయింది. “తెలంగాణ పోలీసులకు ఇలాంటి ఎటువంటి బెదిరింపు రాలేదని తెలియజేస్తున్నాం” అని ఫ్యాక్ట్‌చెక్ టీమ్ వెల్లడించింది..

పైరసీపై ఉక్కుపాదం
సినిమా పైరసీపై టాలీవుడ్‌లో పోరాటం కొనసాగుతున్న తరుణంలో, ఈ రాకెట్‌ను ఛేదించడం తెలంగాణ సైబర్ క్రైమ్ పోలీసులకు దక్కిన గొప్ప విజయం అని సినీ ఇండస్ట్రీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.. సినిమా విడుదలైన వెంటనే పైరసీ కాపీలను అప్‌లోడ్ చేసి, సినిమా నిర్మాతలకు భారీ నష్టాన్ని కలిగించే ఇలాంటి ముఠాలను అదుపులోకి తీసుకోవడం సినీ పరిశ్రమకు ఊరటనిచ్చింది. ఈ చర్యతో పైరసీకి పాల్పడే ఇతరులకు కూడా ఒక గట్టి హెచ్చరిక పంపినట్లయింది.

ప్రజలు సోషల్ మీడియాలో పోస్టు చేసే, షేర్ చేసే విషయాల ప్రామాణికతను పరిశీలించుకోవాలని, తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేయవద్దని తెలంగాణ ప్రభుత్వం ఫ్యాక్ట్‌చెక్‌ టీమ్ విజ్ఞప్తి చేసింది. అవాస్తవ బెదిరింపులు, తప్పుడు వార్తలను నమ్మవద్దని, ఇటువంటి సమాచారం కనిపిస్తే వెంటనే అధికారిక సంస్థలకు నివేదించాలని కోరింది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad