తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎక్కడా అమలు కావడం లేదని అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. వ్యవసాయానికి 24 గంటల విద్యుత్, రైతుబంధు, రైతుబీమా, ఇంటింటికీ రక్షిత మంచినీరు, ఆసరా పెన్షన్లు, కేసీఆర్ కిట్, కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలు బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎక్కడైనా అమలవుతుంటే చూపాలని బీజేపీ నేతలను ప్రశ్నించారు.
నిర్మల్ పట్టణంలోని ఓ ఓ ఫంక్షన్ హాల్ లో నిర్వహించిన నిర్మల్ మండల బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, బీఆర్ఎస్ జిల్లా ఇంచార్జ్ గంగాధర్ గౌడ్, ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. గత తొమ్మిదేండ్లలో సీయం కేసీఆర్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను వివరించారు. అభివృద్ధి, సంక్షేమ పథకాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకు వెళ్ళాలని ఈ సందర్భంగా మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పార్టీ శ్రేణులకు దిశానిర్ధేశం చేశారు.
మాజీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి ఎక్కడ ఉన్నాడో తెలిసిందా అని అడిగిన ఐకే రెడ్డి.. గతంలో మహేశ్వర్ రెడ్డి గురించి తాను చేసిన వ్యాఖ్యలు నిజమయ్యాయని, ఆయన నేడో రేపు బీజేపీ పార్టీలో చేరటం ఖాయమని స్పష్టం చేశారు.