Tuesday, September 24, 2024
HomeతెలంగాణIllandukunta: అపరభద్రాద్రి శ్రీ సీతారాముల కళ్యాణానికి రావాలండీ

Illandukunta: అపరభద్రాద్రి శ్రీ సీతారాముల కళ్యాణానికి రావాలండీ

అపర భద్రాద్రిగా పేరొందిన ఇల్లందకుంట శ్రీ సీతారామచంద్రస్వామి కళ్యాణ మహోత్సవాన్ని, ఈ నెల 30న నిర్వహించనున్న నేపథ్యంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుండే కాకుండా ఇతర జిల్లాల నుండి సైతం భక్తులు భారీ సంఖ్యలో తరలి రావాలని ఇల్లందకుంట ఎంపీపీ సరిగొమ్ముల పావనివెంకటేష్ పిలుపునిచ్చారు.  సీతారామచంద్రస్వామి బ్రహ్మోత్సవాల కరపత్రాలను ఆవిష్కరించిన అనంతరం ఐదు ప్రచార రథాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీపీ పావని వెంకటేష్ మాట్లాడుతూ.. కరీంనగర్ జిల్లాలో ప్రసిద్ధిగాంచిన దేవాలయాలలో ఇల్లందకుంట, శ్రీ సీతారామచంద్రస్వామి దేవాలయం ముందుంటుందని అన్నారు.

- Advertisement -

ఈ ఏడాది ఇక్కడి కల్యాణానికి లక్షకు పైగా భక్తులు తరలి వచ్చే అవకాశం ఉందని, ఈమేరకు దేవదాయ శాఖ అధికారులు తగు ఏర్పాటు చేస్తున్నట్టు వెల్లడించారు. ఇటీవల జమ్మికుంట లో జరిగిన బీఆర్ఎస్ బహిరంగ సభలో  ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి, శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవానికి ప్రభుత్వం తరఫున ముఖ్య అతిథిగా రావాల్సిందిగా గౌరవ ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ను ఆహ్వానించారని తెలిపారు.

ఆలయ కార్యనిర్వహణ అధికారి కందుల సుధాకర్ మాట్లాడుతూ ..బ్రహ్మోత్సవాలు ఈనెల 28న ప్రారంభమై వచ్చే నెల తొమ్మిదో తారీఖు వరకు జరుగుతాయన్నారు. 30న శ్రీ సీతారాముల కళ్యాణం జరుగుతుందని 31న శ్రీరాముడి పట్టాభిషేక మహోత్సవ కార్యక్రమం నిర్వహిస్తామన్నారు. వచ్చే నెల 5న సాయంత్రం సూర్యరథం(చిన్న రథం) ఆరవ తేది సాయంత్రం నుండి ఏడవ తేది మధ్యాహ్నం వరకు చంద్రరథం(పెద్ద రథం) ఉంటుందన్నారు. 8వ తేదీ రాత్రి శ్రీ పుష్పయాగం(నాఖబలి) 9వ తేదీ రాత్రి సప్త వర్ణాలు, ఏకాంత సేవతో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయని తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఇల్లందకుంట సర్పంచ్ కంకణాల శ్రీలతసురేందర్ రెడ్డి, ఎంపీటీసీ దాంసాని విజయకుమార్ పిఎసిఎస్ వైస్ చైర్మన్ కందాల కొమురెల్లి ఆలయ ప్రధాన అర్చకులు శేషం రామాచార్యులు, శేషం వంశీధరచార్యులు, నవీన్ శర్మ, ఆలయ ఉద్యోగులు రవి, మోహన్, రాజయ్య, రమేష్, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News