Friday, November 22, 2024
HomeతెలంగాణIllandukunta: అద్దె చెల్లించని ఎంపీడీవో ఆఫీస్ కు తాళం వేసిన ఓనర్

Illandukunta: అద్దె చెల్లించని ఎంపీడీవో ఆఫీస్ కు తాళం వేసిన ఓనర్

ఏప్రిల్ 15 పరిపాలన సౌలభ్యం కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా మండలాలను ఏర్పాటు చేసిన సమయంలో జమ్మికుంట మండల పరిధిలోని ఇల్లందకుంటను కొత్త మండలంగా ఏర్పాటు చేస్తూ నిర్ణయం తీసుకుంది. నూతనంగా ఏర్పడిన ఇల్లందకుంట మండల కేంద్రంలో ప్రభుత్వ కార్యాలయాలు సొంత భవనాలు అందుబాటులో లేకపోవడంతో ఎంపీడీవో కార్యాలయాన్ని నాలుగు సంవత్సరాల క్రితం అద్దె భవనంలో ఏర్పాటు చేశారు. నెలకు 9,100 చొప్పున కిరాయి చెల్లించేందుకు ఇంటి యజమానితో ఒప్పందం కుదుర్చుకున్నారు. కానీ అద్దె చెల్లించేందుకు కార్యాలయం పరిధిలో ఎలాంటి ఆదాయ వనరులు లేకపోవడంతో సకాలంలో అద్దె చెల్లించేందుకు ఇబ్బందులు పడుతూ వచ్చారు. దీనికి తోడు ఉన్నతాధికారుల అలసత్వంతో ఇక్కడ ఏ ఒక్క ఎంపీడీవో కూడా పూర్తి కాలం పని చేయకుండా మధ్య మధ్యలోనే వెళ్లిపోవడంతో అద్దె చెల్లించేందుకు ఎవరు సరియైన దృష్టి సారించలేకపోయారు. 46 నెలల కాలంలో ఏడుగురు ఎంపీడీవోలు ఇక్కడ పనిచేశారంటే జిల్లాస్థాయి ప్రజా ప్రతినిధులకు, అధికారులకు ఇల్లందకుంట మండలంపై ఎంత చిన్నచూపు ఉందో అర్థం చేసుకోవచ్చు. జిల్లాస్థాయి ప్రజా ప్రతినిధులకు మండల పరిధిలో సరైన గుర్తింపు ఇవ్వడం లేదనే బాధ తప్ప మండలాన్ని అభివృద్ధి పథంలో తీసుకెళ్లేందుకు తమ వంతు పాత్ర పోషిస్తామనే ఆలోచన ఏమాత్రం లేకపోవడం శోచనీయం.

- Advertisement -

అద్దె చెల్లించలేదని కార్యాలయానికి తాళం…
కొత్తగా ఏర్పాటు చేసిన ఇల్లందకుంట ఎంపీడీవో కార్యాలయానికి అద్దె చెల్లించేందుకు స్థానిక ప్రజాప్రతినిధులు అధికారులు నానా అవస్థలు పడుతున్నారు. ఎట్టకేలకు 30 నెలల ఇంటి కిరాయి చెల్లించినప్పటికీ మరో 16 నెలల అద్దె చెల్లించాల్సి ఉంది. తనకు రావలసిన ఇంటి కిరాయి రూ,1,45,600 లను చెల్లించాలని పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లిన ఫలితం లేకపోవడంతో ఇంటి యజమాని చింతిరెడ్డి మల్లారెడ్డి శనివారం ఎంపీడీవో కార్యాలయానికి తాళం వేసి కార్యాలయ సిబ్బందిని గేటు బయటనే నిలుపుదల చేశాడు. 10 గంటలకు కార్యాలయానికి చేరుకున్న సిబ్బంది విధి లేని పరిస్థితులలో కార్యాలయం బయటనే వేచి ఉండి ఇంచార్జ్ ఎంపీడీవో వెంకటేశ్వర్లుకు సమాచారం అందించారు. ఎట్టకేలకు 12 గంటల 30 నిమిషాలకు కార్యాలయానికి చేరుకున్న ఇంచార్జ్ ఎంపీడీవో వెంకటేశ్వర్లు ఇంటి యజమానితో మాట్లాడి మూడు రోజుల్లోగా చెల్లించాల్సిన అద్దె మొత్తాన్ని చెల్లిస్తామని హామీ ఇవ్వడంతో ఇంటి యజమాని గేటు తాళం తీశాడు. ఈ సందర్భంగా తెలుగు ప్రభ ప్రతినిధి ఇంచార్జ్ ఎంపీడీవోను వివరణ కోరగా ఇంటి యజమానికి 16 నెలల అద్దె చెల్లించాల్సిన మాట వాస్తవమేనని అన్నారు. సమస్యను ఎంపీపీ తో పాటు డిప్యూటీ సీఈఓ దృష్టికి తీసుకెళ్లామన్నారు. మూడు రోజుల్లోగా సమావేశం ఏర్పాటు చేసుకొని ఇంటి యజమానికి పూర్తిస్థాయిలో అద్దె చెల్లించిన తర్వాత నూతనంగా నిర్మాణం చేపట్టిన ఎం ఆర్ సి భవనంలోకి ఎంపీడీవో కార్యాలయాన్ని మార్చుతామన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News