యువత విద్యతో పాటు క్రీడల పట్ల ఆసక్తి చూపాల్సిన అవసరం ఉందని, క్రీడలతో శారీరక మానసిక ఉల్లాసం కలుగుతుందని రాష్ట్ర ప్రభుత్వ విప్ ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి అన్నారు. ఇల్లందకుంట మండల కేంద్రంలో నిర్వహిస్తున్న సీఎం కప్ క్రీడా పోటీలను ఎంపీపీ సరిగొమ్ముల పావని వెంకటేష్ తో కలిసి ఆయన ప్రారంభించారు. అనంతరం క్రీడాకారులతో కలిసి వాలీబాల్, కో..కో ఆడుతూ క్రీడాకారుల్లో ఉత్సాహాన్ని నింపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి మాట్లాడుతూ యువత జీవితంలో విద్య ఎంత ముఖ్యమో క్రీడలు కూడా అంతే ముఖ్యమన్నారు. సరైన సహకారం అందిస్తే గ్రామీణ క్రీడాకారులలో దాగి ఉన్న నైపుణ్యాన్ని వెలికి తీసే అవకాశం ఉంటుందన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ గ్రామీణ ప్రాంతాల్లోని క్రీడాకారులలో దాగిన ఉన్న నైపుణ్యాన్ని వెలికి తీసేందుకే రాష్ట్రవ్యాప్తంగా ప్రతి గ్రామంలో క్రీడా ప్రాంగణాల ఏర్పాటుపై ప్రత్యేక దృష్టి సారించినట్లు చెప్పారు. గ్రామీణ ప్రాంతాల క్రీడాకారులను ప్రోత్సహించేందుకు రాష్ట్రవ్యాప్తంగా సీఎం కప్ క్రీడా పోటీలు నిర్వహించడం జరుగుతుందన్నారు. మండల స్థాయిలో నిర్వహించే క్రీడా పోటీలలో గ్రామీణ ప్రాంతాల్లోని క్రీడాకారుల ప్రతిభ వెలికి తీయడం జరుగుతుందని, ఉత్తమ ప్రతిభ కనబరిచిన క్రీడాకారులను జిల్లా స్థాయిలో జరిగే పోటీలకు ఎంపిక చేయడం జరుగుతుందన్నారు. మూడు రోజులపాటు నిర్వహించే క్రీడా పోటీలలో యువతీ యువకులు ఉత్సాహంగా పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఎంపీపీ పావనివెంకటేష్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజా సంక్షేమానికి అనేక పథకాలను ప్రవేశపెట్టడం జరుగుతుందని, ఆ దిశలోనే అందత్వ నివారణే లక్ష్యంగా కంటి వెలుగు శిబిరాలను ప్రతి గ్రామంలో ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ప్రస్తుతం గ్రామీణ ప్రాంతాల్లోని 15 నుండి 36 సంవత్సరాల వయసున్న యువతీ యువకులలో దాగి ఉన్న క్రీడా నైపుణ్యాలను వెలికి తీసేందుకే క్రీడా పోటీలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. గ్రామీణ ప్రాంతాల క్రీడాకారులు ఈ అవకాశాన్ని సద్విని తీసుకొని జిల్లా స్థాయి పోటీలకు ఎంపిక కావడంపై దృష్టి సారించాలని కోరారు. మండల స్థాయిలో నిర్వహిస్తున్న క్రీడా పోటీలకు అవసరమైన మౌలిక సదుపాయాలపై ప్రత్యేక దృష్టి సారించామన్నారు. కార్యక్రమంలో తాహసిల్దార్ ఠాకూర్ మాధవి, ఇంచార్జ్ ఎంపీడీవో వెంకటేశ్వర్లు, మండల విద్యాధికారి విడపు శ్రీనివాస్, మండల పరిధిలోని ప్రజా ప్రతినిధులు, బిఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.