అపర భద్రాద్రిగా పేరొందిన ఇల్లందకుంట శ్రీ సీతారామచంద్రస్వామి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని గురువారం రాత్రి నుంచి శుక్రవారం సాయంత్రం వరకు బ్రహ్మరథోత్సవాన్ని (పెద్ద రథం) అర్చకులు, ఆలయ అధికారులు అంగరంగ వైభవంగా నిర్వహించారు. శ్రీ సీతారాముల ఉత్సవ మూర్తులను అందంగా అలంకరించిన బ్రహ్మరథోత్సవం పై కొలువు తీర్చగా భారీగా తరలి వచ్చిన భక్తులు శ్రీ సీతారాములను బ్రహ్మరథంపై దర్శించుకుని మొక్కులను చెల్లించుకున్నారు.
భక్తులు శ్రీ సీతారాములను బ్రహ్మరథంపై దర్శించుకునేందుకు ఆలయ ఇంచార్జ్ ఈవో వెంకన్న ఆధ్వర్యంలో ఐదు క్యూలైన్లను ఏర్పాటు చేయడంతో పాటు, ఎండ వేడిమి నుంచి తట్టుకునేందుకు ఆలయ పరిసరాల్లో పందిళ్లను ఏర్పాటు చేశారు. భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా ఎస్సై తోట తిరుపతి ఆధ్వర్యంలో పోలీసులు తగిన బందోబస్తు నిర్వహించారు. సాయంత్రం అశేష భక్తుల రామనామ స్మరణతో బ్రహ్మరథంపై కొలువు తీర్చిన శ్రీ సీతారాములను, ఆలయం మాడవీధులలో ఊరేగించారు.
సుమారు 50 వేల మంది భక్తులు శ్రీ సీతారాములను బ్రహ్మరథంపై దర్శించుకుని, మొక్కులు చెల్లించుకున్నట్లు ఇంచార్జ్ ఈవో వెంకన్న తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ ప్రధాన అర్చకులు శేషం రామాచార్యులు, శేషం వంశీదాచార్యులు వేద పండితులు, ఆలయ ఉద్యోగులు మోహన్, రవి, రాజయ్య, రమేష్, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.