Thursday, September 19, 2024
HomeతెలంగాణIllanthakunta: ముగ్గురు అక్కా చెల్లెళ్ళు ప్రభుత్వ ఉద్యోగులే

Illanthakunta: ముగ్గురు అక్కా చెల్లెళ్ళు ప్రభుత్వ ఉద్యోగులే

సామాన్య కుటుంబ విజయగాథ

ఆడపిల్లలు పుడితే ఆగ్రహించి కలతచెందే తల్లిదండ్రులున్న ఈ రోజుల్లో కూతుళ్లనే కొడుకులుగా భావించి వారిని ఉన్నత చదువులు చదివించి, ప్రభుత్వ ఉద్యోగాలు సాధించేలా తీర్చిదిద్దిన తల్లిదండ్రుల కృషి ఎంతోమందికి ఆదర్శదాయకంగా మారుతుంది. అలాంటి ఓ విజయగాథకు ఇల్లంతకుంట మండలం వేదికగా మారింది.

- Advertisement -

మండలంలోని వల్లంపట్ల గ్రామానికి చెందిన దొడ్ల రేఖ – దేవేందర్ గౌడ్ లది పేద కుటుంబం. ఆ దంపతులకు లహరి ప్రియ, లతా శ్రీ, లిఖిత అనే ముగ్గురు అమ్మాయిలు. తండ్రి దేవేందర్ గౌడ్ వ్యవసాయం చేస్తూ, కొద్ది కాలం పాటు గ్రామ ప్రభుత్వ పాఠశాలలో వాలంటరీ ఉపాధ్యాయులుగా పిల్లలకు సేవలందించారు. తల్లి రేఖ గ్రామములోని అంగన్వాడీ ఉపాధ్యాయురాలుగా సేవలు అందిస్తున్నారు. వారిద్దరికీ మొదటి నుండి విద్యపై మక్కువ ఎక్కువ. పెద్ద కూతురైన లహరి ప్రియ గ్రామములో ఉన్న ప్రభుత్వ పాఠశాలలో పదవ తరగతి వరకు విద్యనభ్యసించి, ఉన్నత చదువులు కరీంనగర్,హైదరాబాద్ లో కొనసాగించి పీజీ పూర్తి చేసింది. రెండవ కూతురు లతాశ్రీ మండల కేంద్రములో 10వ తరగతి చదివి, వ్యవసాయ యూనివర్సిటీ బోధన్ లో చదువును పూర్తి చేసింది. 2017 లో వ్యవసాయ అధికారిగా ప్రభుత్వ ఉద్యోగాన్ని సాధించింది. విధులు నిర్వహిస్తూ దూర విద్యలో పీజీ పూర్తి చేసింది. చిన్న కూతురు లిఖిత నవోదయ పాఠశాల చొప్పదండిలో ఇంటర్ పూర్తి చేసి, ఉన్నత చదువులు హైదరాబాద్ లో విద్యనభ్యసిస్తూ పోటీ పరీక్షలకు సన్నద్ధమైంది. గత మార్చిలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాన్ని సాధించింది. విధులు నిర్వహిస్తూ దూరవిద్యలో పీజీ విద్య కొనసాగిస్తుంది. తన కంటే ఇద్దరు చెల్లెళ్లు ప్రభుత్వ ఉద్యోగం సాధించడంతో అక్క లహరి ప్రియకు ఒక వైపు సంతోషం, మరో వైపు భాధ, పట్టుదలతో పోటీ పరీక్షలకు సిద్ధమవుతూ రెండు సార్లు పోలీస్ శాఖలో ఎస్ఐ ఉద్యోగాన్ని తక్కువ మార్కులతో చేజార్చుకుంది. గత వారం రోజుల క్రితం వెలువడిన ఫలితాల్లో అదే పోలీస్ శాఖలో సివిల్ కానిస్టేబుల్ ఉద్యోగాన్ని సాధించి అటు కన్న తల్లి దండ్రులకు, గ్రామస్తులకు మంచి పేరు తెచ్చి పెట్టింది. ముగ్గురు కూతుళ్లను కుమారులుగా భావించి వారి లక్ష్య సాధనలో ఎప్పటికపుడు వెన్నంటి ఉంటూ ఉన్నత శిఖరాలను చేరే వరకు ప్రోత్సాహం అందించిన తల్లిదండ్రులను మండల వాసులు అభినందనల్లో ముంచెత్తుతున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News