వివిధ సమస్యలతో పోలీస్ స్టేషన్ కి వచ్చే ఫిర్యాదులపై తక్షణమే స్పందిస్తూ కేసులు నమోదు చేయాలని, అధికారులు, విలేజ్ పోలీస్ అధికారులు క్షేత్ర స్థాయిలో గ్రామాలలో సందర్శిస్తూ ప్రజలతో సత్సంబంధాలు కలిగి ఉండాలని రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు.
మంగళవారం రోజున వార్షిక తనిఖీల్లో భాగంగా ఇల్లంతకుంట స్టేషన్ తనిఖీచేసి రిసెప్షన్ సిబ్బంది పనితీరును, ఫిర్యాదులపై ఎలాంటి చర్యలు తీసుకున్నది,పెండింగ్ కేసులు, నిందితుల అరెస్ట్, రౌడీ షీటర్ల వివరాలు, రోడ్డు ప్రమాదాల నివారణకు తీసుకుంటున్న చర్యలు, కోర్ట్ లో పెండింగ్లో వున్న కేసులు వాటికి సంబందించిన దర్యాప్తు వివరాలను అధికారులను ఎస్పీ అడిగి తెలుసుకున్నారు. స్టేషన్ లో నిర్వహిస్తున్న పలురకాల రికార్డులను పరిశీలించి స్టేషన్ పరిధిలో శాంతి భద్రతల పరిరక్షణలో ఇల్లంతకుంట పోలీస్ స్టేషన్ అధికారుల, సిబ్బంది పని తీరు భేషుగ్గా ఉందని కితాబిచ్చారు.
అనంతరం ఎస్పీ మాట్లాడుతూ..
వివిధ సమస్యతో పోలీస్ స్టేషన్ కు వచ్చే ఫిర్యాదు దారులకు సమస్య పరిష్కారం అవుతుందనే నమ్మకాన్ని వారిలో కలిగించాలని, పోలీస్ అధికారులు, సిబ్బంది తరచు గ్రామాల్లో క్షేత్ర స్థాయిలో పర్యటిస్తూ ప్రజలతో సత్సంబంధాలు కలిగి ఉండి గ్రామాల్లో ఏదైనా సంఘటనలు జరిగితే వెంటనే ఉన్నతాధికారులు తెలిసేలా ఇన్ఫర్మేషన్ వ్యవస్థ పటిష్టం చేయాలన్నారు. స్టేషన్ పరిధిలో విజిబుల్ పోలీసింగ్ అమలు చేస్తూ, స్టేషన్ పరిధిలోని రౌడి షీటర్స్, హిస్టరీ షీటర్స్, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిపై నిఘా కఠినతరం చేయాలన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణకు స్టేషన్ పరిధిలో వాహనాల తనిఖీ, డ్రంక్ అండ్ డ్రైవ్ లు ఏర్పాటు చేయాలని, గంజాయి కిట్ల సహాయంతో అనుమానిత వ్యక్తులకు టెస్ట్ లు నిర్వహించాలని,స్టేషన్ పరిధిలో గంజాయి నివారణకు పకడ్బందీగా చర్యలు చెపట్టాలని, గంజాయికి సంబంధించిన సమాచారం సబంధిత పోలీస్ వారికి లేదా, డయల్ 100 కి సమాచారం అందించేలా ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. అధికారులకు, సిబ్బందికి ఏమైనా సమస్యలు ఉన్నాయా అని, ఏమైనా సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకొని రావాలి అని సూచించారు.
ఎస్పీ వెంట డిఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి, సి.ఐ మొగిలి, ఎస్.ఐ శ్రీకాంత్, సిబ్బంది ఉన్నారు.