ఇల్లంతకుంట మండలం పెద్దలింగాపూర్ జడ్పీహెచ్ఎస్ పాఠశాలలో 10వ తరగతి విద్యార్థులకు వీడ్కోలు సమావేశం నిర్వహించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు బోయిని తిరుపతి అధ్యక్షతన జరిగిన వీడ్కోలు సమావేశంలో విద్యార్థుల ఆటపాటలు కార్యక్రమాన్ని అలరించాయి. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రధానోపాధ్యాయులు మాట్లాడుతూ పదవ తరగతిలో మంచి మార్కులు 10/10 జిపిఏ సాధించి పాఠశాలకు గ్రామానికి, తల్లిదండ్రులకు పేరు ప్రతిష్టలు తేవాలని, భవిష్యత్తులో మంచి మార్గానికి పునాది కావాలని కోరారు. విద్యార్థి దశ నుండే దేశభక్తి పెంపొందించాలని పెద్దల పట్ల గౌరవ మర్యాదలు చూపాలని భవిష్యత్తులో రాబోవు తరాలకు మార్గదర్శకంగా నిలవాలని, విద్యార్థులకు భవిష్యత్తు గురించి అనేకమైన విషయాలు బోధించారు. ఈ 10 వ తరగతి అనేది మీ జీవితానికి ఒక బలమైన పునాది అని, ఈ పునాది గట్టిగా ఉన్నట్లయితే భవిష్యత్తులో ఏదైనా సాధించవచ్చని అన్నారు. ప్రస్తుతం ఉన్న సోషల్ మీడియాలో పడి మన భావి భారత జీవితాన్ని నాశనం చేసుకోకూడదని, అవసరమైన మేరకే మీడియాను వాడుకోవాలని దాని ద్వారా భవిష్యత్తును మంచిగ నిర్మించుకోవాలని, చెడు వ్యసనాల జోలికి వెళ్లకూడదని వివరించారు. మద్యం లాంటి మత్తు పదార్థాలకు జూదం లాంటి చెడు వ్యసనాలకు బానిస కాకూడదని దానివల్ల కుటుంబాలకు కుటుంబాలే నాశనం అవుతాయని, వాటి పట్ల ప్రతిరోజు అప్రమత్తంగా ఉండాలని, భవిష్యత్తు అంతా కంప్యూటర్ యుగంలో జీవిస్తాం కాబట్టి ఆన్లైన్ జరిగే మోసాలు కూడా ఎదుర్కోవాలని తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయిని, ఉపాధ్యాయులు రమేష్, యాదగిరి, పుష్పలత, రవీందర్, జగన్ మోహన్ రెడ్డి, సునీత, పద్మలత, శ్రీనివాస్, సమత తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమ అనంతరం విద్యార్థులకు హాల్ టికెట్స్ పంపిణీ చేసి వీడ్కోలు తెలిపారు.