Surrogacy Racket in Hyderabad: అమ్మతనం ఓ వరం… కానీ కొందరి పాలిట అది కాసుల వర్షం కురిపించే వ్యాపారం! పిల్లలు లేని దంపతుల ఆశను ఆసరాగా చేసుకుని, పేద మహిళల గర్భాన్ని అద్దెకు తీసుకుంటూ హైదరాబాద్ మహానగరంలో గుట్టుచప్పుడు కాకుండా సాగుతున్న భారీ దందా బట్టబయలైంది. ఇటీవల ‘సృష్టి’ ఫెర్టిలిటీ సెంటర్ నిర్వాకం మరవక ముందే, అదే తరహాలో సాగుతున్న ఈ అక్రమ సరోగసీ ముఠా వెనుక ఉన్న సూత్రధారులు ఎవరు..? పేద మహిళలను ఎలా వలలో వేసుకుంటున్నారు..? ఈ చీకటి వ్యాపారంలో ప్రముఖ ఆసుపత్రుల పాత్ర ఎంత..?
సంతానం లేని దంపతుల బలహీనతను లక్ష్యంగా చేసుకుని, అక్రమ సరోగసీ, అండాల సేకరణకు పాల్పడుతున్న ఓ అంతర్రాష్ట్ర ముఠా గుట్టును మేడ్చల్ ఎస్‌వోటీ, పేట్-బషీరాబాద్ పోలీసులు సంయుక్తంగా రట్టు చేశారు. పేద మహిళలకు డబ్బు ఆశ చూపి వారిని అద్దె గర్భానికి ఒప్పించడం, వారి నుంచి అక్రమంగా అండాలను సేకరించి ఫెర్టిలిటీ సెంటర్లకు విక్రయించడం వంటి దారుణాలకు పాల్పడుతున్న ఈ ముఠాలోని 8 మందిపై కేసు నమోదు చేశారు. ప్రధాన నిందితురాలైన నర్రెద్దుల లక్ష్మీరెడ్డి, ఆమె కుమారుడు నరేందర్‌రెడ్డిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.
దందా తీరు ఇది : ఆంధ్రప్రదేశ్‌లోని చిలకలూరిపేటకు చెందిన లక్ష్మీరెడ్డి, నగరంలోని చింతల్ పద్మనగర్‌లో నివాసముంటూ ఈ దందాకు తెరలేపింది. గతంలో తానూ అండదానం చేసి, సరోగేట్ తల్లిగా వ్యవహరించిన అనుభవంతో, ఈ మార్గంలో డబ్బు సంపాదించడం సులువని గ్రహించింది. నగరంలోని పలు కార్పొరేట్ ఆసుపత్రులతో పరిచయాలు పెంచుకుని, మధ్యవర్తుల ద్వారా నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేసుకుంది.
ALSO READ: https://teluguprabha.net/telangana-news/matrimonial-frauds-hyderabad-cyber-crime/
టార్గెట్: ఐవీఎఫ్ విఫలమై, సరోగసీ ద్వారా సంతానం పొందాలనుకునే సంపన్న దంపతులను మధ్యవర్తులు లక్ష్మీరెడ్డి వద్దకు చేరవేస్తారు.
బేరసారాలు: దంపతుల ఆర్థిక స్తోమతను బట్టి రూ.10 లక్షల నుంచి రూ.30 లక్షల వరకు ఒప్పందం కుదుర్చుకుంటుంది.
పేదలే పెట్టుబడి: మరోవైపు, తీవ్రమైన పేదరికంలో మగ్గుతున్న మహిళలను గుర్తించి, వారికి రూ.3 నుంచి 5 లక్షల వరకు ఇస్తామని ఆశ చూపి అద్దె గర్భానికి ఒప్పిస్తుంది.
నివాసంలోనే నిర్బంధం: ఒప్పందం కుదిరిన మహిళలను పద్మనగర్‌లోని తన నివాసంలోనే ఉంచి, 9 నెలల పాటు బాగోగులు చూసుకుంటూ, వారికి అవసరమైన చికిత్సను అందిస్తున్నట్లు నమ్మబలుకుతుంది.
అప్పగింత: శిశువు జన్మించిన తర్వాత, ఒప్పందం చేసుకున్న దంపతుల నుంచి పూర్తి మొత్తం వసూలు చేసి, బిడ్డను వారికి అప్పగిస్తుంది. ఇదే అదునుగా, సరోగేట్ తల్లుల నుంచి అక్రమంగా అండాలను సేకరించి, వాటిని ఫెర్టిలిటీ కేంద్రాలకు అమ్మి అదనపు ఆదాయం గడిస్తుంది.
ALSO READ: https://teluguprabha.net/telangana-news/mgnregs-agriculture-sheds-scheme-additional-income/
పోలీసుల ఎంట్రీతో బట్టబయలు : ఈ వ్యవహారంపై అందిన విశ్వసనీయ సమాచారంతో పోలీసులు లక్ష్మీరెడ్డి నివాసంపై దాడి చేశారు. ఆ సమయంలో అక్కడ ఉన్న ముగ్గురు సరోగేట్ గర్భిణులు, ముగ్గురు అండదాతలతో పాటు, ప్రధాన నిందితులు లక్ష్మీరెడ్డి, ఆమె కుమారుడు నరేందర్‌రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. ఇంజినీరింగ్ పూర్తి చేసిన నరేందర్‌రెడ్డి, ఈ అక్రమ దందాలో తల్లికి కుడిభుజంగా వ్యవహరించినట్లు పోలీసులు గుర్తించారు. నిందితురాలికి గతంలో ముంబయిలో కూడా ఇదే తరహా కేసులో నేరచరిత్ర ఉందని, ఆ కేసు ఇంకా విచారణలో ఉందని పోలీసులు తెలిపారు.
ప్రముఖ ఆసుపత్రుల పాత్రపై ఆరా : సోదాల సమయంలో నిందితురాలి నివాసం నుంచి రూ.6.47 లక్షల నగదు, ప్రామిసరీ నోట్లు, హార్మోన్ ఇంజక్షన్లు, గర్భధారణ మాత్రలు, పలు ఫోన్లు, మరియు మాదాపూర్‌లోని హెగ్డే ఆసుపత్రికి సంబంధించిన కేస్ షీట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. హెగ్డేతో పాటు సోమాజిగూడలోని అను టెస్ట్ ట్యూబ్ సెంటర్, బంజారాహిల్స్‌లోని ఫెర్టికేర్, కొండాపూర్‌లోని శ్రీఫెర్టిలిటీ సెంటర్, ఈవా ఐవీఎఫ్, అమూల్య ఐవీఎఫ్ సెంటర్లతో నిందితురాలు లావాదేవీలు జరిపినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ కేసులో ఆయా ఆసుపత్రుల పాత్రపై లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.
వీడని చిక్కుముడులు : ప్రస్తుతం రిమాండ్‌లో ఉన్న నిందితులను కస్టడీలోకి తీసుకుని విచారిస్తే మరిన్ని సంచలన విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. అసలు ఒప్పందం చేసుకున్న దంపతుల అండాలు, వీర్యకణాలనే సరోగసీకి ఉపయోగించారా..? లేక ఇతరులవి ఉపయోగించి మోసం చేశారా..? ఇప్పటివరకు ఎంతమంది దంపతులను మోసం చేశారు? సరోగసీ ముసుగులో అక్రమ శిశు విక్రయాలు కూడా జరిగాయా..? అనే కోణాల్లో పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది.


