బాన్సువాడ నియోజకవర్గ భారత రాష్ట్ర సమితి (BRS) పార్టీ అభ్యర్థిగా ఈరోజు నామినేషన్ దాఖలు చేశారు శ్రీ పోచారం శ్రీనివాస రెడ్డి. ఈసందర్భంగా పార్టీ శ్రేణులు, అభిమానుల కోలాహలంతో బాన్సువాడ పట్టణంలో నెలకొన్న పండుగ వాతావరణం. ఉదయం ఇలవేల్పు, ఇష్టదైవం తిమ్మాపూర్ శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకుని నామినేషన్ పత్రాలను స్వామి వారి పాదాల ఉంచి పూజలు చేశారు పోచారం.
తదుపరి బాన్సువాడ పట్టణంలోని సరస్వతి మాతా దేవాలయం మరియు అయ్యప్పస్వామి దేవాలయాలను దర్శించి పూజలు చేశారు పోచారం. అనంతరం నివాసం నుండి నియోజకవర్గ ప్రజలు,నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, కుటుంబ సభ్యులతో కలిసి బాన్సువాడ పట్టణంలోని ప్రధాన రహదారి గుండా ర్యాలీగా బాన్సువాడ RDO కార్యాలయానికి వెళ్ళి రిటర్నింగ్ ఆఫీసర్ కు రెండు సెట్ల నామినేషన్ పత్రాలను అందజేశారు. నామినేషన్ దాఖలు అనంతరం పోచారం శ్రీనివాసరెడ్డి మీడియాతో మాట్లాడుతూ.
నామినేషన్ దాఖలకు విచ్చేసిన శ్రేయోభిలాషులకు హృదయపూర్వక ధన్యవాదాలు. తెలంగాణ రాష్ట్రంలో నవంబర్ 30న జరిగే ఓటింగ్ కు సంబంధించి నామినేషన్ల ఘట్టం నిన్నటి నుంచి మొదలైంది. ఈరోజు బాన్సువాడ నియోజకవర్గం నుండి BRS పార్టీ తరుపున అభ్యర్ధిగా నామినేషన్ దాఖలు చేశాను. నామినేషన్ తో పాటుగా అఫిడవిట్, బిఫాం కూడా ఇచ్చాను. ఈరోజు నుండే ఎన్నికల ప్రచారం ప్రారంభిస్తున్నా అన్నారు.
ప్రజాస్వామ్యంలో అయిదు సంవత్సరాలకు ఒకసారి ఎన్నికలు జరుగుతాయి. ఇది రాచరిక వ్యవస్థ కాదు. శాసనసభ్యుడు పదవి పవిత్రమైనది. పదవిలో ఉన్నవారు హుందాగా ఉండాలి. ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రజా ప్రతినిధి ప్రజల కోసం పనిచేయాలి. ప్రజలు నచ్చి, మెచ్చే విదంగా ఉండాలి, ప్రజా సమస్యలపై పనిచేయాలి. శాసనసభ్యుడు రాజ్యాంగం పరిధిలో పనిచేయాలి.
రాష్ట్రంలో, నియోజకవర్గంలో సుభిక్షంగా ఉండాలనే ఉద్యేశంతో పనిచేయాలి. అర్హులైన పేదలకు సంక్షేమ పథకాలు అందించాలి. శాసనసభ్యుడికి బాధ్యతలు ఉంటాయి. వాటిని స్వీకరించగలిగితేనే పోటీ చేయాలి. సుదీర్ఘ రాజకీయ జీవితంలో నేను అదే స్పూర్తితో పనిచేస్తున్నాను. నేను శాసనసభ్యుడిగా పోటీ చేయడం ఇది ఎనిమిదో సారి, 7సార్లు గెలిచాను. 1994 నుండి బాన్సువాడ శాసనసభ్యునిగా పోటీ చేస్తున్నా. యువకులు, ప్రజల సహకారంతో ఈసారి కూడా ఘనవిజయం సాదించి, బాన్సువాడ నియోజకవర్గంలో మరోసారి ప్రజల సేవకు పునరంకితం అవుతాను.
గత పదేళ్లుగా తెలంగాణ రాష్ట్రం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు దేశంలో ఆదర్శంగా ఉన్నాయి. ప్రతి ఇంటికి ఎదో పథకం అందుతుంది. BRS పార్టీ మేనిఫెస్టో అద్భుతంగా ఉన్నది, అమలు చేయగలిగింది. కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ వారు ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను అమలు చేయలేక చేతులు ఎత్తివేశారు. BRS పార్టీకి ఎదురు లేదు. కేసీఆర్ గారు హ్యాట్రిక్ ముఖ్యమంత్రి. ప్రతిపక్షాలకు అభ్యర్థులు దొరకడం లేదు. బాన్సువాడ నియోజకవర్గంలో అభివృద్ధి ఎవరితో జరుగుతుందో ప్రజలకు పూర్తి అవగాహన ఉన్నది. ఎవరిని గెలిపించాలో ప్రజలకు తెలుసు.