సమ్మక్క నామస్మరణతో హుజురాబాద్ నియోజకవర్గ పరిధిలోని సమ్మక్క సారలమ్మ జాతర ప్రాంతాలన్నీ మారుమోగాయి. జాతరకు వెళ్లే దారుల అన్ని జనాలతో నిండిపోయాయి. జాతరలో అతిముఖ్యమైన ఘట్టం గురువారం సాయంత్రం ఆవిష్కృతమైంది. వేలాది మంది భక్తుల పారవశ్యం, డప్పు చప్పుల మధ్యలో యువకుల నృత్యాలు, కోయదొరలు, శివసత్తుల పూనకాలు, పోలీస్ బందోబస్తు మధ్య సమ్మక్కను కోయ పూజారులు వన దేవత సమ్మక్కను గద్దెలపైకి చేర్చారు. దీంతో సమ్మక్క సారలమ్మ తల్లులను దర్శించుకునేందుకు జనాలు బారులు తీరారు.
శుక్రవారం ఉదయం నుండి సాయంత్రం వరకు సమ్మక్క సారలమ్మ తల్లులను గద్దెలపై దర్శించుకునేందుకు గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలు జాతర జరిగే ప్రాంతాలకు రానుండడంతో జాతర జరిగే ప్రదేశాలన్నీ జన సందోహంగా మారనున్నాయి. జాతరకు వచ్చే భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఆయా జాతర కమిటీ సభ్యులు తగు ఏర్పాట్లను చేపట్టారు.