ఏజెన్సీ ప్రాంతాల్లో విచ్చలవిడిగా నిబంధనలు ఉల్లంఘించి నిర్మాణాలు చేపడుతున్న అధికారులు మాత్రం ప్రేక్షక పాత్ర వహిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వెంకటాపురం పరిధిలో అక్రమ నిర్మాణాలు వెలుస్తున్న, నిర్మాణాల ప్రణాళిక విభాగం అధికారులుచూసి చూడనట్టుగా వ్యవహరిస్తున్నారు. నిబంధనలకు విరుద్ధం గా ఏర్పాటు చేస్తున్న నిర్మాణాల వైపు కన్నెత్తి కూడా చూడకపోవడంతో ప్రజా సంఘాలు, ఆదివాసీ సంఘాలు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
వెంకటాపురం మండలంలో ప్రధాన రహదారికి ఇరువైపులా చేపడుతున్న నిర్మాణాలపై అధికారులు తలెత్తి చూడకపోవటంతో పలు అనుమానాలకు తావిస్తోంది. తీసుకున్న అనుమతులకు చేపడుతున్న నిర్మాణాలకు ఎలాంటి పొంతన లేకుండా నిర్మాణాలు చేపడుతున్నారు. అసలు పంచాయితీ రాజ్ అధికారులు ఎంచేస్తున్నారు? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.ఆదనపు అంతస్తులు విచ్చలవిడిగా కొనసాగుతున్నా అధికారులు ఏలాంటి చర్యలు తీసుకోకపోవటం లేదని పలువురు విమర్శిస్తున్నారు.
రెవిన్యూ పంచాయతీరాజ్ అధికారుల చేతి వాటంతో పాటు స్థానిక ప్రజాప్రతినిధుల హస్తం ఉందనే ఆరోపణలు లేకపోలేదు. వెంకటాపురం మండలం లో విచ్చలవిడిగా నిర్మాణాలు కొనసాగుతున్నా అధికారులు పట్టించుకున్న దాఖలాలు లేవని స్థానికులు ఆరోపిస్తున్నారు. నిర్మాణదారులిచ్చే మాములకి అలవాటు పడి పరోక్షంగా అక్రమ నిర్మాణాలను ప్రోత్సహిస్తున్నారని పలువురు బహిరంగంగానే చర్చించుకుంటున్నారు. ఇప్పటికైనా అధికారులు ఉన్నతాధికారులు స్పందించి, మండల పరిధిలో చేపడుతున్న అక్రమ కట్టడాలపై తగిన చర్యలు తీసుకోవాలని స్థానిక ప్రజలు ఆదివాసీ సంఘాలు కోరుతున్నారు.
కనుమరుగవుతున్న 1/70 చట్టం
అధికార పార్టీ అండదండలతో ఏదైనా చేయొచ్చు అనే ధీమాతో వలస గిరిజనేతరులు వ్యవహారశైలి. 5వ షెడ్యూల్ భూభాగంలో ప్రత్యేకంగా ఆదివాసుల కొరకు కొన్ని చట్టాలను రాజ్యాంగంలో పొందుపరిచారు. అలాంటి చట్టాలను సైతం తుంగలో తొక్కి గిరిజనేతరుల బహుళ అంతస్తుల నిర్మాణం అడ్డూ అదుపు లేకుండా నిర్మిస్తున్నా పట్టించుకునే నాథుడు కరువయ్యాడు.అధికారులు 1/70 చట్టాన్ని నిర్వీర్యం చేస్తూ అక్రమంగా బహుళ అంతస్తుల నిర్మాణం కొనసాగిస్తున్నా సంబంధిత శాఖ అధికారులు తలెత్తి చూడని వైనం.
మండలంలో ఎక్కడ ప్రభుత్వ భూమి కనబడ్డా అక్కడ తిష్ట వేస్తూ అధికారులకి కాసుల వర్షం కురిపించి అక్రమ కట్టడాలు కొనసాగిస్తున్నారని ప్రజా సంఘాల పలు ఆరోపణలు. 1/70 చట్టం ప్రకారం బహుళ అంతస్తుల నిర్మాణం చేపట్టరాదని కోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ ఏజెన్సీ చట్టాలను వాళ్లకు అనువుగా మలుచుకొని అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారని ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి.
ఏజెన్సీ చట్టాలను కాపాడాల్సిన అధికారులు ముడుపుల మత్తులో పడి చూసీ చూడనట్లుగా వ్యవహరించడంతో 1/70 చట్టం కనుమరుగై పెను ప్రమాద ఉంది, ఇదీ ఆదివాసీ సమాజనికి తీరని లోటని చెప్పుకోవాలి.
అధికార పార్టీ నాయకులు హవా…
అధికార పార్టీ నేతలు కావడం అధికారుల అండదండలు తోడవడంతో వారి ఆగడాలకు అడ్డూ అదుపు లేకుండా పోతుంది. వెంకటాపురం మండలంలో అడ్డాగా అక్రమ కట్టడాలు కొనసాగుతున్నాయని గిరిజన సంఘాల నాయకులు అధికారుల దృష్టికి పలుమార్లు పిర్యాదులు తీసుకు వచ్చినా పట్టించుకునే పరిస్థితి లేకపోయింది.
దీంతో ఏజెన్సీ మండలాల్లో గిరిజనేతర బడా బాబుల హవా కొనసాగుతుంది. దీంతో అక్రమంగా బహుళ అంతస్తుల నిర్మాణం హవా కొనసాగుతుంది. పంచాయతీ అధికారుల నుండి ఎలాంటి అనుమతులు లేకపోయినా అక్రమంగా బహుళ అంతస్తుల నిర్మాణం కొనసాగిస్తున్నారు. ఈ కట్టడాలపై ఎన్టీఆర్ కేసులు నమోదు చెయ్యవలసిన సంబంధిత శాఖ అధికారులు కానరాకపోవడంతో ఏజెన్సీ చట్టాలు గిరిజనేతర రాజకీయ బడాబాబుల కబంధ హస్తాల్లోకి చేరుతుంది. ఇకనైనా ఉన్నతాధికారులు స్పందించి అక్రమ కట్టడాలకు అడ్డుకట్ట వేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.