Telangana Heavy Rains: తెలంగాణ రాష్ట్రంలోని పలు ప్రాంతాలను భారీ వర్షాలు అతలాకుతలం చేశాయి. ముఖ్యంగా ఉమ్మడి వరంగల్, నల్గొండ జిల్లాల్లో పరిస్థితి మరింత దారుణంగా మారింది. లోతట్టు ప్రాంతాల్లో నీరు చేరడంతో జనజీవనానికి తీవ్ర ఆటంకం కలిగింది. వరంగల్ జిల్లాలోని సంగెం మండలంలో అత్యధికంగా 21.8 సెం.మీ వర్షపాతం నమోదు కాగా, మరో 12 ప్రాంతాల్లో 10.7 సెం.మీకి పైగా వర్షం పడింది. మూడున్నర గంటలపాటు కురిసిన భారీ వర్షం వల్ల వరంగల్, హనుమకొండలో సుమారు 40 కాలనీలు నీట మునిగాయి. వేర్వేరు ఘటనల్లో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు.
ఉమ్మడి నల్గొండ జిల్లాలోని 73 మండలాల్లో వర్షాలు కురవగా, సూర్యాపేట జిల్లాలోని నాగారంలో 19 సెం.మీ వర్షం పడింది. వాగులు, నదులు పొంగిపొర్లడంతో కొన్ని రహదారుల్లో రాకపోకలు నిలిచిపోయాయి. వాతావరణ శాఖ రానున్న మూడురోజులపాటు భారీ వర్షాలు కురిసే అవకాశముందని ‘రెడ్ అలర్ట్’ ప్రకటించింది. పశ్చిమ- మధ్య, వాయవ్య బంగాళాఖాతంలో బుధవారం ఏర్పడనున్న అల్పపీడనం శుక్రవారం నాటికి బలపడే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ ప్రభావంతో బుధవారం యాదాద్రి భువనగిరి, జనగామ, హనుమకొండ, వరంగల్, మహబూబాబాద్ జిల్లాలకు, గురువారం వికారాబాద్, సంగారెడ్డి, మెదక్ జిల్లాలకు ‘రెడ్ అలర్ట్’ ప్రకటించారు. ఈ జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో 20 సెం.మీ.కి పైగా వర్షం పడవచ్చని అంచనా.
అంతేగాక, రాష్ట్రంలోని మరికొన్ని జిల్లాల్లో ‘ఆరెంజ్’ అలర్ట్ హెచ్చరికలు, ఇంకొన్ని ప్రాంతాల్లో ‘ఎల్లో’ అలర్ట్ హెచ్చరికలు జారీ చేశారు. జీహెచ్‌ఎంసీ పరిధిలోనూ అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాల్లో అప్రమత్తంగా ఉండాలని సూచనలు ఇచ్చింది. భారీ వర్షాలకు తోడు ఉరుములు, మెరుపులతో కూడిన ఈదురుగాలులు (గంటకు 30 నుంచి 40 కి.మీ వేగంతో) వీస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.
వరదలతో నష్టం
వరంగల్ జిల్లాలోని పలు ప్రాంతాల్లో వరదనీరు ఇళ్లలోకి ప్రవేశించింది. వాంబే కాలనీలో ఓ ఇంట్లోకి వరదనీరు చొచ్చుకురావడంతో వృద్ధురాలు బుచ్చమ్మ వరద నీటిలో ఊపిరాడక మృతి చెందింది. సంగారెడ్డి జిల్లా యూసుఫ్‌పూర్‌లో ఓ వ్యక్తి నీటి ప్రవాహంలో కొట్టుకుపోయాడు. పలు గ్రామాల్లో చెరువులు, వాగులు పొంగిపొర్లగా, ప్రజారవాణా పూర్తిగా నిలిచిపోయింది. ఇక హైదరాబాద్‌లో ఈసీ నది ఉరకలెత్తింది. హిమాయత్‌సాగర్ జలాశయంలో ఒకేసారి 5 క్రస్టుగేట్‌లను 3 అడుగుల మేర ఎత్తి.. 4,800 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేయడంతో ఉప్పొంగి ప్రవహించింది. దీంతో దర్గాఖలీజ్‌ఖాన్ సమీపంలోని ఔటర్‌రింగు రోడ్డుకు చెందిన సర్వీసుమార్గంలో వాహనాల రాకపోకలు స్తంభిచాయి.
Also Read: https://teluguprabha.net/telangana-news/today-rains-in-telangana-hyderabad-meteorological-department-officials-given-alert/
విద్యాసంస్థలకు సెలవులు, ఐటీ ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోం (Telangana Schools Holidays)
హనుమకొండ, జనగామ, మహబూబాబాద్, వరంగల్, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో.. బుధవారం, గురువారం అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు సెలవులు ప్రకటించారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో మాత్రం ఒంటి పూట బడులు నడిపించాలని అధికారులు ఆదేశించారు. నగరంలో ట్రాఫిక్ ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ఐటీ శాఖ బుధవారం ఉద్యోగులు ఇంటి నుంచే పని చేయాలని సూచించింది.
హైదరాబాద్ వాసులకు పోలీసుల సూచనలు
15వ తేదీ వరకు వర్ష సూచనలు ఉన్నాయి. సాయంత్రం వేళల్లో భారీ వర్షం కురిసే అవకాశం. అత్యవసరం ఉంటేనే బయటకురావాలి. వెదర్ అప్డేట్స్ ఫాలో అవుతూ పనులు షెడ్యూల్ చేసుకోండి. వాహనాల కండీషన్ పరిశీలించుకోండి. నీరు నిలిచి ఉండే ప్రాంతాల్లో జాగ్రత్తగా ఉండండి. వర్షంలో చెట్ల కింద, కరెంట్ పోల్స్ దగ్గర నిలబడొద్దు. జాగ్రత్తలు పాటించండి.. క్షేమంగా గమ్యం చేరండి అని హైదరాబాద్ పోలీసులు సూచిస్తున్నారు.


