గ్రామీణ ప్రాంతాలలోని స్థానిక సంస్థలైన సర్పంచ్, ఎంపీటీసీ ఎన్నికలతో పాటు కోఆపరేటివ్ అధికారుల పరిధిలో నిర్వహించే సహకార సంఘం ఎన్నికలు కూడా ఐదు సంవత్సరాలకు ఒకసారి నిర్వహించాలి అనే నిబంధనలు ఉన్నాయి. తలకొండపల్లి మండలంలోని సహకార సంఘం సభ్యత్వ నమోదులను గత వారం రోజుల క్రితం నుండి సభ్యత్వ దరఖాస్తు పారాలను స్వీకరిస్తున్నారు. స్థానిక పిఎసిఎస్ కార్యాలయంలో ఓటు హక్కు దరఖాస్తుల స్వీకరణ కోసం గత వారం క్రితం ఎనిమిది మంది సభ్యులతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసుకొని తీర్మానం ప్రవేశపెట్టారు. ఉమ్మడి తలకొండపల్లి మండలంలోని 39 పంచాయితీలు 29 రెవెన్యూ గ్రామాలలోని రైతుల నుండి నూతనంగా ఓటు హక్కు వినియోగించుకోవాలి అనుకునే వారి కోసం సహకార సంఘం సభ్యత్వ పారాలను ప్రతి రైతు 600 రూపాయలు చెల్లించి స్వీకరించాలని తీర్మానం చేసినట్లు తెలిసింది.గత ఐదు సంవత్సరాల క్రితం 330 రూపాయల సభ్యత్వ రుసుమును ఈసారి ఏకంగా 600 లకు పెంచడంతో పేద రైతులు ఆవేదనకు గురవుతున్నారు. కానీ మండలంలోని ఏ గ్రామంలో కూడా సర్పంచులకు, ఎంపీటీసీలకు, ప్రజాప్రతినిధులకు కనీసం సమాచారం లేదని ఆయా గ్రామాల ప్రజాప్రతినిధులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రైతుల కోసం ప్రత్యేకంగా నిర్వహించే కో ఆపరేటివ్ సహకార సంఘం ఎన్నికలు రైతులను సంఘటితం చేయడానికి ఎంతగానో ఉపయోగపడతాయి. ఉమ్మడి తలకొండపల్లి మండలంలోని 39 జేపీలు, 29 రెవెన్యూ గ్రామాలలో ఎక్కడ కూడా రైతులకు కనీస అవగాహన కల్పించే విధంగా దండోరాలను, పోస్టర్లను కూడా వేయించిన దాఖలాలు లేవు అని పలు గ్రామాల ప్రజాప్రతినిధులు ఆరోపిస్తున్నారు. కనీసం అవగాహన కూడా కల్పించలేక చేతులెత్తేశారు అనే అపవాదు మూటగట్టుకున్నారు.అలాంటివి ఏమి చేయకుండా గత వారం రోజులుగా దరఖాస్తుల స్వీకరణ కొనసాగిస్తూ మామా అనిపిస్తున్నారు. ఇది ఎంతవరకు న్యాయమని, ప్రతిపక్ష పార్టీ సభ్యులైన కొంతమంది నాయకులు విస్మయాన్ని వ్యక్తం చేస్తున్నారు. రైతులను చైతన్యపరిచే విలువైన ఎన్నికలను రైతులకు కనీస సమాచారం కల్పించకపోవడం బాధాకరమని వాపోతున్నారు.
ఐదు సంవత్సరాల క్రితం నిర్వహించిన సహకార సంఘం ఎన్నికలలో ఉమ్మడి తలకొండపల్లి మండలంలోని 5400 మంది రైతులు మాత్రమే సభ్యత్వం పొంది ఉన్నట్లు స్థానిక పిఎసిఎస్ అధికారులు పేర్కొన్నారు. ప్రస్తుతం తలకొండపల్లి మండలంలోని 32 పంచాయతీలలో 20వేల 210 మంది రైతులు, కడ్తాల్ మండలంలోని రావిచేడ్, మక్తమాదారం, సాలార్పూర్, న్యామతాపూర్, రేఖ్య తండా, చెల్లంపల్లి, రేకులకుంట తండాలలో 5400 మంది వరకు రైతులు ఉన్నట్లు మండల స్థాయి అధికారులు పేర్కొంటున్నారు.ఉమ్మడి తలకొండపల్లి మండలంలోని 25 వేల మంది పైచిలుకు రైతులకు గాను, కేవలం 100 కు 20 శాతం మంది రైతులు కూడా తమ ఓటు హక్కును పొందలేకపోవడం దేనికి కారణం. ఈనెల 29 వ తేదీతో సహకార సంఘం సభ్యత్వ సమయం ముగుస్తుందని అధికారులు పేర్కొన్నారు. ఇప్పటికైనా జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి వెంటనే సభ్యత్వం గడువు పెంచి ప్రతి గ్రామంలో దండోరాలు వేయించి రైతు సోదరులకు అవగాహన కల్పించాలని ఆయా గ్రామాల ప్రజాప్రతినిధులు రైతులు కోరుతున్నారు. సభ్యత్వం పొందే విధానం ప్రతి రైతు స్థానిక రైతు అయి ఉండాలి, కొత్త ఆర్ఓఆర్, కొత్త పాస్ బుక్, ఆధార్ కార్డ్ జిరాక్స్, రెండు ఫోటోలు తప్పనిసరి తీసుకొని తలకొండపల్లి మండల సహకార సంఘం కార్యాలయాన్ని వద్ద దరఖాస్తు ఫారం నింపి 600 రూపాయలు రుసుము చెల్లించి పేరు నమోదు చేయించుకోవాలని అధికారులు పేర్కొంటున్నారు.