Hyderabad weather report: హైదరాబాదులోని పలుప్రాంతాల్లో తేలికపాటి వర్షం కురుస్తోంది. వనస్థలిపురం, ఎల్బీనగర్, దిల్‍సుఖ్‍నగర్,అమీర్‌పేట్, పంజాగుట్ట, ఫిల్మ్‌నగర్, ఖైరతాబాద్, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, మాదాపూర్, పంజాగుట్ట ప్రాంతాల్లో ప్రస్తుతం వర్షం పడుతోంది. అల్పపీడనం ప్రభావంతో నగర వ్యాప్తంగా మరో రెండు రోజులు మోస్తరు నుంచి భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. రహదారులపై నీరు నిలవడంతో వాహనదారులు రాకపోకలకు ఇబ్బందులు పడ్డారు. ఇప్పటికే నగరం మొత్తం మేఘాలు కమ్ముకున్నాయి. దీంతో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అధికారులు హెచ్చరించారు.
10 జిల్లాల్లో భారీ వర్షాలు: హైదరాబాద్ సహా తెలంగాణ వ్యాప్తంగా పలు చోట్ల వర్షం కురుస్తుంది. రాష్ట్రంలోని 10 జిల్లాల్లో భారీ వర్షాలు పడే ఛాన్స్ ఉందని హెచ్చరించింది. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, మహబూబాబాద్, ఖమ్మం, సూర్యాపేటలోని పలు ప్రాంతాల్లో భారీ వానలు పడతాయని అంచనా వేసింది. మిగతా జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని పేర్కొంది. ములుగు జిల్లా ఏటూరు నాగారంలో అత్యధికంగా 11 సెం.మీ వర్షపాతం నమోదైందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఖమ్మం జిల్లాలోని లింగాలలో 10సెం.మీ, సంగరెడ్డి జిల్లలోని మొగడంపల్లిలో 9.8 సెం.మీ, ములుగు జిల్లాలోని మేడారంలో 8.43 సెం.మీ, కాసిందేవిపేటలో 8.78 సెం.మీ వర్షపాతం నమోదైంది.
కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం: బిహార్ నుండి తమిళనాడు వరకు ఉపరితల ఆవర్తనం ఆవరించి ఉండడంతో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఝార్ఖండ్, ఛత్తీస్‌గఢ్ మీదుగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని వాతావరణ శాఖ పేర్కొంది. తెలుగు రాష్ట్రాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసినట్లు అధికారులు తెలిపారు. తెలంగాణలోని చాలా ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. కోస్తాంధ్రలో ఒకట్రెండు చోట్ల భారీ వర్ష సూచన ఉందని తెలిపారు.
Also Read: https://teluguprabha.net/telangana-news/cyclone-shakti-in-the-arabian-sea/
తీసుకోవాల్సిన జాగ్రత్తలు: వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని స్థానిక అధికారులు సూచించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని, పాత, శిథిలావస్థకు చేరిన భవనాల కింద ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరించారు. విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడే అవకాశాలు ఉన్నందున.. ప్రజలు ముందస్తుగా సిద్ధంగా ఉండాలని తెలిపారు.
అధికార యంత్రాంగం అప్రమత్తం: వర్షాలు పడిన ప్రతిసారి రేవంత్ ప్రభుత్వం అధికారులను అప్రమత్తం చేస్తూనేఉంది. ప్రస్తుతం కూడా కలెక్టర్లను మరియు విపత్తు నిర్వహణ బృందాలను అప్రమత్తం చేసింది. సహాయక చర్యల కోసం బృందాలను సిద్ధం చేయాలని ఆదేశాలు జారీ చేసింది. అవసరమైతే సహాయ శిబిరాలను ఏర్పాటు చేయడానికి తగిన ఏర్పాట్లు చేయాలని సూచించారు.


