Heavy rains Forecast for telugu states: వాయవ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. దీనికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం కూడా కొనసాగుతోందని భారత వాతావరణ విభాగం తెలిపింది. గురువారం నాటికి ఉత్తర బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడనుందని పేర్కొంది. అది వాయుగుండంగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. వీటి ప్రభావంతో రాగల మూడు రోజులు పలుచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు. కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కూడా పడోచ్చని వాతావరణ శాఖ తెలిపింది.
బంగాళాఖాతంలో మరో అల్పపీడనం: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా ఏపీతో పాటుగా తెలంగాణ రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. రైతులకు, ప్రజలకు వర్ష సూచనతో పాటుగా వాతావరణ బులెటిన్ జారీ చేసింది. తాజాగా మరో అల్పపీడనం గురువారం రోజు తూర్పు మధ్య, దానిని ఆనుకుని ఉన్న ఉత్తర బంగాళాఖాతం ప్రాంతంలో ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. ఈ అల్పపీడనం మరింత బలపడి 26వ తేదీ నాటికి వాయుగుండంగా మారే అవకాశం ఉందని తెలిపింది. ఈ వాయుగుండం పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ 27న దక్షిణ ఒడిశా, ఉత్తర ఏపీ తీరాలను దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
ఏపీ అతి భారీ వర్షాలు: అల్పపీడనం కారణంగా ఏపీలో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. ముఖ్యంగా శుక్ర, శనివారాల్లో కోస్తా జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని, రాయలసీమలో అక్కడక్కడ భారీ వర్షాలు పడతాయని అమరావతి వాతావరణ కేంద్రంతో పాటుగా రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ సైతం హెచ్చరించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వర్షాల వల్ల తలెత్తే ఇబ్బందులను ఎదుర్కోవడానికి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు పేర్కొన్నారు.
తెలంగాణలో మోస్తరు వర్షాలు: రాష్ట్రంలోని కుమరం భీం అసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నారాయణపేట జిల్లాలలో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. ఉరుములు, మెరుపులు ఈదురు గాలులతో గంటకు 30 నుంచి 40 కి.మీ వేగంతో వర్షాలు కురుస్తాయని వాతావరణ అధికారులు తెలిపారు. అలాగే రాష్ట్రంలోని పలు జిల్లాల్లో సోమవారం సాయంత్రం భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిశాయి. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. రహదారులపై నీరు భారీగా నిలవడంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. ఈ వర్షాలు మరో కొన్ని రోజులు కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.


