Heavy Rains Expected in Telugu states: వాయవ్య బంగాళాఖాతంలో ఉత్తర ఒడిశా తీరంలో ఏర్పడిన అల్పపీడనం ఇంకా కొనసాగుతోంది. ఇది గురువారం ఉదయానికి బలహీనపడనుంది. అయితే మరోవైపు తూర్పుమధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. ఇది పశ్చిమ దిశగా కదులుతూ.. శుక్రవారం ఉదయం నాటికి వాయుగుండంగా బలపడే అవకాశముందని భారత వాతావరణ విభాగం తెలిపింది. దీంతో రాబోయే అయిదు రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని పేర్కొంది. శనివారం వరకు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. సముద్రం అలజడిగా మారిన నేపథ్యంలో ఆదివారం వరకు మత్స్యకారులు వేటకు వెళ్లరాదని అమరావతి వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది.
తెలంగాణలో మోస్తరు వర్షాలు: రాష్ట్రంలోని కుమరం భీం అసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నారాయణపేట జిల్లాలలో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. ఉరుములు, మెరుపులు ఈదురు గాలులతో గంటకు 30 నుంచి 40 కి.మీ వేగంతో వర్షాలు కురుస్తాయని వాతావరణ అధికారులు తెలిపారు. అలాగే రాష్ట్రంలోని పలు జిల్లాల్లో బుధవారం భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిశాయి. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. రహదారులపై నీరు భారీగా నిలవడంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. ఈ వర్షాలు మరో కొన్ని రోజులు కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.
ఏపీ అతి భారీ వర్షాలు: ఇప్పటికే ఉపరితల ఆవర్తనం, అల్పపీడనం ప్రభావంతో రాష్ట్రంలో పలుచోట్ల భారీ వర్షాలు కురుస్తున్నాయి. గురువారం ఏపీలోని కోస్తా జిల్లాల్లో పలుచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. శుక్ర, శనివారాల్లో మాత్రం పలుచోట్ల భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖా పేర్కొంది. రాయలసీమలో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని అధికారులు తెలిపారు. తీరం వెంబడి గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని పేర్కొన్నారు. అయితే బుధవారం శ్రీకాకుళం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు, విజయనగరం తదితర జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి. అత్యధికంగా శ్రీకాకుళం జిల్లాలోని రణస్థలంలో 89.7 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.


