Ignorance of foreign laws : బతుకు పోరాటంలో బంగారు భవిష్యత్తు కోసం ఏడు సముద్రాలు దాటుతున్నారు తెలుగు బిడ్డలు. కానీ, ఎన్నో ఆశలతో అడుగుపెట్టిన పరాయి గడ్డపై, తెలియని చట్టాల ఉచ్చులో చిక్కుకుని వారి కలలు కరిగిపోతున్నాయి. మద్యం మత్తులో బస్సు నడిపి జీవితాన్నే కోల్పోయిన ఓ డ్రైవర్.. కంపెనీ మారాడని దేశం నుంచే బహిష్కరణకు గురైన మరో యువకుడు.. తలలో పెట్టుకున్న మల్లెపూలకు జరిమానా కట్టిన ఓ నటి.. ఇవి కొన్ని ఉదాహరణలు మాత్రమే. అసలు ఈ విషాదాలకు కారణమేంటి? మనవాళ్లు తెలిసీ తెలియక చేస్తున్న ఆ పొరపాట్లేంటి..? విదేశీ గడ్డపై అడుగుపెట్టే ముందు తెలుసుకోవాల్సిన ఆ కీలక విషయాలేంటి..?
కళ్ల ముందు కదులుతున్న కథలు : సిద్దిపేట జిల్లాకు చెందిన అనేక మంది యువకుల జీవితాల్లో జరిగిన ఈ ఘటనలు, విదేశాలకు వెళ్లే ప్రతి ఒక్కరికీ ఓ గుణపాఠం.
కువైట్‌లో పాఠశాల బస్సు డ్రైవర్‌గా పనిచేస్తున్న ఓ యువకుడు, మద్యం మత్తులో వాహనం నడిపి ప్రమాదం చేయడంతో, జైలు శిక్షతో పాటు దేశం నుంచి శాశ్వత నిషేధానికి గురయ్యాడు.
దుబాయ్‌లో ఓ కంపెనీలో పని నచ్చక, మరో కంపెనీలో చేరిన బెజ్జంకి మండలానికి చెందిన యువకుడు, తిరిగి స్వదేశానికి వచ్చి వెళ్లగా.. ‘కంపెనీ మారావ’న్న కారణంతో ఎయిర్‌పోర్టు నుంచే వెనక్కి పంపించేశారు.
వీసా నిబంధనలపై అవగాహన లేక గడువు ముగిసినా అక్కడే ఉండిపోయిన మిరుదొడ్డి వాసి, జైలు పాలయ్యాడు. మలేసియాలో ఏడేళ్లుగా పనిచేస్తున్న మరో వ్యక్తి, స్థానికులతో గొడవపడి నెలల తరబడి జైల్లో మగ్గుతున్నాడు.
గల్ఫ్‌లో కఠిన చట్టాలు.. తెలియకపోతే చిక్కులే : ఉమ్మడి మెదక్, వికారాబాద్ జిల్లాల నుంచి సుమారు 5000 మందికి పైగా కార్మికులు కువైట్, సౌదీ అరేబియా, యూఏఈ, ఖతార్ వంటి గల్ఫ్ దేశాల్లో పనిచేస్తున్నారు. ఈ దేశాలు శాంతిభద్రతల విషయంలో అత్యంత కఠినంగా వ్యవహరిస్తాయి. చిన్నపాటి నేరాలకు కూడా కఠిన శిక్షలు, భారీ జరిమానాలు విధిస్తాయి. దళారులు డబ్బు మీద ఆశతో పంపిస్తారే తప్ప, అక్కడి చట్టాలపై పూర్తి అవగాహన కల్పించరు.
చిన్న తప్పు.. పెద్ద శిక్ష : ఒక్కో దేశంలో ఒక్కో నిబంధన ఉంటుంది. మనకు సాధారణమనిపించే విషయాలు అక్కడ తీవ్రమైన నేరాలుగా పరిగణిస్తారు.
నిషేధిత వస్తువులు: కొన్ని రకాల ఔషధాలు, మసాలా దినుసులు తీసుకురావడంపై నిషేధం ఉంటుంది.
రహదారి నియమాలు: అతివేగం, మద్యం సేవించి వాహనం నడపడం వంటివి తీవ్రమైన నేరాలు. కెమెరాల ద్వారా పక్కాగా పట్టుకుని కఠిన శిక్షలు వేస్తారు.
ప్రజా ప్రవర్తన: బహిరంగ ప్రదేశాల్లో మూత్ర విసర్జన, ఉమ్మి వేయడం, అసభ్యంగా ప్రవర్తించడం, చోరీలు చేయడం వంటి వాటికి భారీ జరిమానాలతో పాటు జైలు శిక్ష తప్పదు.
కార్మిక చట్టాలు: వీసాలో ఏ పని కోసం వచ్చారో, అదే పని చేయాలి. పని కష్టంగా ఉందని యజమానికి చెప్పకుండా వేరే కంపెనీకి మారితే, అది చట్టవిరుద్ధం.
నిపుణుల మాట.. ప్రవాసులకు బాట : విదేశాలకు వెళ్లే ముందు సరైన అవగాహన పెంచుకోవడమే శ్రీరామరక్ష అని అనుభవజ్ఞులు చెబుతున్నారు.
“గత 14 ఏళ్లుగా గల్ఫ్‌లో డ్రైవర్‌గా పనిచేస్తున్నా. ఇక్కడికి వచ్చేవారు చట్టాలపై అవగాహనతో రావడం మంచిది. ఏ పని మీద వస్తారో అదే చేయాలి, మారితే శిక్ష తప్పదు. గల్ఫ్ సంఘాలు ప్రతి వారం ‘ఓపెన్ హౌజ్’ పేరిట చట్టాలపై అవగాహన కల్పిస్తున్నాయి. వాటిని సద్వినియోగం చేసుకోవాలి. క్రమశిక్షణగా ఉంటే ఎలాంటి ఇబ్బందీ ఉండదు.”
– తిరుపతిగౌడ్, ప్రధాన కార్యదర్శి, కువైట్-తెలంగాణ గల్ఫ్ కార్మికుల సంక్షేమ సంఘం
డబ్బు సంపాదించాలనే ఆశతో, ఏజెంట్లు చెప్పే అరకొర మాటలు నమ్మి, తెలియని దేశంలో అడుగుపెట్టే ముందు.. అక్కడి చట్టాలను, నిబంధనలను పూర్తిగా తెలుసుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత. లేదంటే, కలల సౌధం కళ్ల ముందే కుప్పకూలి, కటకటాల పాలు కావాల్సి వస్తుంది.


