మహా శివరాత్రి పండుగ వేళ తెలంగాణ ప్రభుత్వం రైతులకు శుభవార్త అందించింది. రైతు కూలీలకు ‘ఇందిరమ్మ ఆత్మీయ భరోసా’(Indiramma Atmiya Bharosa) నిధులను విడుదల చేసింది. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లో లేని ఉమ్మడి రంగారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాల్లో ఉపాధి కూలీల ఖాతాల్లో నిధులు జమయ్యాయి.
జనవరి 26న ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ప్రారంభమైన సంగతి తెలిసిందే. ప్రతి మండలంలోని ఒక పైలెట్ గ్రామంలో గ్రామ సభలు నిర్వహించి కూలీల ఖాతాల్లో ప్రభుత్వం నిధులు జమ చేసింది. మొత్తం 18,180 మందికి రూ.6వేల చొప్పున జమయ్యాయి. అనంతరం ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో నిధులు నిలిచిపోయాయి. అయితే ఎన్నికల కోడ్ అమలులో లేని జిల్లాలకు నిధులు విడుదల చేయాలని మంత్రి సీతక్క సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy)ని విజ్ఞప్తి చేశారు. దీంతో ఉమ్మడి రంగారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాలకు నిధులు విడుదలయ్యాయి. ఈ రెండు జిల్లాల్లో 66,240 మంది ఉపాధి కూలీ లబ్ధిదారులకు కలిపి కూలీల ఖాతాల్లో రూ.39.74 కోట్లను జమ చేసింది.
ఈ పథకంలో భాగంగా ఇప్పటివరకు 83,420 మంది రూ.50.65 కోట్లు చెల్లించింది. ఎన్నికల కోడ్ ముగియగానే మిగిలిన లబ్ధిదారులందరికీ నిధులను ప్రభుత్వం చెల్లించనుంది. వ్యవసాయ కూలిపని మీదనే ఆధారపడి జీవనం సాగిస్తున్న భూమి లేని కుటుంబాలకు ఈ పథకం వర్తిస్తుంది. ఒక్కో వ్యవసాయ కూలీ కుటుంబానికి రెండు విడతలుగా రూ.6 వేలు చొప్పున ఏడాదికి రూ.12 వేల ఆర్ధిక సహాయం అందుతుంది.