Sunday, November 16, 2025
HomeతెలంగాణIndiramma Houses Opening: : ఇందిరమ్మ ఇంట పేదల గృహప్రవేశం.. భద్రాద్రిలో నెరవేరిన సొంతింటి కల!

Indiramma Houses Opening: : ఇందిరమ్మ ఇంట పేదల గృహప్రవేశం.. భద్రాద్రిలో నెరవేరిన సొంతింటి కల!

Indiramma housing scheme launch in Telangana : సొంతగూడు… ప్రతీ పేదవాడి చిరకాల స్వప్నం. ఆ స్వప్నాన్ని సాకారం చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘ఇందిరమ్మ ఇళ్ల’ పథకం, ఆచరణలోకి వచ్చింది.

- Advertisement -

ఎన్నికల్లో ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వేదికగా ఈ బృహత్తర కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శ్రీకారం చుట్టారు. దశాబ్దాల నిరీక్షణకు తెర దించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని చంద్రుగొండ మండలం లబ్ధిదారులతో కలిసి సామూహిక గృహప్రవేశాలు చేశారు. వారి ఆనందంలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి  పాలుపంచుకున్నారు. 

చారిత్రక ఘట్టానికి బెండాలపాడు వేదిక: రాష్ట్రంలోనే మొట్టమొదటి ఇందిరమ్మ ఇళ్ల ప్రారంభోత్సవానికి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని చంద్రుగొండ మండలం, బెండాలపాడు అనే మారుమూల గిరిజన గ్రామం వేదికగా నిలిచింది.

సీఎం పర్యటన: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మధ్యాహ్నం హెలికాప్టర్‌లో బెండాలపాడు చేరుకుని, జిల్లా మంత్రులతో కలిసి లబ్ధిదారులతో సామూహిక గృహప్రవేశ మహోత్సవంలో పాల్గొన్నారు.

మోడల్ గ్రామంగా ఎంపిక: “రాష్ట్రంలోనే తొలిసారిగా ఇందిరమ్మ ఇళ్లు ఇచ్చిన తర్వాత, ఈ గ్రామాన్ని ఒక మోడల్ గ్రామంగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో, రెవెన్యూశాఖ మంత్రి ఆదేశాల మేరకు బెండాలపాడును ఎంపిక చేశాం,” అని అశ్వారావుపేట ఎమ్మెల్యే జారె ఆదినారాయణ తెలిపారు.

లబ్ధిదారుల ఆనందోత్సాహాలు: బెండాలపాడు గ్రామంలో మొత్తం 310 మంది అర్హులకు ఇళ్లు మంజూరు కాగా, వీరిలో 238 మంది ఆదివాసీ కోయలే కావడం విశేషం. వారు గృహప్రవేశం చేసి ఆనందం వ్యక్తం చేశారు.

నిర్మాణ ప్రగతి: ప్రస్తుతం మూడు ఇళ్లు పూర్తి కాగా, వాటిలో ముఖ్యమంత్రి లబ్ధిదారులతో గృహప్రవేశం చేయించారు. మిగిలిన ఇళ్లు కూడా వివిధ దశల్లో నిర్మాణంలో ఉన్నాయి.

నెరవేరిన కల: “పదేళ్లుగా ఎదురుచూస్తున్న మా సొంతింటి కల, కాంగ్రెస్ ప్రభుత్వంతోనే నెరవేరుతోంది. చాలా సంతోషంగా ఉంది,” అని లబ్ధిదారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

భద్రాచలం నుంచే ప్రకటన, ప్రారంభం: ఇందిరమ్మ ఇళ్ల పథకానికి, భద్రాద్రి జిల్లాకు ఒక ప్రత్యేక అనుబంధం ఉంది.

సీతారాముల సాక్షిగా: ఈ పథకాన్ని 2024 మార్చి 11న, శ్రీరామనవమికి ముందు, భద్రాచలం పుణ్యక్షేత్రం వేదికగానే సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. సీతారాముల వారి చెంతనే ఇందిరమ్మ ఇళ్ల నమూనాను ఆవిష్కరించారు.

మొదటి అడుగు ఇక్కడే: ఇప్పుడు, గృహప్రవేశాలు కూడా రాష్ట్రంలోనే తొలిసారిగా ఇదే జిల్లాలో మొదలుకావడం ఒక విశేషం.ముఖ్యమంత్రి చేతుల మీదుగా బెండాలపాడులో ఈ కార్యక్రమం లాంఛనంగా ప్రారంభమైన తర్వాత, రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లోనూ మంత్రులు, ప్రజాప్రతినిధులు పూర్తయిన ఇళ్లను ప్రారంభించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad