Telangana housing scheme issues : సొంతిల్లు ప్రతి నిరుపేద కల. ఆ కలను నెరవేర్చేందుకే ప్రభుత్వం ‘ఇందిరమ్మ ఇళ్ల’ పథకానికి శ్రీకారం చుట్టింది. కానీ, క్షేత్రస్థాయిలో పరిస్థితి భిన్నంగా ఉంది. ఇల్లు మంజూరైనా మాకొద్దంటూ లబ్ధిదారులే స్వయంగా రాసిస్తున్నారు. నల్గొండ జిల్లాలో వేలమంది ఈ పథకం నుంచి వెనక్కి తగ్గడం ఆందోళన కలిగిస్తోంది. అసలు పేదలు తమ సొంతింటి కలను ఎందుకు వద్దనుకుంటున్నారు..? ప్రభుత్వ నిబంధనలే శాపంగా మారాయా..? అధికారుల కార్యాచరణ ఎలాంటి ఫలితాలనిస్తోంది..?
ప్రభుత్వం ఎంతో ఆశతో ప్రారంభించిన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పథకం నత్తనడకన సాగుతోంది. స్కీం ప్రారంభమై 10 నెలలు కావస్తున్నా పనుల్లో ఆశించినంత పురోగతి కనిపించడం లేదు. మరీ ముఖ్యంగా, ఇల్లు మంజూరైన లబ్ధిదారుల్లో చాలామంది నిర్మాణాలు చేపట్టట్లేదు. నల్గొండ జిల్లాలో ఇప్పటివరకు సుమారు 2,300 మంది లబ్ధిదారులు తమకు కేటాయించిన ఇళ్లను రద్దు చేయాలంటూ స్వయంగా అధికారులకు లేఖలు రాయడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. వీరిలో అత్యధికులు సొంత గూడు లేని నిరుపేదలే కావడం గమనార్హం.
నోటీసులు ఇస్తే.. రద్దు లేఖలిస్తున్నారు : నల్గొండ జిల్లాలోని ఆరు నియోజకవర్గాలతో పాటు, శాలిగౌరారం మండలంలో కలిపి మొత్తం 17,247 ఇళ్లను అధికారులు మంజూరు చేశారు. వీరిలో 13,541 మందికి ప్రొసీడింగ్స్ అందజేయగా, కేవలం 10,038 మంది మాత్రమే పనులు ప్రారంభించారు. ప్రొసీడింగ్స్ అందుకుని 45 రోజుల గడువు ముగిసినా పనులు చేపట్టని 3,503 మందికి అధికారులు నోటీసులు జారీ చేశారు. ఆ నోటీసులకు స్పందన రాకపోవడంతో, అధికారులు క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టగా అసలు విషయం బయటపడింది. చాలామంది తమకు ఇల్లు వద్దని, మంజూరును రద్దు చేయాలని అధికారులకు రాతపూర్వకంగా లేఖలు అందిస్తున్నారు. ఇలా ఇప్పటివరకు 2,300 మంది ఇళ్లను వద్దనుకున్నట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి. వీరి స్థానంలో త్వరలోనే కొత్త లబ్ధిదారులను ఎంపిక చేసే ప్రక్రియను చేపట్టనున్నారు.
అనాసక్తికి అసలు కారణాలివే : లబ్ధిదారులు సొంతింటి కలపై నీళ్లు చల్లుకోవడానికి బలమైన కారణాలే ఉన్నాయని తెలుస్తోంది.
కఠిన నిబంధనలు: ఇంటి నిర్మాణం 400 నుంచి 600 చదరపు అడుగులకు మించరాదని, తప్పనిసరిగా హాల్, కిచెన్, బెడ్‌రూం ఉండాలని గృహ నిర్మాణ శాఖ విధించిన నిబంధనలు ఇబ్బందిగా మారాయి.
ఆర్థిక ఇబ్బందులు: ప్రభుత్వం ఇచ్చే సహాయం విడతల వారీగా వస్తుంది. కానీ, నిర్మాణం ప్రారంభించడానికి పేదల వద్ద చేతిలో డబ్బు లేకపోవడం ప్రధాన అవరోధంగా మారింది.
వయోభారం: లబ్ధిదారుల్లో కొంతమంది వృద్ధులు కావడంతో, ఈ వయసులో ఇల్లు కట్టుకోవడం ఎందుకనే నిర్లిప్తతతో ఆసక్తి చూపడం లేదు.
అవగాహన లోపం: స్వయం సహాయక సంఘాల ద్వారా మహిళలకు రుణాలు ఇప్పిస్తామని చెబుతున్నా, ఆ ప్రక్రియపై లబ్ధిదారులకు సరైన అవగాహన కల్పించడంలో అధికారులు విఫలమవుతున్నారనే విమర్శలున్నాయి.
అధికారుల కార్యాచరణ : పనుల్లో వేగం పెంచేందుకు అధికారులు కార్యాచరణ రూపొందించారు. ఇల్లు మంజూరై ఇంతవరకు పునాది రాయి కూడా వేయని వారికి గ్రామ పంచాయతీ కార్యదర్శుల ద్వారా నోటీసులు జారీ చేస్తున్నారు. వారం రోజుల్లోగా నిర్మాణాలు ప్రారంభించాలని, లేని పక్షంలో ఇంటి నిర్మాణానికి సుముఖంగా లేమని రాతపూర్వకంగా లేఖ ఇవ్వాలని ఆ నోటీసుల్లో స్పష్టం చేస్తున్నారు.


