Indiramma Indlu survey app | ఇందిరమ్మ ఇళ్ల సర్వే మొబైల్ అప్లికేషన్ కొద్దిసేపటి క్రితం లాంచ్ అయింది. గురువారం తెలంగాణ సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన చేతుల మీదుగా యాప్ ని లాంచ్ చేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు, పొన్నం ప్రభాకర్, ఇతర నేతలు, అధికారులు పాల్గొన్నారు.
మొదటి విడతలో ఒక్కో నియోజకవర్గానికి 3,500 ఇళ్లు ఇవ్వనున్నారు. గ్రామసభల ద్వారా లబ్ధిదారుల ఎంపిక జరగనుంది. మహబూబ్‌నగర్, నిజామాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, మెదక్ జిల్లాల్లో పైలట్ ప్రాజెక్టుగా అమలు చేయనున్నారు. రాష్ట్రంలో పేదవారికి ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసింది. ఈ మేరకు ఇందిరమ్మ ఇళ్ల పథకం అమలుకు ఇందిరమ్మ ఇళ్ల సర్వే మొబైల్ అప్లికేషన్ (Indiramma Indlu survey app) ని రూపొందించింది. నిజామాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబ్‌నగర్, మెదక్ జిల్లాల్లో రెండేసి చొప్పున పైలట్ ప్రాజెక్టుగా ఈ యాప్ ద్వారా దరఖాస్తుదారుల వివరాలు తీసుకున్నారు. ఈ క్రమంలో ఎలాంటి సమస్యలు తలెత్తకపోవడంతో నేడు అధికారికంగా ప్రారంభించారు.